close
Array ( ) 1

తాజా వార్తలు

మనో ఫలకంపై మహా సందేశం!

ఖురాన్‌ అవతరించిన వేళ...
శనివారం ఖురాన్‌ అవతరించిన రోజు(షబే
ఖద్ర్‌)

ఏది జ్ఞానమో...
ఏది విజ్ఞానమో...
ఏది సందేశమో...
ఏది ఆదేశమో...
అదే దివ్య ఖురాన్‌...
ముస్లింలకు పరమ ప్రమాణ
పవిత్ర గ్రంథం...
దీని అవతరణ,
తర్వాత జరిగిన కార్యాచరణ
అంతా ఓ అద్భుతం!

‘ఒక్కోసారి దైవదూత మానవాకారంలో నా దగ్గరకు వస్తాడు. నాతో మాట్లాడతాడు, అతను చెప్పిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను’ అంటూ ఖురాన్‌ అవతరణ క్రమాన్ని తర్వాతి కాలంలో ప్రవక్త (స) తన శిష్యులకు చెప్పేవారు.
ఈ గ్రంథరాజం ఒక్కసారిగా అవతరించలేదు. ఎన్నో హితవులతో, హెచ్చరికలతో, శుభవార్తలతో, మరెన్నో గాథలతో అప్పటి అవసరాలకు అనుగుణంగా దివ్య సందేశం ప్రవక్తకు చేరుతుండేది. ఇలా ఖురాన్‌ అవతరణ పూర్తవడానికి 23 ఏళ్లు పట్టింది. ముహమ్మద్‌ ప్రవక్తకు దైవవాణి అనేక రకాలుగా వినిపించేది. వాణి వచ్చే ముందు ప్రవక్తకు మొదట గంటానాదం వినపడేది. ఆ తర్వాత దైవ సందేశం అంతా ప్రవక్త (స)కు కంఠస్తం వచ్చేసేది. అలా జరుగుతున్నంత సేపు ప్రవక్త (స) ఏదో తెలియని గాఢతలో ఉండేవారు. చాలా భారంగా కనిపించేవారు. ‘దైవదూత జిబ్రాయీల్‌ మానవ రూపంలో వచ్చేవారు. ఒక్కోసారి దైవదూత రూపంలోనే ఉండేవారు. ఒక్కోసారి భౌతికంగా రాకుండా హృదయంలోకి సందేశాన్ని చేర్చేవార’ని ప్రవక్త తెలియజేసేవారు. ఖురాన్‌ సందేశం ఆయన మనోఫలకానికి చేరగానే దాన్ని కంఠస్తం చేసుకునేందుకు ప్రవక్త (స) తొందరపడేవారు. ఒక్కసారి చదివితే కంఠస్తమయ్యేలా ఆయనకు అపార జ్ఞాపకశక్తిని దైవం ప్రసాదించాడని చెబుతారు. ప్రవక్త (స) తన శిష్యులతోనూ కంఠస్తం చేయించేవారు. ముందు తరాల వారికి అందించేందుకు ఆ దివ్య సందేశాన్ని గ్రంథస్తం చేయించే ఏర్పాటుచేశారు. దైవవాణి అవతరించి వెళ్లగానే దాన్ని చదవడం, రాయడం వచ్చిన తన శిష్యులతో రాళ్లపై, చర్మాలపై, ఖర్జూర కొమ్మలపై, ఆకులపై, ఎముకలపై రాయించేవారు. హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబిల్‌ (రజి), హజ్రత్‌ అలీ బిన్‌ కాబ్‌, హజ్రత్‌ జుబేర్‌ బిన్‌ అవ్వామ్‌, హజ్రత్‌ ముఆవియా (రజి) అనే శిష్యులకు ఈ మహాగ్రంథాన్ని లిఖించే బాధ్యతను అప్పజెప్పారు. ఇలా ప్రవక్త కాలంలోనే ఖురాన్‌ పూర్తిగా భద్రపరచబడింది. ప్రవక్త (స) అనంతరం మొదటి ఖలీఫా అబూబకర్‌ (రజి) వివిధ ప్రాంతాల్లో ఉన్న హాఫిజ్‌లందరినీ రప్పించి మొత్తం రాతప్రతుల్ని సేకరించి, ప్రమాణబద్ధమైన, సంపూర్ణమైన ప్రతిని తయారు చేయించారు. ఆ తరువాత మూడో ఖలీఫా హజ్రత్‌ ఉస్మాన్‌ (రజి) పాలనకాలంలో దాని ప్రతులు తీయించి అధికారికంగా ఇస్లాం దేశాలకు పంపించారు. వాటిలో రెండు రాత ప్రతులు నేటికీ యథాతథ స్థితిలో ఉన్నాయి.  ఖురాన్‌ అవతరించిన అరబిక్‌ భాష ఇరాక్‌ నుంచి మొరాకో వరకూ దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు ఈనాటికీ మాతృభాషగా ఉంది. ఈ భాష, వ్యాకరణం, పదకోశం, ఉచ్ఛారణ, నుడికారాలు, వెయ్యిన్నరేళ్లనుంచి అలాగే ఉన్నాయి. ఈ విధంగా ఖురాన్‌ దాని మూలభాషలో , అసలు పదాలతో ఎలాంటి మార్పులకు, చేర్పులకు గురికాకుండా నూరుశాతం సురక్షితంగా ఉంది.

1450 ఏళ్ల క్రితం... అరేబియా ప్రాంతం... ఎటు చూసినా కారుచీకటి... గాఢాంధకారం అలముకున్న హృదయాలు... ఏరులై పారుతున్న మద్యం, వడ్డీ పేరుతో మనిషిని తినేసే పరిస్థితి. మహిళలపై ఎడతెగని దారుణాలు... దోపిడీలు, దౌర్జన్యాలు, అనాగరికత...

ఎలా... ఎలా...
ఈ పరిస్థితులు మారేదెలా?
మృగంగా మారిన మనిషిని తిరిగి మార్చేదెలా?
గుండెగుండెలో ప్రేమ నింపేదెలా?
మానవాళికి తరుణోపాయాన్ని చూపేదెలా?
అప్పుడు ముహమ్మద్‌ ప్రవక్త (స)కు నలభై ఏళ్లు. ఆలోచనలతో బరువెక్కిన హృదయంతో ఉండేవారు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉండేవారు. అతి తక్కువగా మాట్లాడేవారు.  సమాజంలోని చెడు గురించి చింతిస్తూ హిరా గుహలో గడిపేవారు. ఆ చీకటి గుహలో ఒంటరిగా, చింతనలో అలా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి ఆ గుహలో ఉండగా జిబ్రాయిల్‌  దైవదూత ప్రత్యక్షమయ్యారు. ‘చదువు’... దైవ దూత ఆదేశం. ‘నేను చదువుకున్న వాణ్ణి కాదు’... ప్రవక్త జవాబు. జిబ్రాయిల్‌ ప్రవక్త (స)ను వాటేసుకుని గట్టిగా అదిమారు. ఆ తరువాత ‘చదువు’ అని పురమాయించారు. రెండోసారి కూడా మళ్లీ గట్టిగా కౌగిలించుకుని అదిమారు. ఇలా మూడుసార్లు జరిగిన తరువాత ఆదేశించారు... ‘‘చదువు... సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ని పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృజించాడు. చదువు... నీ ప్రభువు పరమ దయాళువు...’ అని ఈ వాక్యాలే ఇస్లాం ధర్మానికి తొలి పలుకులయ్యాయి. పరమ పవిత్ర ఖురాన్‌ ఈ మాటలతోనే ప్రారంభమైంది. దైవవాణి వచ్చిన విషయాన్ని ప్రవక్త (స) తన సతీమణి హజ్రత్‌ ఖదీజాకు మొదట వివరించారు. ఆమె తెలిసిన పండితుల దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు కూడా ప్రవక్త (స) చెప్పే విషయాలను ధృవపరిచారు. ఇలా పవిత్ర రంజాన్‌ మాసంలో ఓ రాత్రి ప్రవక్త (స) మనోఫలకంపైకి ఖురాన్‌ వచ్చింది.

ఏముంది ఇందులో?
ఖురాన్‌ ప్రధానాంశమంతా మానవుడి చుట్టే తిరుగుతుంది. మనిషి జన్మ, మరణం, పరలోక జీవితం, సృష్టిలో మనిషికి లోబర్చిన అనుగ్రహ భాగ్యాలు, పూర్వ జాతుల గాథలు, గుణపాఠాలు, ప్రవక్తల పరంపర, సృష్టి ఉనికి ఇలా ఎన్నో విషయాలను అందులో చర్చించారు. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మనిషికిది మార్గం చూపుతుంది. దేవునికి-దాసునికి మధ్య వుండవలసిన వాస్తవిక సంబంధాన్ని ప్రధాన ఇతివృత్తంగా ప్రసంగం సాగుతుంది. సాంఘిక న్యాయం, సభ్యతాసంస్కారాలు, కుటుంబ విషయాలు కూడా ఉన్నాయి. మానవుల్ని నీతిమంతులుగా, దైవభీతిపరులుగా తీర్చిదిద్దడానికి కావలసిన ఉన్నత నియమావళి. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే అర్థశాస్త్రం కాకపోయినా ధనార్జన, ధన వినియోగాలను గురించి కూడా చర్చ ఉంది.  రాజనీతి, పరిపాలన, యుద్ధం, సంధి, జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు తదితర రాజకీయ వ్యవహారాలను స్పృశిస్తుంది.

