
తాజా వార్తలు
ఆర్బీఐపై ఆశలతో లాభాల దిశగా సూచీలు!
ముంబయి: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 1,039 పాయింట్లు లాభపడి 30,986 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 358 పాయింట్లు ఎగబాకి 8,999 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు రూ.1.70లక్షల కోట్ల ఉద్దీపన పథకం ప్రకటించడం సూచీల సెంటిమెంటును పెంచింది. అలాగే మరికాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశానికి పిలుపునివ్వడమూ మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది. వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు మార్కెట్లో ద్రవ్యలభ్యత పెంచడం కోసం ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా జి-20 దేశాలు 5లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపాదించడం కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
షిప్పింగ్ కార్పొరేషన్, ఐటీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్ఏఎల్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ఇన్యూరెన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.