
తాజా వార్తలు
రైలు బోగీల్లో ఐసోలేషన్ వార్డులు
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 873కి చేరగా 19మంది మరణించారు. దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశవ్యాప్తంగా 13వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈనేపథ్యంలో రైళ్లలో ఉండే బోగీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలనే అభిప్రాయం వ్యక్తమైంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన భారతీయ రైల్వే .. రైలులోని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా విడుదల చేసింది. ఇలా చేయడం వల్ల సరిగా వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా అత్యవసర సేవలు అందించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
రైలు బోగీలో ఐసోలేషన్ కేంద్రాలు ఇలా..
* ప్రతి కోచ్‌లో రెండు మరుగుదొడ్లను బాత్‌రూమ్‌లుగా మార్చారు. ఇందులో కూడా ఫ్లోటింగ్ టాయిలెట్ పెన్ ఏర్పాటు చేశారు.
* ప్రతి బాత్రూమ్లో హ్యాండ్ షవర్, ఒక బకెట్. సైడ్ మిడిల్ బెర్త్‌లను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నలుగురు ఉండేలా ఏర్పాటు చేశారు.
* ఐసోలేషన్‌కు వచ్చే వారి సామగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు ఏర్పాటు.
* వైద్య పరికరాలను నడపడానికి కంపార్ట్మెంట్లో 220 వోల్ట్ విద్యుత్ అనుసంధానం.
* ప్రతి కూపేకు ప్రత్యేకంగా కర్టెన్లు ఏర్పాటు
* ప్రతి కోచ్‌లో పది ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దారు. కోచ్ బయట.. రోగుల కోసం వెలుపల 415 ఓల్ట్స్ విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు.
* ఐసోలేషన్‌కోసం తయారు చేసిన కోచ్‌లను నిత్యం శానిటైజ్ చేస్తున్నారు.
* ఐసోలేషన్ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.