close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120000466 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => VbuK58iQ_qc [video_short_link] => VbuK58iQ_qc [created_by] => [created_date] => [modified_by] => 8925327 [modified_date] => 2020-01-02 09:35:27.309494 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 02/01/2020 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహేశ్‌ను కొట్టడానికి చేతులు రాలేదు!

ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్‌ మరో స్థాయిలో ఉంటుంది

అసలు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించాలన్న ఆలోచన తనకు లేదని అయితే, అనిల్‌ రావిపూడి చెప్పి కథ చాలా బాగుండటంతో చేశానని అన్నారు ప్రముఖ నటి విజయశాంతి. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త సంవత్సరం సందర్భంగా నటి విజయశాంతితో కలిసి, అనిల్‌ రావిపూడి సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

చాలా రోజుల తర్వాత మళ్లీ నటిస్తున్నారు మీ ఫీలింగ్‌ ఎలా ఉంది?

విజయశాంతి: చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం అంతా కొత్తగా, పాజిటివ్‌గా ఉండబోతోంది.

గత సంక్రాంతికి ‘ఎఫ్‌2’తో హిట్‌ కొట్టారు..? మళ్లీ హిట్‌ రిపీట్‌ చేస్తున్నారా?

అనిల్‌ రావిపూడి: ఈ జనవరి, సంక్రాంతి చాలా ప్రత్యేకం నాకు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. ఇందులో అనేక ఛాలెంజ్‌లు ఉన్నాయి. ప్రతి సినిమాకు నన్ను నేను మెరుగు పరుచుకుంటూ ఉన్నా. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఒకటి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నన్ను నమ్మి సినిమా ఇవ్వడం. 13ఏళ్ల తర్వాత విజయశాంతిగారు నా సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం. కాబట్టి ఈ సంక్రాంతి నాకు చాలా స్పెషల్‌గా ఉండబోతోంది. 

13ఏళ్ల తర్వాత మీరు మళ్లీ మేకప్‌ వేసుకున్నారు? ఏం చెప్పి అనిల్‌ మిమ్మల్ని ఒప్పించారు? 

విజయశాంతి: అసలు సినిమాలు చేయొద్దన్న  ఆలోచనలోనే ఉన్నాను. నాతో ఒక సినిమా చేయాలని అనిల్‌ ఎప్పటి నుంచో నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. ఈ చిత్రం కన్నా ముందు ఒక సినిమా కోసం నన్ను అడిగారు. కాకపోతే, ఆ సమయానికి నేను చాలా బిజీగా ఉన్నాను. నా వల్ల కాలేదు. చేయనని చెప్పాను. గతేడాది వచ్చి నన్ను కలిసి మరో సినిమా చేయాలని అడిగారు. నేను కూడా కాస్త ఫ్రీగా ఉండటంతో వచ్చి కథ చెప్పమని అడిగా. అయితే, అప్పటికి కూడా నటించాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు. నాలుగైదు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పారు. చాలా బాగా అనిపించింది. కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఉన్నాయి. ‘బాగుంది’ అని చెప్పిన తర్వాత సినిమా చేయకపోతే సరైన పద్ధతి కాదు. ఆ విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. అయితే, విజయశాంతి చిత్రమంటే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా ఒప్పుకొన్నా. 

భారతి అనే పేరుతో మీకేమైనా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా?

విజయశాంతి: ‘ప్రతిఘటన’ గుర్తుకు వస్తోంది. అసలు ఆ సినిమా కూడా చేయడానికి నాకు సమయం లేదు. అంత బిజీగా ఉన్నా, టి.కృష్ణగారు పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. నిర్మాతలను కూడా ఒప్పించి ఎలాగో ఆ సినిమా పూర్తి చేశారు. మంచి హిట్టయింది. ఈ సినిమా విషయంలో నాకు అదే గుర్తుకు వస్తోంది. ‘నా వల్ల కాదు’ అని చెబితే కూడా అనిల్‌గారు ఒప్పించి మరీ సినిమాను ఒకే చేయించారు. ఒక సినిమా ఒక ఆర్టిస్ట్‌ చేయాలని రాసి పెట్టి ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్టవుతుందని అనిపిస్తోంది. ఎందుకంటే డబ్బింగ్‌ చెప్పేటప్పుడు చూశా. చాలా బాగా వచ్చింది. 

