తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి

నిరసనగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగసభలో దుండగులు రాళ్లు విసిరారు. కృష్ణాపురం కూడలిలో జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం దిగి రోడ్డుపై కాసేపు బైఠాయించారు. గాయపడిన కార్యకర్తలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజం నశించాలన్నారు. ఆందోళనకు దిగిన తెదేపా అధినేత వద్దకు అదనపు ఎస్పీ మునిరామయ్య వచ్చి మాట్లాడారు. నిరసన విరమించాలని కోరారు.

ఎస్పీ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు

అనంతరం అనిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణాపురం కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లకుండా ఆపేయడంతో రోడ్డుపైనే ఆయన నిలబడ్డారు. దీంతో అదనపు ఎస్పీ సుప్రజ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడారు. అనంతరం ఎస్పీకి ఆయన వినతిపత్రం అందజేశారు.

రాళ్లదాడి రాజకీయ కుట్రే: చంద్రబాబు

తమ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చట్టం కొందరికి చుట్టమైతే పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు. కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని.. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రేపు తమ ఎంపీలు దిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ఉద్యోగులంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలన్నారు. వైకాపా రౌడీయిజానికి భయపడేది లేదని చెప్పారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని