
తాజా వార్తలు
కరోనా భయాలు.. మార్కెట్లకు నష్టాలు
ముంబయి: దేశీయ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. కరోనా భయాలు, ప్రపంచ మార్కెట్ల ప్రభావం, మాంద్యం పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 29 వేల దిగువకు చేరింది. సెన్సెక్స్ 1375.27 పాయింట్లు నష్టపోయి 28,440 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 379.15 పాయింట్లు నష్టపోయి 8,281.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.57 వద్ద కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరగడం, ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో ఈ సంఖ్య అధికంగా ఉండడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని దేశాల్లో లాక్డౌన్ పొడిగింపు వార్తలు అందుకు ఆజ్యం పోశాయి. ఆసియా మార్కెట్లలో ఒక్క ఆస్ట్రేలియా మార్కెట్లు మినహా మిగిలిన మార్కెట్లు నష్టాలు బాట పట్టడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీనికితోడు భారత్ వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ సంస్థలు తగ్గించడం, మాంద్యంలోకి ప్రవేశించామన్న ఐఎంఎఫ్ హెచ్చరికలు, క్రూడాయిల్ ధరలు పడిపోవడం మన మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, మెటల్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీలో సిప్లా, టెక్ మహీంద్రా, నెస్లే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.