close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/04/2020 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

సమూహ ఉపద్రవం

అయిదారు వారాల క్రితం దక్షిణ కొరియాలో ముప్ఫై ఒకటో నంబరు రోగి సృష్టించిన కల్లోలం ఇంతా అంతా కాదు. ప్రార్థనాలయాలు, ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సంచరించిన ఆమె కారణంగా కరోనా వైరస్‌ అసంఖ్యాకులకు సోకి కేసుల సంఖ్య అమాంతం పోటెత్తినట్లు రుజువు కావడంతో- కొరియన్లు నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం భారత్‌నూ అలా భయకంపితం చేస్తున్న పేరు నిజాముద్దీన్‌ మర్కజ్‌! దేశ రాజధాని దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో పక్షం రోజుల క్రితం భారీయెత్తున నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో దేశం నలుమూలల నుంచి వేల మంది పాల్గొన్నారు. వందల సంఖ్యలో విదేశీయులు హాజరయ్యారు. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొని కరీంనగర్‌ వచ్చిన ఇండొనేసియన్ల బృందంలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడినట్లు గుర్తించిన తక్షణం తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. మత ప్రార్థనల్లో పాలుపంచుకున్న ఆరుగురు తెలంగాణవాసుల మృతి, ఏపీలో కరోనా కేసులకూ మూలాలు దిల్లీలోనే ఉన్నాయన్న నిర్ధారణ దరిమిలా వివిధ రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 437 కేసులు నమోదు కావడం, లాక్‌డౌన్‌ స్ఫూర్తికి జమాత్‌ సదస్సు ఎన్ని తూట్లు పొడిచిందో చాటుతోంది. తబ్లిగీ కార్యకర్తలతో భేటీ అయిన వారందర్నీ తక్షణమే గుర్తించాలన్న కేంద్ర ఆదేశాలకు స్పందనగా, దిల్లీ మర్కజ్‌ను సందర్శించి వచ్చినవారి వివరాలు సమీకరించినట్లు- ప్రధాని మోదీతో నిన్నటి వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించారు. అక్కడికి వెళ్లివచ్చినవారు తిరుగు ప్రయాణమయ్యాక దారిలోను, స్వస్థలాలకు చేరాక మరెందరితో ముచ్చటించారో, సన్నిహితంగా మసలారో- ఆ వివరాలూ సమగ్రంగా కూపీ తీస్తేనేగాని... నష్ట తీవ్రత స్పష్టం కాదు. వారందరికీ వైద్య పరీక్షల నిర్వహణ, క్వారంటైన్‌కు అనుమానితుల తరలింపు... ప్రాథమ్య ప్రాతిపదికన పట్టాలకు ఎక్కాల్సిన సంక్లిష్ట ప్రక్రియ.
గత నెల మార్చి పన్నెండో తేదీన కరోనా వైరస్‌ను ‘మహమ్మారి’గా ప్రకటించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం దిల్లీలో రెండు వందల మందికి మించి ఒకచోట గుమిగూడరాదని మరునాడు ఆంక్షలు విధించింది. ఆపై దాన్ని 50 మందికి పరిమితం చేసింది. ఆ నిషేధాజ్ఞల్ని తుంగలో తొక్కి తబ్లిగీ జమాత్‌ వేలమందితో సమావేశం ఎలా నిర్వహించింది, అందుకు లోపాయికారీగా ఎవరు సహకరించారన్న ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు దొరకడం లేదు. ఎందరో పౌరుల ఆరోగ్య భద్రతను పణం పెట్టి నిష్పూచీగా మతపరమైన కార్యక్రమం నిర్వహించిన మౌలానా ముహమ్మద్‌ సాద్‌పై పోలీసు కేసు పెట్టాలని దిల్లీ ముఖ్యమంత్రి ఆదేశించాక, జమాత్‌ ముఖ్యనేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిషేధపుటుత్తర్వుల జారీతోనే స్వీయ బాధ్యత తీరిపోయిందన్నట్లు