2 లక్షల కొత్త కేసుల్లో 81 శాతం ఆ పదిచోట్లే! 
close

తాజా వార్తలు

Published : 15/04/2021 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 లక్షల కొత్త కేసుల్లో 81 శాతం ఆ పదిచోట్లే! 

ఉగ్రరూపం చూపిస్తోన్న కొవిడ్‌

దిల్లీ: దేశంలో కరోనా ఉగ్రరూపం మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో జనం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కఠిన ఆంక్షలు అమలవుతున్నా.. మరోవైపు టీకా పంపిణీ శరవేగంగా సాగుతున్నా.. వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందుతుండడం కలవరానికి గురిచేస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. వీటిలో 80.76 శాతం కేవలం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 58 వేలకు పైగా కేసులు రాగా.. ఆ తర్వాత యూపీలో 20 వేలు, దిల్లీలో 17 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

కొండలా పెరిగిపోతున్న యాక్టివ్‌ కేసులు

కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు కొండలా పేరుకుపోతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 14.71 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీటిలో 67 శాతం కేవలం 5 రాష్ట్రాల్లోంచే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 41.69 శాతం ఒక్క మహారాష్ట్రలోనే కాగా.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 8.08 శాతం, యూపీ 7.6, కర్ణాటక 5.81, కేరళ 3.98 శాతం చొప్పున ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి 32.86 శాతం యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో అత్యధిక క్రియాశీల కేసులు ఉన్నాయి. 

తొమ్మిది చోట్ల మరణాల్లేవ్‌..

తాజాగా మరో 1038 మరణాలు నమోదవ్వగా.. అందులో 82.27 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో నిన్న అత్యధికంగా 378 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 120 మంది, దిల్లీలో 104 మంది చొప్పున ప్రాణాలు విడిచారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.

మరోవైపు దేశంలో 89వ రోజూ వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా జరిగింది. నిన్న ఒక్కరోజే 33 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 28,77,473 మందికి తొలి డోసు అందించగా.. 4,36,375 మందికి రెండో డోసు టీకాను అందించారు. దేశ వ్యాప్తంగా 11,44,93,238 డోసుల టీకా పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని