close

తాజా వార్తలు

Published : 08/02/2021 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంట వ్యర్థాలే.. బ్యాటరీలుగా..

భువనేశ్వర్‌కు చెందిన ఇద్దరు కవలలు చేసిన ఆవిష్కరణ... వాహనరంగంలో సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ సమయంలో ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీని తయారుచేయడం ఓ సవాల్‌ అయితే, వాటిని పంటవ్యర్థాలతో రూపొందించడం మరో ప్రత్యేకత.... ఈ కృషే అక్కాచెల్లెళ్లు నిషిత, నిఖితలను ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 పట్టికలో నిలబెట్టింది.
నిమిషాల తేడాతో పుట్టిన నిషితా, నికితా బలియార్‌సింగ్‌ తెలివితేటల్లోనూ ఒకరికొకరు పోటీ. చిన్నప్పటి నుంచి వీరిద్దరికీ పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఎక్కువ. చదువు పూర్తయ్యాక పర్యావరణహితంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునేవారు. తాతగారి గ్రంథాలయంలో ఏళ్లకిందటి బయోకెమిస్ట్రీ పుస్తకాన్ని చదివి... ఓ అర్ధరాత్రి వీరిద్దరూ ఇంటి మిద్దెపై చేసిన చర్చ ‘నెక్సస్‌పవర్‌’ బ్రాండ్‌ ఆవిష్కరణకు కారణమైంది. మొదట ద్విచక్రవాహనాల తయారు చేయాలనుకున్నారు. ఆ తర్వాత చేసిన అధ్యయనం, పరిశోధనతో వారి ఆలోచన బ్యాటరీ తయారీవైపు మళ్లింది. అలా రెండేళ్లక్రితం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలను రూపొందించడం మొదలుపెట్టారు. వీరు  ప్రారంభించిన ఈవీ బ్యాటరీ స్టార్టప్‌కు పంటవ్యర్థాలనే ముడిసరుకుగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ద్వి, త్రిచక్ర వాహనాలకు వాడుతోన్న బ్యాటరీలకు భిన్నంగా రూపొందించాలనేదే వీరి లక్ష్యం. అవి పర్యావరణ హితంగానూ ఉండాలనుకున్నారు.  గతంలో బ్యాటరీలు ఛార్జింగ్‌ అవ్వడానికి నాలుగు నుంచి ఆరుగంట పాటు సమయం పట్టేది. ఈ సమయాన్ని కుదించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి ఆలోచనకు టైడ్‌ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి నాలుగు లక్షల రూపాయల నిధులు అందగా, ఈ ఏడాది ఫోర్బ్స్‌ పత్రికలో స్థానాన్నీ సంపాదించుకున్నారు నికిత, నిషిత. ఓ ప్రముఖ సంస్థ నుంచి ‘ది యంగ్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌’ అవార్డునీ అందుకున్నారు.

రైతులకు చేయూత

సాధారణంగా పంట పూర్తయిన తర్వాత వచ్చే వ్యర్థాలను కాలుస్తారు. ఇలా చేయడం వల్ల   వచ్చే ధూళీ, పొగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ఈ సమస్యకు  పరిష్కారం చూపించడంతో పాటు తాము తయారు చేసే బ్యాటరీలకు ముడిసరకుగానూ ఈ వ్యర్థాలు ఉపయోగపడతాయని అంచనా వేశారు ఈ అక్కాచెల్లెళ్లు.
నెక్సస్‌పవర్‌ బ్రాండ్‌ వంద బ్యాటరీలను తయారు చేస్తే వాటికి సుమారు ఇరవైఐదువేల రూపాయల పంటవ్యర్థాలు అవసరం అవుతాయి. వీటిని రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా వారికి అదనపు ఆదాయంగానూ మారుతోంది. కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుంది. ‘పంట పూర్తయిన తర్వాత వచ్చే వ్యర్థాలను సేకరించడంతో మా పని మొదలవుతుంది. దీన్ని ప్రత్యేక పద్ధతి ద్వారా రీఛార్జిబుల్‌ ఎనర్జీ-స్టోరింగ్‌ సెల్స్‌ను రూపొందిస్తాం. వీటిని ఈవీఎస్‌ బ్యాటరీ తయారీకి వినియోగిస్తాం. ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో తయారుచేస్తున్న ఇవి లీథియం, ఐరన్‌ ఫ్రీ. ఈ మొత్తం తయారీకి తక్కువ ఖర్చు కావడంతో ఈవీఎస్‌ బ్యాటరీలు కూడా తక్కువ ఖరీదుకే వినియోగదారుడికి అందుతాయి’ అని చెబుతుంది నికిత.

వేర్వేరు రంగాలైనా...

చదువులో ఇద్దరిదీ వేర్వేరు రంగాలైనా... నూతన ఆవిష్కరణకు కలిసి అడుగులు వేశారు. నికిత మీడియా అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌, ఎనర్జీ స్టోరేజ్‌ కోసం నానో మెటీరియల్స్‌కు సంబంధించి పలు కోర్సులు పూర్తి చేసింది. నిషిత కార్పొరేట్‌ ఫైనాన్స్‌ చదివింది. ఆ తర్వాత బ్యాటరీ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ డిజైనింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కోర్సు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీ సొల్యూషన్స్‌పై పనిచేయడానికి అర్హతను సాధించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని