వలస కూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధి
close

తాజా వార్తలు

Updated : 20/06/2020 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధి

రూ.50 వేల కోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌

దిల్లీ: వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50వేల కోట్లతో ఓ సరికొత్త ఉపాధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బిహార్‌లోని ఖగరియా జిల్లా తెలిహార్‌ గ్రామంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వలసకూలీలకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించనున్నారు. వలసకార్మికులు ఎక్కువగా ఉన్న బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో దీన్ని తొలుత ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. దీని కోసం 25 రకాల పనులను గుర్తించారు. ఈ పథకం ద్వారా 125 రోజులపాటు కార్మికులకు పని కల్పించనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు 25 వేల మంది కార్మికులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతరాష్ట్రం బిహార్‌కు తిరిగొచ్చిన వలసకార్మికులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా వారి కష్టాలు తీరనున్నాయని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మోదీ ఇటీవల సరిహద్దుల్లో మరణించిన వీరజవాన్లకు నివాళులర్పించారు. వారంతా బిహార్‌ రెజిమెంటుకు చెందినవారేనని గుర్తుచేశారు. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన వీరసైనికుల త్యాగాన్ని చూసి యావత్తు దేశం గర్విస్తోందన్నారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని