close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ వేటు

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తిరుగుబావుటా ఎగరేసిన యువనేత సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ అధినాయకత్వం కొరడా ఝళిపించింది. స్వయానా రాహుల్‌గాంధీ, ప్రియాంకలు చెప్పినా పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించి, పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచే కాకుండా పీసీసీ అధ్యక్ష పదవి నుంచీ తొలగించింది. ఆయనకు సన్నిహితులైన విశ్వేంద్రసింగ్‌, రమేష్‌ మీనా అనే ఇద్దరు మంత్రులకూ ఉద్వాసన పలికింది. అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కే అధిష్ఠానం అండగా నిలిచింది. విద్యాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ను పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. క్లినికల్‌ ట్రయల్స్‌కు తొలి అడుగు

కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌- ఐసీఎంఆర్‌ సంయుక్తంగా చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌కు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా నిమ్స్‌లో ఆరుగురి వాలంటీర్ల నుంచి మంగళవారం రక్త నమూనాలు సేకరించారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది. క్లినికల్‌ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు అవకాశం లభించింది. కొద్దిరోజులుగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా వైద్యం నిరాకరిస్తే అనుమతుల రద్దు

కరోనా కేసులు వస్తే ఏ ఆసుపత్రిలోనూ వైద్యం నిరాకరించకూడదని, అలా చేస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని సీఎం జగన్‌ హెచ్చరించారు. కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అంత్యక్రియల సందర్భంగా ఇటీవల వెలుగుచూసిన ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్‌తో దీర్ఘకాలం పోరాడాలని, అనుమానితులు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోడానికి శాశ్వత కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఆయన సమీక్షించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ-విద్యారంభం కరిష్యామి!

ఉద్యోగ, పోటీ పరీక్షల శిక్షణ సంస్థలు, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రమే ఇప్పటివరకూ పాఠ్యాంశాల బోధనను రికార్డు చేసి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో విద్యాశాఖ కూడా అదేబాట పడుతోంది. ఇంటర్‌ విద్యాశాఖ త్వరలో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించబోతోంది. ఇందుకోసం నిపుణులతో పాఠాల బోధనను రికార్డు చేయిస్తోంది. ఆదర్శ పాఠశాలలు, రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కూడా ఇటీవలే యూట్యూబ్‌ ఛానళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలను వినడంతో పాటు, రికార్డు చేసిన వీడియోల ద్వారా తమకు ఇష్టం వచ్చినప్పుడు వినడానికి, ఎన్నిసార్లయినా వినడానికి అవకాశం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యనమల లెక్కలు ఎక్కడివో?

రాష్ట్ర వృద్ధిరేటు, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం వంటి విషయాల్లో తెదేపా నేత యనమల రామకృష్ణుడు చెప్పే లెక్కలన్నీ తప్పులేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. వృద్ధి రేటు ప్రపంచ వ్యాప్తంగా తగ్గిందని, పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. 2018-19లో వృద్ధి 15.33%గా అంచనా వేశారని, ఆ తర్వాత తొలి సవరించిన అంచనాలకు అది 8.8%కు తగ్గిందని, తర్వాత సవరణల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం 6.5% పెరిగిందని యనమల చెప్పిన లెక్కా తప్పేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సగటున 4.77% ద్రవ్యోల్బణం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అది 3.54% ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 80% కేసుల్లో లక్షణాలు లేవు

తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి వ్యాధి లక్షణాలే లేవని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో కొవిడ్‌ మరణాల రేటు 2.7 శాతం ఉంటే తెలంగాణలో అది ఒక్క శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే మూడు నెలలు కీలకమని, క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అవసరమైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్రిపుల్‌ ఐటీ, ఇంటర్‌పై పరేషాన్‌

పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు లేకుండా మార్కుల జాబితాల్లో (మెమో) ఉత్తీర్ణులైనట్లు ఇవ్వనుండటంతో ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐ, ఇంటర్‌ ప్రవేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. హాల్‌ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని, గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉండవని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్‌, ఒకసారి అనుత్తీర్ణులైన  విద్యార్థులకు కలిపి 6,38,604 హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు. ఇప్పుడు వీరంతా ఉత్తీర్ణులైనట్లే. పదో తరగతి తర్వాత ఇంటర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు విద్యార్థులు సాధించిన గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇస్రో అధిపతి శివన్‌కు ‘వాన్‌ కర్మన్‌’ పురస్కారం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి కైలాసవాడివో శివన్‌కు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వాన్‌ కర్మన్‌ అవార్డు-2020ను ప్రకటించారు. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సంస్థ (ఐఏఏ) 1982 నుంచి ఏటా ఈ పురస్కారాన్ని స్పేస్‌ టెక్నాలజీలో మహోన్నత విజయాలు సాధించిన వారికి జీవితకాల అవార్డుగా అందజేస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో దీనిని శివన్‌కు ప్యారిస్‌లో బహూకరించనున్నారు. ఏరో డైనమిక్స్‌లో అమెరికాకు చెందిన థియోడర్‌ వాన్‌ కర్మన్‌ అనే ఏరో స్పేస్‌ ఇంజినీర్‌ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును నెలకొల్పారు. గతంలో భారత్‌ నుంచి ఈ అవార్డును యూఆర్‌ రావు, కస్తూరి రంగన్‌ అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ సలహా విరాట్‌ను మార్చింది

తాను ఇచ్చిన ఓ సలహా వల్ల ఆటగాడిగా విరాట్‌ కోహ్లి ఎంతో మెరుగుపడ్డాడని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ అన్నాడు. తనలో అత్యుత్తమ ప్రతిభను ఉపయోగించుకోవట్లేదని గ్రహించి అతనితో మాట్లాడినట్లు ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు చెప్పాడు. ‘‘తొలిసారి విరాట్‌ కోహ్లీని చూసినప్పుడు అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించా. అతను కుర్రాడు.. ఆ ప్రతిభను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవట్లేదని అర్థమైంది. ఈ విషయంలో చాలాసార్లు విరాట్‌తో మాట్లాడా’’ అని గ్యారీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను ఓ సంఘటనను కూడా గుర్తు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వెబ్‌సిరీస్‌లో సూర్య

కథానాయకుడు సూర్య డిజిటల్‌ తెరపైకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన త్వరలో మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నారని సమాచారం. ‘నవరస’ అనే పేరుతో రూపొందబోయే ఈ వెబ్‌సిరీస్‌.. 9 ఎపిసోడ్లుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వీటిలో ఒక్కోదాన్ని ఒక్కో దర్శకుడితో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పుడిందులోనే ఓ ఎపిసోడ్‌లో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కథానాయకులు విక్రమ్‌, మాధవన్‌, సిద్ధార్థ్‌ తదితరులు ఈ వెబ్‌సిరీస్‌లోని కొన్ని భాగాల్లో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.