close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్షణాలు కనిపించకుండా..పెరుగుతున్న కేసులు

బాపట్ల: భావపురిని కొవిడ్‌-19 మహమ్మారి వదలటం లేదు. పట్టణంలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు ఆదివారం నమోదయ్యాయి. నరాలశెట్టివారిపాలేనికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుంటూరు వెళ్లి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలతో అనారోగ్యంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వారం క్రితం చేరగా ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేశారు. సదరు వ్యక్తి నుంచి వైద్యులు స్వాబ్‌ నమూనా సేకరించి కరోనా పరీక్ష నిమిత్తం గుంటూరు పంపించారు. రెండ్రోజుల క్రితం ఆసుపత్రి నుంచి స్వగృహానికి పంపించి బయటకు రాకుండా ఇంటి క్వారంటైన్‌ ఉండాలని చెప్పారు. ఆదివారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. నరాలశెట్టివారిపాలేన్ని రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. బాపట్లకు చెందిన ఓ యువ ఇంజినీర్‌ హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. హైదరాబాద్‌లో అతనికి కరోనా పరీక్ష చేశారు. శనివారం అర్ధరాత్రి తన సతీమణితో కలిసి ప్రైవేటు వాహనంలో బాపట్లకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఉండగానే అతనికి కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్లు పరీక్షల ఫలితాల్లో వెల్లడైంది. స్థానిక అధికారులకు ఈ సమాచారం అందగానే యువ ఇంజినీర్‌కు ఫోన్‌ చేసి గుంటూరులోనే ఆగిపోయి జీజీహెచ్‌కు వెళ్లాలని సూచించారు. బాధితుడు అధికారుల మాట పెడచెవిన పెట్టి భార్యతో కలిసి బాపట్ల వచ్చేశాడు. పట్టణ పోలీసులు అప్రమత్తమై కొత్త బస్టాండ్‌ వద్ద వారిని ఆపేసి కాలినడకన ఏపీహెచ్‌ఆర్డీఐలోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. బాధితులను ఆదివారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో గుంటూరుకు తరలించారు.

నరసరావుపేట పట్టణం: నియోజకవర్గ పరిధిలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ఆదివారం తెలిపారు. పట్టణ పరిధి ఏనుగుల బజారులో రెండు, సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్‌లో రెండు, రామిరెడ్డిపేటలో ఒకటి, కాకతీయనగర్‌లో మరొకటి నమోదయ్యాయి. నరసరావుపేట మండలం చిన్నతురకపాలెంలో ఒకటి, మండల కేంద్రమైన రొంపిచర్లలో ఒకటి, బుచ్చిపాపన్నపాలెంలో మరొక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. స్టేడియంలో గుంటూరు నుంచి వచ్చిన ఐమాస్కు వాహనంలో ఆదివారం అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. ప్రత్యేక వాహనంలో వచ్చిన సిబ్బంది 200మంది నుంచి శాంపిళ్లు సేకరించారని డాక్టర్‌ నాగపద్మజ తెలిపారు.

రొంపిచర్ల: రొంపిచర్లలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఆదివారం మండల అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వచ్చాడు. అతనికి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. అధికారులను అతనిని కొవిడ్‌ వైద్యశాలకు, ప్రాథమిక కాంటాక్ట్‌లో ఉన్న ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు. ద్వితీయ కాంటాక్ట్‌ కింద 24మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

మాచవరం : మండలంలోని మల్లవోలు యువకునికి కరోనా వైరస్‌ సోకినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు అనూష తెలిపారు. ఇతను పెదనందిపాడులో ఉంటున్నాడని, అక్కడ అతని స్నేహితుడికి కరోనా సోకడంతో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఫలితాల్లో పాజిటివ్‌ రావడంతో శుక్రవారం మల్లవోలు వచ్చిన అతడిని శనివారం క్వారంటైన్‌ కేంద్రానికి పంపినట్లు ఆమె వెల్లడించారు.

నాదెండ్ల : వరవకట్టలోని సెకండరీ కాంటాక్టులకు కొవిడ్‌-19 పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ రావడంతో కంటెయిన్‌మెంట్‌ జోన్‌లోని 79 మంది నుంచి గతనెల 30న నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిన సంగతి తెలిసిందే. వీరందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యుడు సోమ్లానాయక్‌ ఆదివారం తెలిపారు.

దాచేపల్లి : దాచేపల్లిలో ఆదివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వాటిలో కేసానపల్లిలో ఒక మహిళ సహా ఇద్దరు, నారాయణపురంలో ఒకటి నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యురాలు లక్ష్మీశ్రావణి చెప్పారు. ముగ్గురితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను పీహెచ్‌సీ సిబ్బంది సేకరిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వీధులతో పాటు వాటి సమీపంలోని పలు చోట్ల జనం రాకపోకలను నిషేధించి రెడ్‌జోన్‌గా ప్రకటించారు..

పిడుగురాళ్ల: పట్టణంలో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్యామల ఆదివారం తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేసే కార్మికునికి గత వారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతని సెకండరీ కాంటాక్ట్స్‌ అయిన ముగ్గురు వ్యక్తులతో పాటు, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయునికి, రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి కూడా కరోనా సోకినట్లు ఆమె వివరించారు.

రెంటచింతల: రెంటచింతలలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యులు హుస్యానాయక్‌ వెల్లడించారు. జూన్‌ 30న హైదరాబాద్‌ నుంచి రెంటచింతలకు 60 ఏళ్ల వృద్ధురాలు వచ్చింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో స్వాబ్‌ పరీక్ష చేయగా కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు రెంటచింతలలో ఏడు, రెంటాల ఒకటితో కలిపి మండలంలో కేసులు తొమ్మిదికి చేరాయి.

బాపట్ల: కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి బాపట్ల ఆసుపత్రిలో వైద్యం అందించటానికి ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. స్వాబ్‌ నమూనాలు సేకరించి కరోనా పరీక్షల నిమిత్తం గుంటూరు పంపిస్తున్నారు.

వినుకొండ : వినుకొండలో కొవిడ్‌-19 సామాజిక విస్తరణ గొలుసు తెంచేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. కొత్తపేటకు చెందిన బంగారం వ్యాపారి, హనుమాన్‌నగర్‌ మహిళ కరోనాతో మృతిచెందడం.., ల్యాబ్‌టెక్నీషియన్‌లు ఇద్దరు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతుండటంతో పట్టణంలో నాలుగు వీదులను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించి అక్కడ రాకపోకలు నియంత్రించారు. ఆదివారం సంచార వైద్యశాల సిబ్బంది స్థానికుల నుంచి స్వాబ్‌ నమూనాలు సేకరించారు.

కొల్లిపర: మండలంలోని మున్నంగిలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారిణి సీహెచ్‌ లక్ష్మీసుధ ఆదివారం తెలిపారు. విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న మున్నంగి వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. గ్రామంలో 12 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, రోగి తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

గ్రామీణ పోలీసు వర్గాల్లో ఆందోళన

చిలకలూరిపేట గ్రామీణ: కొవిడ్‌ లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిలకలూరిపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఓ అధికారికి మొదట కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయనతో పనిచేసే అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు చేశారు. సదరు అధికారితోపాటు కుటుంబ సభ్యులు నలుగురికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారందరికీ ఎన్‌ఆర్‌ఐ ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఒక అధికారికి, యడ్లపాడు స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అధికారి వాహనానికి డ్రైవర్లుగా పనిచేసిన ఇద్దరు హోంగార్డులు, విధుల్లో ఉన్న మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ అని ఆదివారం పరీక్షల ఫలితాల్లో తేలింది. మిగిలిన అధికారులకు, సిబ్బందికి నెగెటివ్‌ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం నిర్ధారణ అయిన ముగ్గురికి సంబంధించి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. హోంగార్డు నివాసం ఉంటున్న మండలంలోని పసుమర్రు గ్రామంలోని సదరు వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. నిత్యం కొవిడ్‌ వ్యాపించకుండా విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేస్తున్న నియోజకవర్గ స్థాయి అధికారికి పాజిటివ్‌ రావడం పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శాసనసభ సమావేశాల సమయంలో విధినిర్వహణకు వెళ్లినవారికి ఎక్కువమందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సదరు అధికారికి కూడా వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట గ్రామీణ పోలీస్‌ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో దూరం పాటిస్తూ మరో 14 రోజులపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఉన్నతాధికారులు కూడా వారికి అవకాశం కల్పించాలి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.