
తాజా వార్తలు
ప్రైవేటీకరణకు భాజపా-వైకాపా కుట్ర: శైలజానాథ్
విశాఖ: ప్రభుత్వ పరిశ్రమలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. విభజన చట్టంలోని హామీలను తుంగలో తొక్కడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి భాజపా, వైకాపా కలిసి కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న రాష్ట్ర బంద్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని.. ప్రజా స్పందన చూసిన తర్వాతైనా కేంద్రం తమ మొండి పట్టుదల వీడాలన్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని.. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.