close

తాజా వార్తలు

Published : 19/03/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పౌరులారా..! కరోనాతో ఫైట్‌ చేయండి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానసేవలు ఎక్కడికక్కడ నిలిచి పోతున్నాయి. ఆయా దేశాల్లో అంతర్గతంగా సర్వీసులు కొంతమేర నడుస్తున్నా.. అంతర్జాతీయ మార్గాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. చైనా మొదలు.. ఇటలీ, ఇరాన్‌, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా, భారత్‌ సహా పలు దేశాలు విమాన సర్వీసులు తగ్గిస్తూ వచ్చాయి. ఇప్పుడు నెల పాటు పూర్తిగా నిలిపివేశాయి. గిరాకీ తగ్గినందున, మూడొంతులకు పైగా సర్వీసులను విమానయాన సంస్థలే రద్దు చేస్తూ, విమానాలు ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నాయి. ఫలితంగా ఆయా విమానయాన సంస్థల ఆదాయాలు, లాభాలు, షేర్ల విలువలు భారీగా పతనం అవుతున్నాయి. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏజీ సంస్థ ఏప్రిల్‌, మే నెలల్లో 75 శాతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ సంస్థ షేర్‌ విలువ 27 శాతం క్షీణించింది. రాబోయే రెండు నెలల్లో 70 నుంచి 90 శాతం విమాన సర్వీసులు తగ్గిస్తున్నట్లు ఎయిర్‌ ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఈ సంస్థ షేర్‌ 17శాతం పతనమైంది. గురువారం నుంచి అన్ని విమానాలను నిలపివేస్తున్నట్లు ఆస్ట్రియన్‌ ఎయిర్‌ లైన్స్‌ వెల్లడించింది. పరిస్థితి మెరుగు పడేంత వరకు 90 శాతం విమానాలు నడపబోమని ఫినీర్‌ తెలిపింది. జర్మనీలోని లుప్తాంన్స రాబోయే కొన్ని వారాలపాటు సర్వీసులు నిలిపివేయనుంది.

దేశీయ విమానాయాన సంస్థలు సైతం..

పర్యాటక, ఈ వీసాలను భారత్‌ నిలిపివేయటంతో ఎయిర్‌ఇండియా, ఇండిగో సైతం అదేదారిలో నడుస్తున్నాయి. ప్రయాణతేదీలను మార్చుకున్నా.. దేశీయ విమానయాన సంస్థలు ఛార్జీలు వసూలు చేయటంలేదు. విదేశీ సంస్థలు భారత్‌కు వచ్చిపోయే 500 సర్వీసులను రద్దు చేశాయి. వివిధ దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించింది భారత్‌. గో ఎయిర్‌ సంస్థ సర్వీసులు నిలిపి వేయటంతో పాటు సిబ్బందికి వేతనం లేని సెలవులు ప్రకటించింది. కార్యకలాపాలు కొనసాగించాలంటే అధిక మొత్తంలో నిధులు ప్రకటించాలని అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి విమానయాన సంస్థలు కోరుతున్నాయి. విమానయాన సంస్థలకు కొత్తబుకింగ్‌లు లేకపోవటం ఒక సమస్య అయితే, చాలామంది బుకింగ్‌ రద్దు చేసుకుంటుండటం మరో సమస్య. ఈ పరిస్థితులలో స్వచ్ఛందంగా సెలవులు తీసుకోమని సంస్థలు కోరుతున్నాయి. పనిగంటలు సాధ్యమైనంత తగ్గిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో పనిచేస్తున్న 40 లక్షల మందిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక వీటి అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న కోట్లాది మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే మనదేశంలో మాత్రం ఇందుకు కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కొందరు దూర ప్రయాణాలు వద్దనుకుంటున్నా మరికొందరు సెలవులు రావడమే తడువుగా పిల్లలతో కలిసి ఊళ్లకు పయణమవుతున్నారు. ఇది ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. కరోనా వ్యాప్తిలో రెండోదశ అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పుడే విదేశాల నుంచి వచ్చే బంధువులను స్థానికులు కలిస్తే కరోనా నియంత్రణ మరింత క్లిష్టతరం అవుతుంది. దీంతో ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.

రానున్న 15 రోజులు అత్యంత కీలకం...

పౌరులలో కరోనా భయం కనిపిస్తున్నా.. కొందరు గత్యంతరం లేని పరిస్థితులలో, మరికొందరు నిర్లక్ష్యంతో క్వారంటైన్‌ కాకుండా బయటకు వస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చింది పర్యటనల కోసం కాదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తమ పిల్లలను బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరుతున్నాయి. అక్కడక్కడా ప్రజలు పార్కులు, మాల్స్‌ చుట్టూ తిరుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దయచేసి అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. టీవీలు, పత్రికలలో ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తూ...నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. రానున్న పదిహేను రోజులు ఆధునిక భారతావనికి వైద్యపరంగా అత్యంత కఠిన కాలం. ఈ రెండు వారాలు వైరస్‌ వ్యాప్తి జరగకుండా చూసుకోవటం కీలకం.  క్రీడలు, జనాలు గుమిగూడే కార్యక్రమాలు ఇప్పటికే నిషేధించారు. ఐటీ రంగంలో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ పాటిస్తున్నాయి. కొన్ని సంస్థలలో మాస్క్‌లు, శానిటైజర్‌లతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  చాలా దుకాణాలు, మాల్స్‌లో సిబ్బంది మాస్క్‌లు ధరించకుండా కనిపిస్తున్నారు. భారత పౌరులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జనాభా పరంగా చైనా మన కన్నా పెద్ద దేశం. వైశాల్య పరంగాను పెద్దదే. అయితే జనసాంద్రత వారికంటే మన దగ్గరే ఎక్కువ. ఇక్కడ మనుషులు అత్యంత సమీపంగా నివసిస్తారు. కొవిడ్‌-19 మరీ అంత ప్రాణాంతకం కాకపోయినా వ్యాప్తి ఎంతో ఎక్కువ. తరచూ చేతులను శుభ్రం చేసుకోకపోయినా.. ప్రయాణ సమయాలలో మాత్రం అనేకమంది దగ్గిన, తుమ్మిన చోటనే కూర్చొవలసి వస్తుంది. ఆ సమయంలో శానిటైజ్‌ చేసుకోకపోతే ఈ మహమ్మారి వ్యాపించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చైనా అతినీలలోహిత కాంతి కిరణాలతో  బస్సులను శుభ్రపరుస్తోంది. ఏదైనా వస్తువో, కరెన్సీ నోటో పట్టుకున్నపుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ తరువాత చేతులు శుభ్రం చేసుకోవాలి. కేంద్రం స్వచ్చభారత్‌ గురించి ఎంత ప్రచారం చేసినా ఇప్పటికి చాలామంది సబ్బుతో చేతులు కడుక్కోవటం లేదన్నది కఠిన వాస్తవం. అందుకే ఈ రెండు వారాలు పౌరులు అప్రమత్తంగా ఉండి కొవిడ్‌ -19 ను అరికట్టడానికి సిద్ధంగా ఉండాలి.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.