‘వైరస్‌ లీక్‌ ఓ కట్టుకథ’
close

తాజా వార్తలు

Published : 24/05/2020 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైరస్‌ లీక్‌ ఓ కట్టుకథ’

అమెరికా ఆరోపణల్ని కొట్టిపారేసిన వుహాన్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌

బీజింగ్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌(సార్స్‌-కొవ్‌2) వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందన్న ఆరోపణల్ని ఆ ప్రయోగశాల డైరెక్టర్‌ వాంగ్‌ యాన్‌యీ కొట్టిపారేశారు. ఈ విషయంలో అమెరికా చెబుతున్నవి కట్టుకథలేనని తెలిపారు. అసలు ఇలాంటి వైరస్ ఒకటి ఉందని తమకు ముందు తెలియదని పేర్కొన్నారు. ‘‘తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌పై మాకు ముందు ఎలాంటి అవగాహన లేదు. దీనిపై మేం ఎలాంటి పరిశోధనలు కూడా జరపలేదు. అలాంటప్పుడు దీన్ని మేం ల్యాబ్‌లో ఎలా ఉంచుతాం. లీక్‌ ఎలా అవుతుంది’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుతం వుహాన్‌ ల్యాబ్‌లో గబ్బిలాల నుంచి వచ్చిన మూడు రకాల వైరస్‌లు ఉన్నాయని.. వాటితో ‘సార్స్‌-కొవ్‌-2’ జన్యుక్రమం పోలి లేదని వాంగ్‌ యాన్‌యీ తెలిపారు. గతంలో పట్టిపీడించిన సార్స్‌తో జన్యుక్రమంతో పోలిస్తే.. తాజా వైరస్ జన్యుక్రమం 80శాతం మాత్రమే పోలి ఉందన్నారు. రెండు వైరస్‌లు ఒకటి కాదనడానికి ఇంతకంటే ఆధారం ఏమీ ఉండదన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 30న తమ వద్దకు సార్స్‌-కొవ్‌-2 నమూనాలు వచ్చాయని తెలిపారు. జనవరి 2నాటికి దాని జన్యుక్రమాన్ని ఛేదించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరాలు అందజేశామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 40 వేల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ తొలుత చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అది అక్కడే ఉన్న ఓ వైరాలజీ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై ఇప్పటి వరకు అమెరికా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని