
తాజా వార్తలు
వడ్డీ తగ్గింది... ఏం చేయాలి?
* నేను సీనియర్ సిటిజన్ని. సాధారణంగా నా దగ్గరున్న మొత్తాన్ని బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనే ఎక్కువగా జమ చేస్తుంటాను. కానీ, ఇప్పుడు వీటిలో వడ్డీ ఎక్కువగా రావడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మంచి రాబడినిచ్చే పథకాలేమైనా ఉన్నాయా?
- నారాయణ
* నిజమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ గణనీయంగా తగ్గింది. దీనికి బదులుగా మీరు పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకాన్ని పరిశీలించవచ్చు. ఇందులో 7.4శాతం వడ్డీ లభిస్తోంది. దీన్ని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. దీంతోపాటు ప్రధాన మంత్రి వయ వందన యోజననూ పరిశీలించవచ్చు.
* నా వయసు 30 ఏళ్లు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం రూ.కోటి పాలసీ ఉంటే బాగుంటుందనుకుంటున్నా. దీనికోసం సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలన్నది అర్థం కావడం లేదు. వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనమో చెప్పండి?
- సంతోశ్
* టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు క్రమం తప్పకుండా పాలసీ వ్యవధి పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లించే (రెగ్యులర్ ప్రీమియం) ఐచ్ఛికాన్ని ఎంచుకోవడమే మేలు. మిగతా విధానాల్లో.. సాధారణంగా మీరు చెల్లించే ప్రీమియానికి, వ్యవధి ఆధారంగా కొంత అధిక మొత్తాన్ని కలిపి ఆ మేరకు ప్రీమియాన్ని లెక్కిస్తారు. దీనివల్ల మీకు అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి, పాలసీ వ్యవధి పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లించే విధానాన్నే ఎంచుకోండి.
* నా వయసు 40 ఏళ్లు. మాకు 12 ఏళ్ల అబ్బాయి, 8 ఏళ్ల అమ్మాయి ఉన్నారు. నేను వ్యాపారం నిర్వహిస్తున్నాను. నేను రూ.5లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్లలో, మరో రూ.5లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ మదుపు చేశాను. వ్యాపారం నిర్వహించేందుకు 11.5శాతానికి రూ.10 లక్షల వరకూ అప్పు తీసుకున్నాను. దీంతోపాటు తెలిసిన వారి దగ్గర్నుంచి రూ.8లక్షలు అప్పుగా తీసుకున్నాను. దీనికి వడ్డీ చెల్లించాలి. ఫండ్లు, ఎఫ్డీల నుంచి డబ్బు తీసి, అప్పు చెల్లించడం మేలా? ఆ మొత్తాన్ని షేర్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయా?
- వినయ్
* ముందుగా మీరు తెలిసిన వారి దగ్గర తీసుకున్న అధిక వడ్డీ అప్పు తీర్చేయండి. మీరు పెట్టుబడి పెడితే వచ్చిన రాబడికన్నా మీరు చెల్లించే మొత్తం అధికంగా ఉండటం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి, వ్యవధి తీరబోతున్న ఎఫ్డీని వెనక్కి తీసుకొని, వారికి చెల్లించండి. ఇక్కడ రూపాయిని ఆదా చేయడం అంటే.. రూపాయిని సంపాదించడమే అన్నది గుర్తుంచుకోవాలి. మీ వ్యాపార అవసరాలకోసం డబ్బు కావాలనుకుంటే.. తక్కువ వడ్డీకి లభించే రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి. బీమా పాలసీలుంటే.. వాటిపైన అప్పు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు.
- సాయికృష్ణ పత్రి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్