భారత్‌లో అమెజాన్‌ బిలియన్‌ డాలర్ల పెట్టుబడి
close

తాజా వార్తలు

Updated : 16/01/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో అమెజాన్‌ బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

దిల్లీ: దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్‌ చేసేందుకుగానూ భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. బుధవారం దిల్లీలో నిర్వహించిన అమెజాన్‌ ‘సంభవ్‌’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజోస్‌ మాట్లాడుతూ.. 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన ‘మేకిన్‌ ఇండియా’ ఉత్పత్తులను అమెజాన్‌ ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్‌, అమెరికాల మధ్య మరింత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాగా బెజోస్‌ తన భారత పర్యటనలో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, చిన్న తరహా వ్యాపారులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు.

అమెజాన్‌ పెట్టుబడుల ప్రకటనను అఖిల భారత వర్తక, వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తీవ్ర ఖండించింది. భారత్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని పూర్తిగా కొల్లగొట్టేందుకు అమెజాన్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కేవలం వారి ప్రమోషన్‌ కోసమే తాజా పెట్టుబడుల నిర్ణయాన్ని వెల్లడించారని విమర్శించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరిట చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బెజోస్‌ రాకను నిరసిస్తూ బుధవారం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని