బోసి నవ్వులకు కాసుల ఎర!
close

తాజా వార్తలు

Published : 14/02/2020 07:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బోసి నవ్వులకు కాసుల ఎర!

మహానగరంలో దర్జాగా శిశు విక్రయాలు
అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో యథేచ్ఛగా అక్రమాలు
ఈనాడు, హైదరాబాద్‌

ఖైరతాబాద్‌ కూడలి.. చేతిలో పసిగుడ్డు. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతోందని.. కాపాడమంటూ బిక్షాటన చేస్తున్న దివ్యాంగుడు. చూపరుల మనసు కరుగుతోంది.. అతడి జోలె నిండుతోంది. ఇది దీన గాథ కాదు.. లాభసాటి వ్యాపారం. అతడు రోజుకు రూ.1000 సంపాదిస్తుంటాడు. సాయంత్రానికి పసికూనను తల్లికి అప్పగించి రూ.200- 300 వరకు అద్దె చెల్లిస్తాడు. ఒక్క ఖైరతాబాద్‌ కూడలే కాదు.. హైదరాబాద్‌ నగరంలోని పలు కూడళ్లలో ఇదే పరిస్థితి. పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరిన కొందరు మహిళలు భిక్షాటనకు ఉపయోగించే వారిలో అధికశాతం ఆయా రాష్ట్రాల నుంచి దొంగతనంగా తీసుకొచ్చిన పిల్లలే ఉంటున్నారు. వారి బోసినవ్వులకు ధర కడుతున్నారు. కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.హైదరాబాద్‌ మహానగరంలో పసిపిల్లల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహానగర వీధులు, శివారు ప్రాంతాలు, పలు బస్తీలు శిశువుల అమ్మకాలకు చిరునామాగా మారుతున్నాయి. గతేడాది ఇద్దరు చిన్నారులను విక్రయిస్తుండగా గుర్తించి శిశువిహార్‌కు తరలించారు. ఈ ఏడాది కేవలం 35 రోజుల వ్యవధిలో విక్రయానికి సిద్ధంగా ఉన్న ముగ్గురు చిన్నారులను గుర్తించారు. నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శిశువిక్రయాల వెనుక పెద్ద ముఠాల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. పిల్లలను దొంగిలించి దూర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని భావిస్తున్నారు. గతేడాది రంగారెడ్డి జిల్లాలో మూడేళ్ల పిల్లాడిని విక్రయిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఆ పిల్లవాడిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వ్యవహారంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల ప్రమేయమూ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో హైదరాబాద్‌ పోలీసులు అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ముగ్గురు చిన్నారులను కాపాడి తల్లి ఒడికి చేర్చారు. ఈ ముఠా సభ్యులు పసిపిల్లలను కిడ్నాప్‌ చేస్తూ ఒక్కొక్కరిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 3.10 లక్షల వరకు పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్నట్టు నిర్ధరించారు.

ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపంతో..
నగరంలోని అధిక శాతం ఆసుపత్రుల్లో సరైన పర్యవేక్షణ కనిపించదు. శిశు విక్రయాలతో తేలికగా డబ్బు సంపాదించే ముఠాలకు ఇది అనుకూలంగా మారుతోందని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. అవాంఛిత గర్భధారణ, ఆడశిశువులు, పేదరికం, అనారోగ్యం తదితర అంశాలు శిశువిక్రయాలకు దారితీస్తున్నాయి. ఎక్కువగా పెళ్లికి ముందు పుట్టే చిన్నారులను లక్ష్యంగా చేసుకుని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో బేరసారాలు సాగుతుంటాయి. అధిక సంతానం, పేదరికంతో ఆసుపత్రుల్లో చేరే గర్భిణులపైనా ముఠా సభ్యులు దృష్టి పెట్టి.. శిశువులు పుట్టగానే రంగంలోకి దిగుతారు. ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన సమాచారం ప్రకారం .. శిశు విక్రయాలకు పాల్పడే ముఠాలు మూడు విడతలుగా పిల్లలను విక్రయించే తల్లిదండ్రులు, బంధువులతో మంతనాలు సాగిస్తారు. మొదటి బృందం ఆసుపత్రులు, బయటి ప్రాంతాల నుంచి పిల్లలను కొనుగోలు చేస్తారు. వారిని రెండో ముఠాకు అప్పగించి కమీషన్‌ తీసుకుంటారు. మూడో ముఠా ఆ చిన్నారులను ఆడ/మగ ఆధారంగా కొనుగోలుదారులకు భారీ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కేవలం రూ.లక్ష ఖర్చుతో కొన్ని ముఠాలు రూ. 25 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించినట్లు ఆయన వివరించారు.

అద్దెకిస్తారు.. విక్రయిస్తారు
దళారుల కాసుల కక్కుర్తి బాల్యాన్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తోంది. తమ వద్దకు చేరిన పసికూనలను అక్రమార్కులు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. పిల్లల్లేని దంపతులకు విక్రయించి ఒకేసారి సొమ్ము చేసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు చేరవేసి రోజు/నెలవారీ అద్దె తీసుకుంటారు. మాదకద్రవ్యాల రవాణా, బాలకార్మికులుగా పనిలో ఉంచి నెలవారీగా డబ్బులు తీసుకుంటున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, చిత్తూరు, గుంటూరు జిల్లాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన నవజాత శిశువులను హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంచి మంచి ‘బేరం’ రాగానే విక్రయిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారుల తనిఖీల్లో దళారులు మాత్రమే పట్టుబడుతున్నారని, సూత్రధారులు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కట్టడి చేయకుంటే వేలాదిమంది చిన్నారులు తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని