close

తాజా వార్తలు

Published : 10/01/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శరదృతువు తారుమారు అంటే ఏమిటి?

జీవావరణం - పర్యావరణం
4 మార్కుల ప్రశ్నలు

1. సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏవిధంగా అనుకూలనం ఏర్పరచుకుంటాయి?
జ: సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్య ద్రవాభిసరణ ద్వారా నీరు వెలుపలికి వెళ్లడంతో దేహం నిర్జలీకరణకు గురవుతుంది. అందువల్ల సముద్ర చేపలకు వృక్క ప్రమాణాలు తక్కువగా ఉన్న రక్తకేశనాళికా గుచ్ఛరహిత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి. దేహంలో లవణ సమతాస్థితిని నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్‌ కణాలు మొప్పల్లో ఉంటాయి. సాగర పక్షులైన సీగల్స్‌, పెంగ్విన్‌ నాసికానాళాల నుంచి లవణ ద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో నేత్రాల సమీపంలో క్లోరైడ్‌ స్రవించే గ్రంథి నాళాలు తెరుచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపల్లో యూరియా, ట్రైమిథైల్‌ అమైన్‌ ఆక్సైడ్‌ రక్తంలో ఉండి, దేహద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉంచడంలో నిర్జలీకరణ జరగకుండా ఆపుతుంది.
2. జీవావరణ పిరమిడ్లను నిర్వచించి, సంఖ్యా పిరమిడ్లు, జీవరాశి పిరమిడ్లను సోదాహరణంగా వివరించండి.
జ: ఆవరణ వ్యవస్థలో మూడు రకాల జీవావరణ పిరమిడ్లను అధ్యయనం చేస్తారు. అవి: సంఖ్యా పిరమిడ్‌, ద్రవ్యరాశి పిరమిడ్‌, శక్తి పిరమిడ్‌.
ఈ పిరమిడ్ల గురించి మొదటిసారిగా తెలియజేసిన వారు ఎల్టన్‌. అనేక జీవావరణ వ్యవస్థల్లో సంఖ్యా, జీవద్రవ్యరాశి, శక్తి పిరమిడ్లు అన్నీ నిటారుగా ఉంటాయి. అంటే ఉత్పత్తిదారులు శాకాహారుల కంటే సంఖ్య, జీవద్రవ్యరాశిలో అధికంగా ఉంటాయి. ఈ సాధారణీకరణానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పరాన్నజీవుల ఆహారగొలుసులో సంఖ్యాపిరమిడ్‌ తలకిందులుగా ఉంటుంది. సాగరంలోని ద్రవ్యరాశి పిరమిడ్‌ కూడా తలకిందులుగా ఉంటుంది. ఎందుకంటే చేపల ద్రవ్యరాశి వృక్ష ప్లవకాల ద్రవ్యరాశి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. శక్తి పిరమిడ్‌ ఎప్పుడూ నిటారుగా ఉంటుంది. ఇది ఎప్పటికీ తలకిందులుగా ఉండదు.

3. హరితగృహ ప్రభావం గురించి రాయండి.
జ: సూర్యకాంతి వాతావరణ బాహ్య పొరను చేరగానే మేఘాలు, వాయువుల వల్ల దాదాపు పావు వంతు సౌరవికిరణం పరావర్తనం చెందుతుంది. కొంత పీల్చుకోబడుతుంది. మొత్తం సౌరవికిరణంలో కొద్దిభాగం పరావర్తనం చెందితే సగానికి పైగా భూమిపై పడి భూగోళాన్ని వేడెక్కిస్తుంది. భూఉపరితలం పరారుణ వికిరణం రూపంలో ఉష్ణాన్ని తిరిగి అంతరిక్షంలోకి పంపుతుంది. కానీ అందులో అధిక భాగాన్ని వాతావరణంలోని వాయువులు పీల్చుకుంటాయి. ఈ వాయువు అణువులు ఉష్ణశక్తిని తిరిగి భూమి మీదకు విడుదల చేసి భూఉపరితలాన్ని మళ్లీ వేడెక్కిస్తాయి. దివీ2, మీథేన్‌ వాయువులు హరితగృహ ప్రభావాన్ని కలిగిస్తుండటం వల్ల వాటిని హరితగృహ వాయువులు అంటారు.
4. భూతాప కారణాలు, ప్రభావాలను చర్చించండి. భూతాపాన్ని నియంత్రించడానికి ఏ చర్యలు చేపట్టాలి?
జ: హరితగృహ వాయువుల స్థాయి పెరగడం వల్ల భూమి ఉష్ణాగ్రత గణనీయంగా పెరిగి భూతాపానికి దారి తీస్తుంది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల భూవాతావరణంలో తీవ్ర మార్పులను కలిగించడం వల్ల ధ్రువ ప్రాంతాలు, హిమాలయాలు లాంటి పర్వతాలపై ఉన్న మంచు కరుగుతుంది.  ఫలితంగా కాలక్రమేణా సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.

గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణ పద్ధతులు
* శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపు
* శక్తి వినియోగ సామర్థ్యం పెంపు
* అడవుల నరికివేత ఆపడం, వృక్షాలు పెంచడం
* మానవ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం
5. కిందివాటిని క్లుప్తంగా చర్చించండి.
హరితగృహ వాయువులు, శబ్ద కాలుష్యం, సేంద్రియ వ్యవసాయం, మున్సిపల్‌ వ్యర్థాలు
జ: హరితగృహ వాయువులు: కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌ వాయువులను సాధారణంగా హరితగృహ వాయువులని అంటారు.
శబ్ద కాలుష్యం: 120 దాటిన ఏ శబ్దాన్నైనా శబ్ద కాలుష్యంగా పరిగణిస్తారు.
సేంద్రియ వ్యవసాయం: సేంద్రియ వ్యవసాయంలో ఉత్పన్నమైన వ్యర్థ పదార్థాలను మరొక ప్రక్రియలో పోషకాలుగా వినియోగిస్తారు. దీనివల్ల వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి ఉత్పాదక సామర్థ్యం అధికమవుతుంది. వ్యర్థ పదార్థాల పునఃచక్రీయం సమర్థంగా జరుగుతుంది.
మున్సిపల్‌ వ్యర్థాలు: నగరపాలక సంస్థలు సేకరించే ఘన వ్యర్థాలు సాధారణంగా కాగితం, ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు.

6. గ్రీష్మకాల స్తరీభవనం అంటే ఏమిటి? వివరించండి.
జ: సమశీతోష్ణ సరస్సుల్లో గ్రీష్మ కాలంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది. సరస్సులోని ఉపరితలంలోని ఈ వెచ్చని నీటి పొరను ఎపిలిమ్నియాన్‌ అంటారు. దీని కింద థర్మోక్లైన్‌ మండలం ఉంటుంది. ఈ నీటిలో లోతుకు వెళ్లేకొద్దీ మీటర్‌కు 1ాది చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. సరస్సులో అడుగు పొరను హైపోలిమ్నియాన్‌ అంటారు. ఈ ప్రాంతంలోని నీరు చల్లగా ఉండి, దీనికి ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉంటుంది. శరదృతువు రాగానే ఉపరితల ఎపిలిమ్నియాన్‌లో నీరు చల్లబడి 4ాది కు ఉష్ణోగ్రత చేరగానే నీటి బరువు అధికమై పైన ఉన్న సరస్సు పొర కుంగుతుంది. నీరు తారుమారవడం ద్వారా ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను శరదృతువు తారుమారు అంటారు.
2 మార్కుల ప్రశ్నలు
1. కాంతి గతిక్రమం, కాంతి అనుగమనం మధ్య భేదాలను తెలపండి.
జ: కాంతి గతిక్రమం (ఫొటోటాక్సిస్‌): కాంతికి నిర్దిష్ట దిశలో చలనం జరపడం.
కాంతి అనుగమనం (ఫొటో కైనసిస్‌): కాంతికి జంతువుల్లో కలిగే దిశలేని చలన ప్రతిక్రియ.

