close

తాజా వార్తలు

Updated : 15/04/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సప్తపది..  ఇష్టపడి

సప్తపదితో ఒక్కటైతే కల్యాణం. ఇప్పుడు సప్తపదితో లోక కల్యాణం. శుభ్రత వైపు అడుగు.. ఆరోగ్యం కోసం ఇంకో అడుగు.. మంచితనంలో మరో అడుగు.. కరోనాను కడిగేయడానికి ఇదే ముందడుగు! ఇలా ఏడడుగులు సక్రమంగా వేయడానికి అమ్మే ఆదర్శం కావాలి. ఇల్లాలే నడిపించాలి.


ఏడడుగులు ఇవే..

అన్నవృద్ధి, బలవృద్ధి, ధనవృద్ధి, సుఖవృద్ధి, ప్రజాపాలన, దాంపత్యం, సంతానం.. సప్తపది అంతరార్థం ఇదేనని పెద్దల మాట. ప్రధాని చెప్పిన సప్తపది ప్రధాన ఉద్దేశం కరోనా కట్టడి. అంతిమ లక్ష్యం మహమ్మారిపై విజయం. ఈ సప్తపదిని ఇష్టపదిగా భావించి, కష్టమనుకోకుండా పాటించి.. అడుగులు వేయండి.

ల్యాణ కావ్యంలో కమనీయ దృశ్యం సప్తపది. వరుడుని అనుసరిస్తూ ఏడడుగులు వేస్తుంది వధువు. నూరేళ్ల జీవితంలో ఆయన తనకు అండగా ఉంటాడని నమ్ముతుంది. వివాహ క్రతువులో సరదా కోసం నిర్వహించే తంతు కాదిది. అడుగడుగు ఒక విధిని గుర్తు చేస్తుంది. వైవాహిక జీవితం ఎంత గొప్పదో, ఆలుమగలు ఎంత బాధ్యతతో మెలగాలో చెబుతుంది. కరోనా కష్టాన్ని దాటే ప్రయాణంలో త్వరబడినా, పొరబడినా దిద్దుకోలేని తప్పవుతుంది. అందుకే ఆచితూచి అడుగేయాలి. సప్తపది సమయంలో చదివే మంత్రాల అర్థాలు భార్యాభర్తల కర్తవ్యాన్ని బోధిస్తాయి. దేవదేవుడు మనల్ని కలిపాడు, ఇద్దరికీ శక్తి లభించుగాక, దైవానుగ్రహం కలుగుగాక, అన్నికాలాలూ సంతోషంగా ఉందాం, గృహస్థు ధర్మాన్ని సమర్థంగా పాటిద్దాం.. ఇలాంటి అర్థాలు ఇచ్చే మంత్రాలవి. ఈ సందర్భంలోనే ‘నా స్నేహాన్ని వీడొద్దం’టూ కోరుతాడు భర్త. ‘నువ్వు ఏ పొరపాటు చేయకు. నీ వెంటే ఉంటాను’ అంటుంది భార్య. మీరెప్పుడో వేసిన ఏడడుగులు నిండు నూరేళ్లూ కొనసాగాలంటే.. మరోసారి సప్తపది వేయండి. ఈ దఫా ఇల్లాలే ముందుండాలి. మీ వెనకాలే ఇంటిల్లిపాదినీ నడిపించాలి.

అన్నవృద్ధి: లాక్‌డౌన్‌ కాలమిది. అన్నవృద్ధి అంటే.. ఉన్నదాంట్లో ఉన్నతంగా ఉండటం. ఆహారాన్ని వృథాకాకుండా చూసుకోవడం. పరిమిత వనరులను వినియోగించుకుని ఇబ్బందులను అధిగమించాలి. ఈ పనులు ఇల్లాలికేం కష్టం కాదు. నెలాఖరులో చాలామంది చవిచూసినవే! కాకపోతే.. ఇప్పుడు నెలంతా అలాగే ఆలోచించాలంతే!


ధనవృద్ధి: లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక అంశాలు ఆశించినంత అనుకూలంగా లేవు. రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. డబ్బును వృథా చేయకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సరకులు నిండుకోకుండా చూసుకోవాలి. ఆర్థిక వసతి ఉన్నా.. పరిమితికి మించి వస్తువులు కొనుగోలు చేయొద్ధు నేర్పుగా నెట్టుకురావాలి.


బలవృద్ధి: కరోనా కట్టడికి వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో.. రోగనిరోధకశక్తి పెంపు కూడా అంతే అవసరం. ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు రుచికరమైన పదార్థాలు వండిపెట్టడమే కాదు.. అందులో బలాన్నిచ్చేవి ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే!


సుఖవృద్ధి

మానసికంగా ఆనందంగా ఉండగలిగితేనే.. లాక్‌డౌన్‌ కాలాన్ని ప్రశాంతంగా దాటగలం. ఇంటిల్లిపాదీ ఒక్కచోట ఉండటం కన్నా ఇల్లాలికి సుఖం ఏముంటుంది చెప్పండి. విమర్శలకు తిలోదకాలిచ్చి వినోదాలకు పెద్దపీట వేయండి. వాదోపవాదాలతో కాలాన్ని భారంగా గడపకుండా.. ఆటపాటలతో కరిగించేయండి. అప్పుడు ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.


దాంపత్యం: కాగల కార్యాన్ని లాక్‌డౌన్‌ తీర్చింది. ఆలుమగలు అనందాలు పంచుకునే తరుణమిది. మనసులతో మాట్లాడుకోండి. చూపులను అర్థం చేసుకోండి. లేనిపోని అనుమానాలు తవ్వితీసి కాలాన్ని వృథా చేసుకోవద్ధు ఇల్లాలిగా మీరే చొరవ తీసుకొని.. అరమరికలను తుడిచేయండి.


ప్రజాపాలన: ఇల్లు, పిల్లల గురించే కాదు.. నిర్భాగ్యుల గురించీ ఆలోచించాల్సిన సమయమిది. అన్నీ ఉన్నా.. ఆపత్కాలంగా భావిస్తున్న రోజులివి. ఏమీ లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీకు కలిగిన దాంట్లో నిరుపేద ఆకలి తీర్చండి. వీధి కుక్కలకు ఇంత ముద్ద పెట్టండి. మీ గురించే కాకుండా మీ చుట్టూ ఉన్నవారి క్షేమాన్నీ ఆలోచించండి. మనకోసం కష్టపడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి.


సంతానం: పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే సమయమిది. వారికి కాలం తెలియకుండా చూసుకోవాల్సిన తరుణమిదే! ఫోన్‌ ఇచ్చేసో... టీవీ పెట్టేసో.. మీ పనిలో పడిపోకుండా... వీలైనంత సమయం వారితో గడపండి. పిల్లల ఆసక్తులను గమనించండి... వాళ్లని ప్రోత్సహించండి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.