ఎంత మార్పు?
* పొద్దున లేస్తే మద్యంతో ముఖం కడిగే జాతి యావత్తు ఒక్కసారిగా మద్యనిషేధాన్ని అమలు చేసింది. ఇది కేవలం దివ్యఖురాన్‌ వల్లనే సాధ్యమైంది. అప్పట్లో మద్యాన్ని నిషేధిస్తున్నట్లు దైవాదేశం రాగానే తమ వద్ద ఉన్న సురను వీధుల్లో పారబోశారు. మదీనా నగరంలో అలా పారబోసిన మద్యం కాలువలై ప్రవహించిందట.
* ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి సజీవంగా సమాధి చేయడానికి వెనుకాడని వారూ సమూలంగా మారిపోయారు. ఆడపిల్ల పుట్టుకను దైవకారుణ్యంగా భావించారు.
* మహిళలకు ఆస్తిహక్కు కల్పించడం దివ్యఖురాన్‌ సాధించిన రాజకీయ విజయం.
* రమజాన్‌లో ముస్లింలు చెల్లించే జకాత్‌ దానాలకు ప్రేరణ ఖురాన్‌ బోధనలే. తన సంపదలో కొంత భాగాన్ని సంతోషంగా ఇతరులకు చెల్లించే ఉన్నత మనస్తత్వాన్నిచ్చింది.
* చివరికి ఒక స్త్రీ ఆపాదమస్తకం విలువైన ఆభరణాలు ధరించి ఏ భయం లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయగలిగింది. ఇది ఖురాన్‌ అద్భుతమే.

తెలుగులో కూడా...
అరబ్బీలో ఉన్న ఖురాన్‌ ప్రపంచవ్యాప్తంగా 112 భాషల్లో అనువాదమయ్యింది. తెలుగులో 1925లో చిలుకూరి నారాయణరావు అనువదించి మొదటిసారి మద్రాసు నుంచి ప్రచురించారు. తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్టు అనువదించిన ‘దివ్యఖురాన్‌’ తెలుగు పాఠకుల ఆదరణ పొందింది. విజయవాడకు చెందిన హమీదుల్లా షరీఫ్‌ తేట తెలుగులో అనువదించారు.

ఆజ్ఞలు..ఆయత్‌లు...

* ఖురాన్‌ శైలి అద్భుతంగా ఉంటుంది. కొందరు భాషా కోవిదులు ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యాలని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది.
* ఇందులో మొత్తం 114 అధ్యాయాలున్నాయి. వీటినే సూరాలు అంటారు. సూరె ఫాతిహా మొదటి అధ్యాయం కాగా సూరే నాస్‌ చివరి అధ్యాయం. సూరె యాసీన్‌ ఖురాన్‌కు  గుండె వంటిదని ప్రవక్త బోధించారు.
* ఇందులో వాక్యాన్ని ఆయత్‌ అంటారు. మొత్తం 6600 పైచిలుకు ఆయత్‌లు ఖురాన్‌లో ఉన్నాయి. ఒక్కో వాక్యం ఒక్కో దైవాజ్ఞగా ముస్లిములు భావిస్తారు.
* ఎంత చదివినా ఆసక్తి తరగని గ్రంథమిది. ముఖ్యంగా నమాజు చేసే వ్యక్తి రోజులో ఎంత లేదన్నా కనీసం యాభై సార్లు ఫాతిహా సూరా పారాయణం చేస్తాడు. కానీ విసుగు, విరక్తి అతని దరిదాపులకు కూడా రావు. ఖురాన్‌ లోని ప్రతీ వాక్యం మనం ఎలా బతకాలో చెబుతుంది. ఆ ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే ఇటు ప్రపంచంలోనూ అటు పరలోకంలోనూ విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించొచ్చు.

-ఖైరున్నీసాబేగం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.