2. జాత్యంతర పోటీ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ రాయండి.
జ: రెండు దగ్గరి జాతి జీవులు అందుబాటులో ఉన్న ఒకే రకమైన తక్కువ మొత్తంలో గల వనరుల కోసం పోటీ ఏర్పడుతుంది. దీన్నే జాత్యంతర పోటీ అంటారు. ఉదా: సముద్ర నక్షత్రం పిసాస్టర్‌. (ఇది పరభక్ష జీవి)
3. జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి?
జ: జీవావరణ వ్యవస్థ జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. దీనిలో జీవుల మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది.
4. భ్రమణరూప విక్రియ అంటే ఏమిటి? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యాన్ని వివరించండి.
జ: కొన్ని జంతువుల్లో శరీర నిర్మాణం రుతువులను బట్టి ఉష్ణోగ్రతలో మార్పులకు అనుగుణంగా వాటి శరీర భాగాలు రూపాంతరం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని భ్రమణరూప విక్రియ అంటారు. ఈ విషయాన్ని డాఫ్నియా అనే ప్లవక క్రస్టేషియాలో కోకర్‌ అనే శాస్త్రవేత్త వివరించారు.
5. అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని నిర్వచించండి.
జ: అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు జాతి జీవులు లాభం పొందుతాయి.  ఉదా: లైకెన్స్‌
6. ఆసుపత్రుల్లో భస్మీకరణ యంత్రాలను ఎందుకు వాడతారు?
జ: ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాల్లో క్రిమిసంహారిణులు, హానికర రసాయనాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని తొలగించడానికి భస్మీకరణ యంత్రాలను ఉపయోగిస్తారు.
7. కమొప్లేజ్‌ (రక్షక వర్ణం) అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యాన్ని తెలపండి.
జ: కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో కలిసిపోయే వర్ణాన్ని ప్రదర్శించడం వల్ల పరభక్షకాలు వాటి ఉనికిని తేలికగా గుర్తించలేవు.
పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

2 మార్కుల ప్రశ్నలు
1. ట్రైకోమ్స్‌ అంటే ఏమిటి? వాటి విధులను తెలపండి.
జ: ధూళి రేణువులు లోపలికి ప్రవేశించకుండా నివారించేందుకు శ్వాస రంధ్రాలకు చిన్న రోమాలు ఉంటాయి. వీటిని ట్రైకోమ్స్‌ అంటారు.
2. నిల్వ విసర్జన క్రియ అంటే ఏమిటి?
జ: వసాదేహాలు యురికామ్లాన్ని గ్రహించి జీవితాంతం నిల్వ చేసుకుంటాయి. దీన్నే నిల్వ విసర్జన అంటారు. ఉదా: బొద్దింక
3. బొద్దింక తల అమరికను హైపోగ్నాథస్‌ అని ఎందుకు అంటారు?
జ: బొద్దింక తల దేహానికి లంబకోణంలో వేలాడుతూ పరభాగం పైకి, నోటి భాగాలు కిందకు వంగి ఉంటాయి. ఇలాంటి తలను హైపోగ్నాథస్‌ తల అంటారు.
4. మీరు చదివిన ఏ ఆర్థ్రోపోడ్‌ను సజీవ శిలాజం అంటారు? దాని శ్వాసాంగాలను పేర్కొనండి.
జ: జిఫిస్యూరా విభాగానికి చెందిన రాచపీత లిమ్యులస్‌ను సజీవ శిలాజం అంటారు. వీటి శ్వాసాంగాలు పుస్తకాకార మొప్పలు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.