దిల్లీ సర్కారు తలపోస్తుండగా- మలేసియా, ఇండొనేసియా వంటి వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి భారత్‌లో అడుగిడినవారు     తమ ఆరోగ్య వివరాల్ని దాచిపెట్టి ఎన్నో ప్రాంతాల్ని చుట్టేశారు. మార్చి నెల మూడో తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ప్రత్యేక వీసాల విధానం ప్రవేశపెట్టిన కేంద్రం- దిల్లీ పర్యటనార్థం వచ్చిన బృందంలో ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలి, మరొకరు కోయంబత్తూరులో ఆ లక్షణాలతో మరణించినప్పుడే యంత్రాగం అప్రమత్తమై ఉంటే- పెద్ద ముప్పు తప్పిపోయేది. అదీ జరగలేదు! సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికొదిలేయడమే నేడింతటి తీవ్ర అనర్థం తెచ్చిపెట్టిందన్న నిజాముద్దీన్‌ అనుభవంతోనైనా- ప్రభుత్వాలు గుణపాఠం నేర్వాలి. దేశవ్యాప్త ‘లాక్‌డౌన్‌’ గడువు పూర్తయ్యేలోగా మరెక్కడా జనం పెద్దయెత్తున గుమిగూడకుండా కాచుకోవాలి. ముఖ్యంగా వలస కూలీలు సమూహాలుగా తరలి వెళ్తుండటం యూపీ, బిహార్‌లకే కాదు- ఆ దారంట ఇతర ప్రాంతవాసులకూ పెను ప్రమాద సూచికే!
కొవిడ్‌-19 పేరిట వ్యవహరిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్ని చుట్టేసిన వేగం నివ్వెరపరుస్తోంది. ఇప్పటికే 50 వేల మందికిపైగా ప్రాణాల్ని కబళించిన కర్కశ వైరస్‌ సోకిన వారి సంఖ్య తొమ్మిదిన్నర లక్షలకు మించిపోయింది. తొలుత సంక్షోభ తీవ్రతను తక్కువగా అంచనా వేసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తమ దేశంలోనే రెండున్నర లక్షలదాకా మరణాలు అనివార్యమన్న అంచనాలు మింగుడుపడక విలవిల్లాడుతోంది. ఇటలీ లాంటి చోట్ల వంద కేసులు నమోదయ్యాక వారాల వ్యవధిలోనే కరోనా సోకినవారి సంఖ్య లక్ష దాటిపోయింది. అక్కడి దూకుడుతో పోలిస్తే భారత్‌లో నిన్న రెండు వేలకు మించిన కేసుల వేగం తక్కువే అయినా, నిజాముద్దీన్‌ తరహా ఘటనల రూపేణా పొంచి ఉన్న ముప్పు ఎంతమాత్రం ఉపేక్షించరానిది. తబ్లిగీ జమాత్‌ ఉదంతం నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్ని కరోనా ప్రజ్వలన కేంద్రాలు(హాట్‌స్పాట్లు)గా కేంద్రం గుర్తించింది. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌ సహా ఆరు రాష్ట్రాల్లోనే కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయనీ లెక్కకట్టింది. మూడు వారాల లాక్‌డౌన్‌ గడువు ముగిశాక తదుపరి చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పరిష్కార వ్యూహం ఆవశ్యకతను ప్రధాని మోదీ నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రస్తావించారు. అందులో భాగంగా, కేసుల తాకిడి అధికంగా ఉన్న ప్రజ్వలన కేంద్రాల్లో జనసంచారంపై ఆంక్షల పొడిగింపు తప్పకపోవచ్చు. ఈలోగా అనుమానితులను, ప్రాథమిక లక్షణాలు కలిగినవారిని పూర్తిగా పరీక్షించి కరోనా వైరస్‌ను దిగ్బంధించే కార్యాచరణ ప్రణాళిక ఎక్కడా గాడితప్పకూడదు. సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించినట్లు- కరోనాకంటే పెద్ద సమస్య భయం. నిజానికి, కనిపించని శత్రువుపై ఈ పోరాటంలో ఏ దశలోనైనా యంత్రాంగం అలసత్వం- మరింత ప్రమాదకరం!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.