విజయశాంతి తప్ప మీ మనసులో మరో నటి లేరా?

అనిల్‌ రావిపూడి: లేరు. ఈ సినిమా కన్నా ముందే ‘రాజా ది గ్రేట్‌’ సినిమా కోసం విజయశాంతి గారిని కలిశా. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ లైన్‌ అనుకున్నా. అప్పుడు కూడా ఈ పాత్రకు విజయశాంతిగారి పేరును రాసేసుకున్నా. కథ మహేశ్‌గారికి చెప్పిన తర్వాత ‘మేడమ్‌ను కలవబోతున్నా’ అని ఆయనకు చెప్పా. ‘ఆవిడ చేస్తారా’ అని అడిగారు. ‘నాకు ఆవిడతో పరిచయం ఉంది. వెళ్లి అడుగుతా’ అని చెప్పాను. ఒకసారి కాదు, నాలుగైదు సార్లు వెళ్లి కలిసి రిక్వెస్ట్‌ చేశా. ఎందుకంటే ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేను. మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు. వేరే వాళ్లు చేస్తే ఆ మేజిక్‌ రాదు. అది మిస్సవకూడదనే ఉద్దేశంతోనే అంతలా బతిమిలాడా. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. మీరు అది గమనించారా?

విజయశాంతి: ఆయన చాలా టాలెంట్‌ ఉన్న దర్శకుడు. అస్సలు టెన్షన్‌ పడరు. సరదాగా, పండగ వాతావరణంలో జరిగినట్లు ఉంటుంది. ‘ఇంత త్వరగా సినిమా అయిపోయిందా?’ అనిపిస్తోంది. మరో పదేళ్లు ఇండస్ట్రీని ఏలుతారు. ఒక్కో సినిమాకు ఒక్కో టైప్‌ సబ్జెక్ట్‌ను తీసుకుంటున్నారు. ఈ సినిమాను కూడా చాలా విభిన్నంగా హ్యాండిల్‌ చేశారు. వెండితెరపై మీరే చూస్తారు. అన్ని సమపాళ్లలో కుదిరాయి. ఇలాంటివి సీనియర్‌ డైరక్టర్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అనిల్‌ రావిపూడి గారికి మంచి భవిష్యత్‌ ఉంది. అద్భుతమైన పంచ్‌లతో కామెడీ డైలాగ్‌లు రాస్తారు. 

అనిల్‌ రావిపూడి: విజయశాంతిగారితో ఎక్కువ సన్నివేశాలు యాక్షన్‌, ఎమోషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతాయి. ఫన్నీ సీన్లు చాలా తక్కువ ఉంటాయి. 

చిన్నప్పుడు మహేశ్‌బాబుతో కలిసి నటించారు. ఇప్పుడు ఆయన స్టార్‌ హీరో. మరి ఈ సినిమాకు పనిచేయడం ఎలా ఉంది?

విజయశాంతి: 1988లో ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో నటించాం. అప్పుడు 14ఏళ్లు. చాలా క్యూట్‌గా ఉండేవాడు. ఒక సీన్‌లో మహేశ్‌ను కొట్టాలి. చేయి దగ్గరకు వెళ్తోంది కానీ, కొట్టడానికి మనసు ఒప్పుకోవడం లేదు. చాలా టేక్‌లు తీసుకున్నా. ‘మీరు కొడతారా? లేక షూటింగ్‌ పేకప్‌ చెప్పమంటారా?’ అని కృష్ణగారు కోప్పడ్డారు. అప్పుడు బాబు వచ్చి ‘పర్వాలేదండీ.. కొట్టండి..’ అని క్యూట్‌గా అన్నాడు. అలాంటి చిన్న పిల్లవాడు.. ఇప్పుడు సూపర్‌స్టార్‌. మళ్లీ కలిసి నటిస్తానని నేను అనుకోలేదు. ఆ సినిమా షూటింగ్‌లో బాబుని నేను చూసుకునేదాన్ని. ఈ సినిమాకు మహేశ్‌ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. అసలు ఒక సూపర్‌స్టార్‌ అన్నట్లే ఉండరు. పెద్ద వాళ్లంటే గౌరవం. చాలా మర్యాదగా ఉంటారు. 

