
తాజా వార్తలు
విద్వేషపూరిత పోస్టులపై చర్యలు పెరిగాయ్: FB
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లోనే విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది చివరి త్రైమాసికంలోనే దాదాపు 2.69 కోట్ల విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన పోస్టులపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది.
ఫేస్బుక్కు ప్రపంచ వ్యాప్తంగా 184 కోట్ల రోజువారీ వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. నిత్యం కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఫేస్బుక్ వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే, వీటిలో విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవడంలో ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తుందనే విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వీటిని కట్టడిచేసేందకు పలు చర్యలు తీసుకుంటామని, ఇందుకు మరిన్ని విధానాలను తీసుకొస్తామని ప్రకటిస్తోంది. ముఖ్యంగా వార్తా విభాగంలో ఇటువంటి వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రతి పదివేల వ్యూస్లో 7 నుంచి 8 విద్వేషపూరిత వ్యూస్ తగ్గినట్లు ఫేస్బుక్ ప్రతినిధి గయ్రోజన్ వెల్లడించారు. హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ కూడా 0.07 శాతం నుంచి 0.05శాతానికి తగ్గినట్లు తెలిపారు. అంతేకాకుండా యూజర్లు రిపోర్టు చేయకముందే వీటిపై చర్యలు తీసుకునే రేటు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. ఇక ఇన్స్టాగ్రామ్లో ఈ పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
మాకు పార్టీతో సంబంధం లేదు: ఫేస్బుక్
దిగొచ్చిన ట్విటర్..! 97శాతం పోస్టులపై చర్యలు