
తాజా వార్తలు
వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ సాయం కోరిన రష్యా
దిల్లీ/మాస్కో: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కరోనాపై ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుందని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
తాజా మీడియా సమావేశంలో దిమిత్రియేవ్ మాట్లాడుతూ వ్యాక్సిన్ తయారీకి లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతో పాటు మరి కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ‘‘వ్యాక్సిన్ తయారీ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మేం భారత్‌తో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. వారు గమలేయ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలరని మేం నమ్ముతున్నాం. ప్రస్తుతం వ్యాక్సిన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వారి భాగస్వామ్యంతోనే వ్యాక్సిన్‌ను మేం సరఫరా చేయగలం’’ అని దిమిత్రియేవ్ తెలిపారు.
గతంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌తో చర్చలు జరిగాయి. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తితో పాటు ఎగుమతికి అనుమతి కోరినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దిమిత్రియేవ్ తాజా ప్రకటన చేశారు. అలానే భారత్, యుఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్లో కూడా స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తం ఐదు దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీలో వ్యాక్సిన్‌కు అధిక డిమాండ్ ఉందని అన్నారు.