మహేశ్‌బాబును డైరెక్ట్‌ చేయడం మీకెలా అనిపించింది?

అనిల్‌ రావిపూడి: నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. ‘ఎఫ్‌2’ జరుగుతుండగానే ఆయనను కలిసి కథ చెప్పా. ఆయన నన్ను నమ్మడం ఒక ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. కథే ఈ సినిమాకు హీరో. బోర్డర్‌ నుంచి వచ్చిన ఒక సైనికుడికి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నది చూపించబోతున్నాం. విజయశాంతిగారి పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్‌. మహేశ్‌-విజయశాంతి గార్ల మధ్య సన్నివేశాలు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. ఈ సినిమాతో ఒక మంచి హిట్‌ ఇచ్చి, మహేశ్‌గారి కళ్లలో ఆనందం చూడటమే నా లక్ష్యం. ఈ సినిమా విషయంలో మరొకరికి థ్యాంక్స్‌ చెప్పాల్సి వస్తే, అది విజయశాంతిగారికే. 

సినిమా కోసం ఏకంగా కొండారెడ్డి బురుజు సెంటర్‌ సెట్‌ వేశారు. చాలా రిచ్‌గా తీశారని అర్థమవుతోంది. వాళ్ల గురించి మీ అభిప్రాయం?

విజయశాంతి: ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్‌ కాలేదు. చాలా సెట్‌లు వేశారు. మంచి నిర్మాతలు దొరికారు. చాలా బాగా చూసుకున్నారు. 
అనిల్‌ రావిపూడి: మహేశ్‌ కూడా విజయశాంతిగారి గురించి ఆరా తీసేవారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమనేవారు. ఇక పని విషయంలో ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఉదయం సెట్‌కు వచ్చారంటే మళ్లీ బ్రేక్‌ ఇచ్చినప్పుడే బయట వెళ్తారు. 

అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏం తేడా గమనించారు?

విజయశాంతి: ఇప్పుడు చేస్తున్నట్లు ఈవెంట్లు ఏవీ ఉండేవి కావు. కేవలం 100 రోజుల ఫంక్షన్‌ చేసేవారు. పబ్లిసిటీ పెరిగింది. ఇది కూడా బాగానే ఉంది. నేను కూడా ఆస్వాదిస్తున్నా. 

మీరు హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు కారులోనే మేకప్‌ వేసుకుని, షూటింగ్‌కు వచ్చేవారట. సౌకర్యాల గురించి అడిగేవారు కాదట!

విజయశాంతి: ఇప్పుడంటే కారులో, సెట్‌లో ఏసీ ఉంటుంది.  అప్పుడు అవేవీ ఉండేవి కావు. ఒకరోజులో ఆరు షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఒక్కొక్కటీ ఒక్కో లొకేషన్‌లో ఉండేది. నిర్మాతలకు ఇబ్బంది కలిగించే వాళ్లం కాదు. అందుకే కారులోనే మేకప్‌, హెయిర్‌స్టైల్‌ చేసుకునేవాళ్లం. జనరేటర్‌ వ్యానులో డ్రెస్‌లు మార్చుకునేవాళ్లం. అప్పట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవాళ్లం. జయాపజయాలతో సంబంధం ఉండేది కాదు.  ఇప్పుడు చేసే ప్రతి సినిమా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మీడియా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. 

అప్పట్లో మీరు కర్తవ్యంలాంటి పవర్‌ఫుల్‌ పాత్రలు చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతి పాత్ర కూడా అలాంటిదేనా?

విజయశాంతి: ఆ పాత్రతో దీన్ని పోల్చడం లేదు. అయితే, మహేశ్‌బాబులాంటి స్టార్‌ హీరో ఉన్న సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్ర చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. సినిమా కూడా బ్లాక్‌బస్టర్ హిట్టవుతుంది. మహేశ్‌ కామెడీ టైమింగ్‌ చాలా కొత్తగా ఉంది. ప్రకాష్‌రాజ్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారు, రావు రమేష్‌గారు, రష్మిక చాలా బాగా చేశారు. రైలు ఎపిసోడ్‌ చూసి పడి పడి నవ్వాను. చాలా ఏళ్ల తర్వాత టెన్షన్‌ నుంచి రిలీఫ్‌ అయినట్లు అనిపించింది. 

మహేశ్‌ యాక్షనే కాదు.. కామెడీ టైమింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీ శైలిలో ఆయన పాత్రను ఎలా తీర్చిదిద్దారు?

అనిల్‌ రావిపూడి: మహేశ్‌గారు కామెడీ చాలా చక్కగా చేస్తారు. నేను కామెడీ సీన్లు రాసేటప్పుడు ఏదైనా కొత్తగా ఉండేలా చూసుకుంటాను. అయితే,  నేను చెప్పిన పాత్రను మహేశ్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు. చాలా విలువలు కూడా ఉన్నాయి. ఆయా సన్నివేశాలకు తగినట్లు మహేశ్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. 

సంక్రాంతిని మీరెలా జరుపుకొంటారు? మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా?

విజయశాంతి: పల్లెల్లో బాగా చేసుకుంటారు. మాకు అలా ఆస్వాదించే సమయం ఉండేది కాదు. టీవీల్లో చూసి ఎంజాయ్‌ చేసేవాళ్లం. 

అనిల్‌ రావిపూడి: సంక్రాంతి సెంటిమెంట్‌ ‘ఎఫ్‌2’తో బాగా కలిసొచ్చింది. నాకు ఇష్టమైన పండగ. నేను చదువుకునేటప్పుడు సంక్రాంతికి బాగా సినిమాలు చూసేవాడిని. 

ప్రొఫెసర్‌ భారతి పాత్రతో మీకెలాంటి అనుబంధం ఏర్పడింది?

విజయశాంతి: చాలా హుందాగా ఉంటుంది. తెరపై చూస్తే మీకే తెలుస్తుంది. దాదాపు 13ఏళ్ల తర్వాత నా రీఎంట్రీకి ఇదే కరెక్ట్‌ సినిమా అనిపిస్తోంది. డిఫరెంట్‌ పాత్రలు చేయాలని ఆర్టిస్ట్‌లైన మాకు అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు మంచి పాత్రను వదులుకోకూడదు. 

ప్రతి సినిమాలో మహిళ ప్రాతను బలంగా చూపిస్తూ, అంతర్లీనంగా సందేశం ఇస్తారు. ఇందులో కూడా అలాంటిదే ఉందా? 

అనిల్‌ రావిపూడి: ప్రతి సినిమాలో మహిళ పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాను. ఈ సినిమాలో విజయశాంతిగారి పాత్ర ద్వారా అది తర్వాతి స్థాయిలో ఉంటుంది. ఈ సినిమాలో ఒక సహజత్వం ఉంటుంది. 

దేవిశ్రీ ఇప్పటికే మంచి పాటలు ఇచ్చారు. ఆయన గురించి? 

విజయశాంతి: ఈ సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. నాకు బాగా నచ్చింది. ‘సూర్యుడివో.. చంద్రుడివో..’ మనసుకు హత్తుకునేలా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పాట విన్న ఫీలింగ్‌ కలిగింది. 

అనిల్‌ రావిపూడి: రామజోగయ్య శాస్త్రిగారు ఈ పాటను రాశారు. కథలో ఒక ప్రధాన సన్నివేశంలో ఈ పాట వస్తుంది. దీంతో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ యాంథమ్‌ కూడా చాలా బాగుంటుంది. 
 Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.