
తాజా వార్తలు
భారత్ కరోనా పరీక్షల సామర్థ్యం 1000రెట్లు!
ఎంతకాలంలో అంటే...
దిల్లీ: కొవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో కీలక అంశమైన కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో భారత్ గణనీయ ప్రగతిని సాధించింది. దేశవ్యాప్తంగా ఒకే ఒక ల్యాబ్‌లో రోజుకు ఒక్క పరీక్షను మాత్రమే నిర్వహించగలిగే పరిస్థితి నుంచి... దేశం నలుమూలలా విస్తరించిన 555 ల్యాబ్‌లలో, రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించగలిగే స్థాయికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు సుమారు 25 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) గణాంకాలు చెబుతున్నాయి. క్రమక్రమంగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తున్న భారత్ కరోనా పరీక్షల సామర్థ్యం గత 60 రోజుల్లో 1000 రెట్లు పెరిగింది.
అత్యుత్తమ మార్గం
కరోనా కట్టడికి పరీక్షల సంఖ్యను పెంచటమే అత్యుత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు నొక్కి చెప్పింది. భారత్ ఇందుకు అనుగుణంగా దేశంలో యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహించేందుకు ‘మిషన్ లైఫ్‌లైన్ ఉడాన్’ పేరుతో 150 విమానాల ద్వారా సుమారు 40 టన్నుల పరీక్షా సామగ్రిని సరఫరా చేస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, ల్యాబ్‌లకు నిరంతరాయంగా పరీక్ష సామగ్రిని అందించేందుకు దేశవ్యాప్తంగా 16 గోదాములను ఏర్పాటుచేసింది. దేశంలోని మూడు నిర్మాణ సంస్థలు రోజుకు రెండు లక్షల స్వాబ్ కిట్లను తయారుచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితిలో, లక్షణాలు ప్రస్ఫుటంగా ఉన్నవారికి మాత్రమే కాకుండా, నేడు సమాజంలో వివిధ వ్యక్తులకు యాదృచ్చిక పరీక్షలను కూడా నిర్వహిస్తోంది.
సరైన దిశలోనే...
దేశంలో గత మూడు రోజుల్లో 16,000 కొత్త కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక గురువారం ఒక్కరోజే ఆరువేలకు పైగా కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటుకు అనుగుణంగా భారత్ తన పరీక్షా సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది. కరోనా విషయంతో మనం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నామనేందుకు ఇది నిదర్శనంగా ఉంది. అయితే పదిలక్షల మందిలో రెండువేల మందికి పరీక్షలు జరుగుతున్న భారత్, స్పెయిన్ (సుమారు 65,000), అమెరికా (సుమారు 38,000) జర్మనీ (సుమారు 38,000), ఫ్రాన్స్ (సుమారు 21,000) తదితర దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉందని అంగీకరించక తప్పదు.
ప్రపంచ కరోనా పటంలో భారత్...
అత్యధిక జనాభా గత దేశాల్లో రెండోదైన భారత్ మొత్తం కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. సగటున ప్రతి 10 లక్షల మందికి 87 కేసులతో 151వ స్థానంలో, కేవలం మూడు మరణాలతో 90వ స్థానంలో ఉండటం ఊరట కలిగించే విషయం. పరీక్షల విషయంలో కేవలం కొన్ని నెలల్లోనే భారత్ పూర్తి స్వయం సమృద్ధిని సాధించడం గొప్ప విషయమని ... ఇది దేశంలోని వివిధ వ్యవస్థల దృఢ సంకల్పం, నిరంతర కృషి, చక్కటి సమన్వయంతోటే సాధ్యమయిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.