
తాజా వార్తలు
పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు: ఈటల
హైదరాబాద్: లాలాపేట, శ్రీరాంనగర్, అంబర్పేట, బార్కాస్, జంగంపేట, పానీపురా, పురానాపూల్, సీతాఫల్మండి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పిన ఈ అధునాతన నిర్ధారణ పరీక్షల కేంద్రాలను శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. పేద ప్రజలకు చేరువగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ పథకం సేవలను మరింతగా విస్తరించారు. ఇప్పటి వరకూ రక్త, మూత్ర పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుండగా.. ఇకనుంచి ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి రేడియాలజీ పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఎనిమిది అధునాతన నిర్ధారణ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరో 8 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 8 అధునాతన ఆపరేషన్ థియేటర్లతో గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధునాతన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి...
పేదల ముంగిట ఆధునిక వైద్య పరీక్షలు
టీకా అనుభవాలు తెలుసుకోనున్న మోదీ