టిక్‌టాక్‌ ఇకపై టిక్‌టాక్‌ గ్లోబల్‌గా..
close

తాజా వార్తలు

Updated : 20/09/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ ఇకపై టిక్‌టాక్‌ గ్లోబల్‌గా..

ఇక యాప్‌పై అమెరికాలో నిషేధం లేనట్లే!

వాషింగ్టన్‌: ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్‌ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్‌ కంపెనీలతో కలిసి టిక్‌టాక్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ కలిసి అమెరికాలో యాప్‌ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీకి శ్వేతసౌధం సహకారం ఉంటుందన్నారు. దీంతో ఈ మూడు కంపెనీలు కలిసి టెక్సాస్‌ కేంద్రంగా ‘టిక్‌టాక్‌ గ్లోబల్‌’ అనే మరో కొత్త సంస్థను నెలకొల్పుతున్నట్లు తెలిసింది. దీంతో మరో 25 వేల కొత్త ఉద్యోగాలు రాబోయే అవకాశం ఉందని ట్రంప్‌ అన్నారు. పౌరుల సమాచారానికి 100శాతం భద్రత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ఏర్పడే సంస్థలో అమెరికా వినియోగదారుల సమాచారాన్ని పూర్తిగా ఒరాకిలే నిర్వహిస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా విదేశీ పెట్టుబడుల్ని పర్యవేక్షించే కమిటీ నుంచి అనుమతులు రాగానే టిక్‌టాక్‌ గ్లోబల్‌ కార్యకలాపాలు మొదలు పెడుతుందని వెల్లడించారు. యాప్‌పై విధించిన నిషేధాన్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు శనివారం సాయంత్రం వాణిజ్య శాఖ ప్రకటించింది. అప్పటిలోపు అనుమతులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే నిషేధాన్ని వాయిదా వేసినట్లు అర్థమవుతోంది.

టిక్‌టాక్‌ గ్లోబల్‌లో 53శాతం వాటాలు అమెరికాకు చెందిన వారికి.. 36శాతం వాటాలు చైనా పెట్టుబడిదారులకు చెందే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం బైట్‌డ్యాన్స్‌లో 40శాతం వాటాలు అమెరికా మదుపర్ల చేతిలో ఉన్నాయి. బోర్డులో అమెరికాకు చెందిన డైరెక్టర్లే ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. ఒక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌తో పాటు భద్రతా నిపుణులు కూడా బోర్డులో ఉంటారని తెలిపారు. మరో ఏడాదిలో టిక్‌టాక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. 

దీనిపై స్పందించిన టిక్‌టాక్‌.. అమెరికా ప్రభుత్వం లేవనెత్తిన భద్రత, గోప్యతకు సంబంధించిన అభ్యంతరాలు ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌తో కలిసి చేసుకునే ఒప్పందాలతో తొలగిపోతాయని భావిస్తున్నామని తెలిపింది. అమెరికా పౌరుల సమాచారాన్ని నిర్వహించడంతో పాటు.. టిక్‌టాక్‌ సోర్స్‌ కోడ్‌ తనఖీని ఒరాకిల్‌ చేపట్టడం తమకు సమ్మతమేనని వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని