43 ఏళ్ల తర్వాత గూగుల్‌ సాయంతో ఇంటికి..
close

తాజా వార్తలు

Published : 20/06/2020 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

43 ఏళ్ల తర్వాత గూగుల్‌ సాయంతో ఇంటికి..

ముంబయి : సామాజిక మాధ్యమాల ద్వారా చెడే కాదు.. మంచి కూడా జరుగుతుందని మరోసారి నిరూపితమైంది. అనుకోకుండా ఇంటి నుంచి దూరమైన ఓ వృద్ధురాలు 43 ఏళ్ల తర్వాత గూగుల్‌, వాట్సాప్‌ సాయంతో ఇంటికి చేరింది. వివరాల్లోకి వెళితే..

పంచుబాయ్‌ అనే ఓ వృద్ధురాలు (90) ప్రస్తుతం మహారాష్ట్రలోని తాల గ్రామంలో నివసిస్తోంది. 40 ఏళ్ల క్రితం అమరావతి జిల్లా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఎలాంటి ఆశ్రయం లేకుండా ఉన్న ఆమెను చూసి నూర్‌ ఖాన్‌ అనే వ్యక్తి తాల గ్రామానికి తీసుకొచ్చాడు. ఎంత అడిగినా ఆచూకీ చెప్పలేకపోవడంతో తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆమెకు అచ్చన్‌ అని పేరు కూడా పెట్టాడు. కొన్ని నెలల క్రితం నూర్‌ ఖాన్‌ చనిపోయాడు. దీంతో అచ్చన్‌ను ఎలాగైనా సొంతింటికి చేర్చాలని భావించిన నూర్‌ ఖాన్‌ కుమారుడు ఇశ్రార్‌ ఖాన్‌.. చిరునామా కోసం ఆరా తీశాడు. ఆమె ఎంత చెప్పినా ఇశ్రార్‌కు ఆ అడ్రస్‌ అర్థం కాలేదు. వెంటనే గూగుల్‌ మ్యాప్‌‌ తెరిచి ఆమె చెప్పిన పదాల్ని రికార్డు చేసి ఆ ప్రాంతాన్ని వెతికాడు. అది అమరావతి జిల్లా కంజమ్‌ నగర్‌ అని తేలింది. దీంతో వెంటనే ఆ గ్రామ అధికారి ఫోన్‌ నెంబర్‌ను ఇంటర్నెట్‌ సాయంతో కనుక్కున్నాడు. ఫోన్‌ చేసి వివరాలు తెలియజేశారు. వాట్సాప్‌ ద్వారా ఆ వృద్ధురాలి ఫొటో పంపడంతో 43 ఏళ్ల క్రితం తప్పిపోయిన పంచుబాయ్‌ అని తేలింది. 

ఈ విషయాన్ని ఆ అధికారి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమె మనవడు పృథ్వీరాజ్‌ షిండే వెంటనే ఇశ్రార్‌ ఖాన్‌ను సంప్రదించాడు. అలా నేడు ఇశ్రార్‌ ఆ వృద్ధురాల్ని షిండేకు అప్పగించాడు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తన తాత తేజ్‌పాల్‌, నాన్న బైలాల్..‌ పంచుబాయ్‌ కోసం ఎంతో వెదికారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారని వివరించాడు.  2005లో తన తాత.. మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించారని తెలిపాడు. చివరి వరకు వారిద్దరూ పంచుబాయ్‌ తిరిగొస్తుందని కళ్లు కాయలు కాచేలా వేచిచూశారని, ఆమెను చూడకుండానే చనిపోయారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎట్టకేలకు 43 ఏళ్ల తర్వాత నాన్నమ్మ ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నాడు. ఇన్నాళ్లూ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్న ఇశ్రార్‌ ఖాన్‌ కుటుంబానికి షిండే ధన్యవాదాలు తెలిపాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని