close

తాజా వార్తలు

Updated : 21/05/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలివిడిగా కదలాలి!

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

రెండు నెలల తర్వాత ఆఫీస్‌లో అడుగుపెట్టింది ఇందు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ఆమె.. ఇప్పుడెందుకో బెంగగా కనిపించింది. తన రాకను చూసి కళ్లింత చేసుకుని దగ్గరికి వస్తున్న మంజును చూసి.. కలవరపడింది. ఆఫీసుకు వచ్చాక హైఫై కొట్టాక గానీ.. పంచ్‌ చేసే వాళ్లు కాదు ఇద్దరు. తను ఎక్కడొచ్చి తాకుతుందో... అనుకుని చకచకా తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయిందామె. మంజు చిన్నబుచ్చుకుంది. ఇందు ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోయాయి...

‘కరోనా బారిన పడకండి.. స్వీయ నియంత్రణ పాటించండి.. బయటకు రాకండి...’ ఇలా ఎన్నో జాగ్రత్తలు విన్న ఇందుమతికి.. ‘కరోనా సోకకుండా ఉండాలంటే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాల్సిందే!’ అనే మాట విన్నప్పటి నుంచి ఆలోచనలు మందగించాయి. ఆమే కాదు.. ఉద్యోగ పర్వానికి తెర తీయడంతో కార్యాలయాలకు వస్తున్న చాలామందిదీ ఇదే పరిస్థితి! దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ బయటకు వచ్చామన్న సంతోషం కంటే.. రకరకాల ఆలోచనలు చాలామంది మెదళ్లను వేడెక్కిస్తున్నాయి. ‘ఎక్కడెక్కడో తిరిగి ఆఫీసుకు వచ్ఛా ఏవేవో వాటిని తాకుతున్నా. నా వల్ల ఎవరికే ఆపద వస్తుందో’అన్న భయం ఆమె కలవరపాటుకు కారణం. తాను వైరస్‌ క్యారియర్‌ అవుతానేమో? పిల్లలకు తనవల్ల ఇబ్బంది కలుగుతుందేేమోనన్న ఆందోళన ఉద్యోగానికి వెళుతున్న తల్లులను కుదురుగా పని చేసుకోనివ్వకపోవచ్ఛు ఇంట్లో వయసు పైబడిన పెద్దలున్న ఉద్యోగినుల ఆవేదనా అదే! కానీ కొత్తదనానికి అలవాటుపడితేనే బతుకు బండి ముందుకు కదులుతుందని గుర్తుంచుకోవాలి.

ఏదైనా అతి వద్దు.

స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధారణ.. ఇవి పాటిస్తూ హాయిగా ఉద్యోగం చేసుకోవచ్ఛు అయితే అతి జాగ్రత్తగా ఉండేవాళ్లూ ఉంటారు. కీబోర్డు తాకడానికి సంకోచించడం, ఎవరైనా ఫైల్‌ ఇస్తే తీసుకోవడానికి తటపటాయించడం.. ఇలాంటివి ఇబ్బందే! తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటే.. ఏ ముప్పూ ఉండదు. చేతులతో ముఖం తాకకుండా ఉండగలిగితే ఏ ప్రమాదమూ రాదు. నలుగురిలో కలవకుండా, ఒంటరిగా ఉండిపోతే పని మీద సరిగ్గా దృష్టి సారించలేరు. నలుగురితో కలిసి కూర్చొని తినాల్సి వస్తుందని కొందరు లంచ్‌ బాక్స్‌ తీసుకురావడం మానేస్తారు. దీనివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన వైఖరి మనకే కాదు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. అవతలి వ్యక్తులు.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే.. అది సరికాదని చెప్పడంలో తప్పులేదు!


ఇవి పాటించండి..

* నావల్ల ఇంట్లో వారికి ఏమైనా ఆపద తలెత్తుతుందేమోనన్న భయాందోళనలకు లోను కావ్వొద్ధు

* మీరు అనుకున్నట్టుగా కార్యాలయంలో పరిస్థితులు ఉండకపోవచ్ఛు అలాగని ఆవేశానికి గురికాకూడదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

* వైరస్‌ సోకుతుందనే ఆందోళన వద్ధు వైరస్‌ నాకు రాదనే అతి విశ్వాసమూ అస్సలొద్ధు ప్రభుత్వం సూచించిన నియమాలు పాటించాలి.

* సోషల్‌ మీడియాను అతిగా వాడొద్ధు మనసుకు ఆందోళన కలిగించే వీడియోల జోలికి వెళ్లవద్ధు ● ఆరోగ్యసేతు మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. యాప్‌ సాయంతో స్వీయ నిర్ధారణ పరీక్ష చేసుకోవాలి.


మద్దతివ్వండి

ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఈ సమయంలో ఇంట్లో వాళ్ల మద్దతు తప్పనిసరి. ఉద్యోగం చేయక తప్పదు. ప్రస్తుతం సమయంలో ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందే. మానేయడానికి మనసురాదు. వెళ్లడానికి ధైర్యం చాలదు. వీలైనంత కాలం ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి. కుదరకపోతే గడప దాటడానికి సంశయించొద్ధు ఈ భయాలు, ఆందోళనలతో కోపం రావొచ్ఛు దానిని ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోవాలి. ఆమెకు ధైర్యమివ్వాలి. ఇంట్లో పనిభారాన్ని కాస్తయినా తగ్గించాలి. బయట నుంచి ఇంటికి వచ్చాక.. యథాప్రకారంగా స్నానం చేసి, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటికి వెళ్లాక ఇరుగు పొరుగుకు ఏ ఇబ్బందీ లేకుండా వ్యవహరించాలి. వాళ్లు కూడా.. ఉద్యోగినుల విషయంలో అనవసరంగా భయపడకుండా సహకరించాలి.


రక్షణ దేహానికే..

కరోనా కాలంలో జీవితం సజావుగా సాగాలంటే మానసికంగా బలంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి. ‘దీని వల్ల ఇలా జరుగుతుందేమో.. ఆ తర్వాత ఇలా మారుతుందేమో!’ ఇలాంటి గొలుసుకట్టు ఆలోచనలను తెగ్గొడితేనే మనుగడ సాఫీగా సాగుతుంది. రక్షణ చర్యలు, భౌతిక దూరం పాటించండి. మానసికంగా అందరితో కలి‘విడి’గా ఉంటూనే ఉద్యోగ జీవితాన్ని ఆస్వాదించండి.

- చల్లా గీత

కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌
Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని