close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/02/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్తా యాత్రలండీ!

ముక్తికి తీర్థయాత్ర అనురక్తికి వినోదయాత్ర ఆసక్తికి విజ్ఞాన యాత్ర.. ఇప్పుటి యంగ్‌ తరంగ్‌లు యాత్రలకు కొత్త పేర్లు పెట్టేస్తున్నారు. విహారాల తీరు మార్చేస్తున్నారు. మార్గం తికమకగా ఉన్నా.. మిలీనియల్స్‌ మతలబులు మంచికే దారితీస్తున్నాయి. ఆ బాటలో మరింతమందిని రారమ్మంటున్నాయి. సరికొత్త విధానాల్లో విహరించేద్దామా..

తెలిసీ తెలియని తీరాలకు

‘తెలిసీ తెలియని మమతే ముద్ధు.’ ఓ మధురమైన పాత పాటలో కమ్మని వాక్యమిది. ఆ పాట అంతగా వినకున్నా, అర్థం తెలిసినా, తెలియకున్నా.. విహార పర్వంలో ఇదే పంథాను పాటిస్తోంది ఈ తరం. బాగా తెలిసిన ప్రదేశాలకు వెళ్లడానికి అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. కొత్త ప్రదేశాలు వెతుక్కొని మరీ అక్కడ వాలిపోతున్నారు. కిటకిటలాడే పర్యాటక కేంద్రాలకు వెళ్లడం కన్నా.. ఎవరికీ అంతగా తెలియని, ప్రశాంత నెలవులు ఎంచుకొని వెళ్లిపోతున్నారు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లినా.. కొత్త ప్రాంతాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతున్న విహార స్థలాల గురించి అంతర్జాలంలో ఆరా తీస్తున్నారు. ఆ కొత్త ప్రదేశానికేగి కొంగొత్తగా సందడి చేస్తున్నారు. సరికొత్త విషయాలు తెలుసుకుంటున్నారు.

ఏ హానీ లేకుండా..

ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్న పర్యాటకులు.. దానిని కాపాడే బాధ్యతనూ భుజానికి ఎత్తుకుంటున్నారు. వాతావరణ కాలుష్యం వెదజల్లని వాహనాలను ఎంచుకుంటున్నారు. ఎంత దూర తీరాలకైనా.. ఎన్ని కష్టాలకు ఓర్చయినా.. పొగ బెట్టకుండా పోయి వస్తున్నారు. ఇలాంటి పర్యాటకులు తక్కువే అయినా.. వారి సంకల్పం మాత్రం గట్టిది. తమ పర్యటన పర్యావరణానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా సైకిళ్లపై సవారీ చేస్తున్నారు. కాలినడకన కొండంత దూరాలు దాటేస్తున్నారు. జల మార్గాల్లో వెళ్లాల్సి వస్తే మరబోట్లలో కాకుండా పడవల్లో లాహిరి లాహిరి లాహిరిలో అంటున్నారు.

విలాసం లేని విహారం

‘ఆకలి రుచెరగదు.. నిద్ర సుఖమెరగదు’ అని నానుడి. ఇదే సూత్రాన్ని పర్యాటకానికీ ఆపాదిస్తున్నారిప్పుడు. పర్యాటక ప్రాంతాల్లోని వింతలు ఆస్వాదించడం, వినోదాలను ఆహ్వానించడం మినహా.. మిగతా వాటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. బస, ఆహారం, ప్రయాణ విషయాల్లో విలాసాలు కోరుకోవడం లేదు. గదుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం లేదు. హాస్టల్స్‌లో ఉండి వందల్లోనే పని వెళ్లదీసుకుంటున్నారు. ప్రయాణం విషయానికి వస్తే.. సొంత వాహనాల్లో కన్నా.. ప్రజా రవాణాను ఉపయోగించడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్‌ హోటల్స్‌లో భోజనం కన్నా.. స్థానిక రుచులు ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతా డబ్బు ఆదా చేయడానికి కాదండోయ్‌! నలుగురితో కలిసిపోవడానికి, తమ విహారం ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోవడానికి ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారన్నమాట.

స్వామి కార్యంలో

కార్పొరేట్‌ వ్యవస్థలో కొత్త ట్రెండ్‌ పురుడు పోసుకుంది. ఉద్యోగస్థులకు ఆటవిడుపునిస్తూ ఆన్‌డ్యూటీలో విహారానికి పంపిస్తున్నారు. ఉద్యోగిని పనిలో బిజీగా ఉంచుతూనే లీజర్‌ ఇస్తున్నారు. బీలీజర్‌గా దీనికి నామకరణం చేశారు. పనిలో భాగంగా ఉద్యోగులను వారం, పది రోజులు, రెండు వారాలు విదేశాలకు, పర్యాటక ప్రాంతాలకు పంపుతున్నారు. కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నారు. పర్యటనకయ్యే ఖర్చులూ ఇస్తున్నారు. ఆఫీస్‌లో చేయాల్సిన పని చేశాక.. కుటుంబంతో జాలీగా గడిపేయడమే బీలీజర్‌కు వెళ్లిన ఉద్యోగి చేయాల్సింది. పాశ్చాత్య దేశాల్లో ఈ విధానం ఎప్పట్నుంచో ఉంది. రకరకాల వ్యాపారాల్లో తలమునకలయ్యే వాళ్లూ ఈ పద్ధతిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. కొందరు సినీ తారలు సైతం.. మనసుకు నచ్చిన లొకేషన్‌ ఎంచుకొని వెకేషన్‌ పూర్తి చేస్తున్నారు.

ఆ కోవలో.. ఈ దోవలో..

పర్యాటకం విషయంలో ఈ తరం వైఖరులు ఉన్నతంగానే ఉంటున్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావం, పర్యావరణంపై అవగాహన, ప్రకృతిపై ఆరాధన వెరసి.. విహారంలో మిలీనియల్స్‌ బాధ్యతతో మెలుగుతున్నారు. సస్టెయినబుల్‌ టూరిస్టులుగా నడుచుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విహారం ఏదైనా ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. వన విహారంపై ఆసక్తి చూపుతున్నారు. అగ్రీ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు. ఎకో- ఫ్రెండ్లీ విహార కేంద్రాలను ఎంచుకుంటున్నారు. యోగా, ఆరోగ్య యానాలు చేస్తున్నారు. నచ్చిన ప్రదేశానికి వెళ్లి వలంటీర్లుగా సేవలందిస్తూ ఆనందం పొందుతున్నారు.

చిన్న చిన్నవైతే బాగుంటుంది

ఏడాదికి ఒకటే యాత్ర.. ఇది పాత ట్రెండు. ఇప్పుడు అనుకుందే తడవుగా విహారానికి సై అంటున్నారు కుర్రకారు. వారాంతం వస్తుందంటే చాలు ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించేస్తున్నారు. పని ఒత్తిడిలో వేసారిన ప్రతిసారీ దగ్గరి తీరాలకు వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న పర్యటనలైతే బాగుంటుందని భావిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లినా పది రోజులు తిష్ట వేయకుండా నాలుగైదు రోజుల్లో తిరిగొచ్చేస్తున్నారు. ఓసారి కుటుంబంతో, మరోసారి స్నేహితులతో, అప్పుడప్పుడూ ఒంటరిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.