close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/09/2019 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గీత గోవిందం

ద్వాపర యుగంలో ద్వారకను ఏలిన శ్రీకృష్ణుణ్ని ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఇష్టపడేవారు. నయనానందకరమైన ఆ మధురాధిపతిని స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ప్రేమించేవారని భాగవతం చెబుతోంది.

వ్రేపల్లెలో నందుడి ఇంట పెరిగిన శ్రీకృష్ణుడి అందం, చిలిపి చేష్టలు గోప బాలబాలికలనందరినీ ఆనందపరచేవి. శ్రీకృష్ణుడు కిశోర కౌమార దశలోనే గోప భామలను పారవశ్యానికి గురిచేశాడని భాగవతం చెబుతోంది. యౌవనంలోకి అడుగిడిన మాధవుడు గోప కన్నెలకు ప్రణయ మూర్తిగా మారాడు. శ్రీకృష్ణుడి బంధువర్గంలోనివాడు విశ్వభానుడు. అతడు యశోదకు సోదరుడి వరస. ఈ విశ్వభానుడు, కీర్తిదేవి దంపతుల కూతురే రాధ. శ్రీకృష్ణుడికన్నా మూడేళ్లు పెద్దది. ఈ రాధాకృష్ణుల మధ్య అమలిన శృంగారానికి సంబంధించిన భావకావ్యమే జయదేవ విరచిత గీత గోవిందం. మధుర భక్తిని ప్రతిబింబించే ఈ కావ్యం నాడు నేడూ సదా అనురంజకమే.

సంస్కృత భాషలో విలక్షణమైన అతి చిన్న కావ్యం గీత గోవిందం. కాళిదాసు రాసిన రుతుసంహారం, మేఘదూతం కావ్యాలకు దీటుగా ప్రాచీన కవులతో పాటు ఎందరో సాహితీవేత్తలు గీత గోవిందాన్ని సరిపోల్చారు. ఈ కావ్యంలో నాయికా నాయకుల ప్రణయం, శృంగారాన్ని జయదేవుడు మనోహరంగా వర్ణించాడు. ఇందులో పన్నెండు   సర్గలు ఉన్నాయి. ఇరవై నాలుగు అష్టపదులు ఈ కావ్యంలో వలపులు వర్షిస్తాయి. తొంభైనాలుగు వర్ణనాత్మకమైన శ్లోకాలతో గీత గోవిందం జయదేవుడి భావ వ్యక్తీకరణకు పరాకాష్ఠగా హృదయాలను రంజింపజేస్తుంది.

తొలి అష్టపది పరమాత్ముడి దశావతార వర్ణనతో ఆరంభమవుతుంది. రెండో అష్టపదిలో రాధా మాధవుల ప్రణయాన్ని సుందరంగా చూపాడు. రాధ కుచాలింగనపరుడై పరవశించే కృష్ణా... దివ్యకుండలాలను, వనమాలను ధరించిన నీ ముగ్ధ మనోహర రూపానికి మంగళం అంటాడు. ఆయన వాడిన పదాలు అతి మనోహరం. మకరందంలా రుచిస్తాయి. ఆ యమునా తీరా పరిసరాలను, చల్లని గాలులు కోకిల రాగాల తుమ్మెదల ఝుంకారాలను వర్ణిస్తూ నీకోసం వేచి ఉన్న గోపికల మానసాలు తల్లడిల్లిపోతున్నాయని పల్లవిస్తాడు.

మరో శ్లోకంలో కందర్ప జ్వరం అంటూ నాయిక విప్రలంబ శృంగారం ఎలా అనుభవిస్తుందో ఉదాహరిస్తాడు జయదేవుడు. తీపి రుచి తెలియాలంటే ముందు కారం తినాలట. రాధ విరహానికి వసంతం ఉద్దీపన అయింది. విరహ తాపాన్ని భరించలేక బృందావనంలోని చెట్టు, పుట్ట మొక్కా కొమ్మలను నిమురుతూ రాధిక విప్రలంబ విరహోత్కంఠిత అయిందట. నాలుగో అష్టపదిలో శ్రీకృష్ణుడు మేఘశ్యాముడై చందనపు పూతలతో పరిమళిస్తున్నాడు అంటాడు జయదేవుడు. ఆయన సామోద దామోదరుడట. గోపికలందరికీ బృందావనంలో మాధవుడు ఆమోదయోగ్యుడైన వాడు. ఈ అష్టపదిలో గోపికా వల్లభుడు దక్షిణ నాయకుడు. రాధ... స్మిత మనోహరి. ఇలా గీత గోవిందం పన్నెండు సర్గల్లోనూ జయదేవుడు మాధవుణ్ని పలురకాల రూప లావణ్యాలతో వర్ణిస్తాడు.

కృష్ణుడు ఇతర గోపికలతో క్రీడిస్తున్నట్టు రాధ ఊహించుకొని అసూయ చెందుతుంది. రాధిక విరహ వేదనను మధురమైన హృదయంగమమైన వర్ణనతో జయదేవుడు పాఠకులను పరితపింపజేస్తాడు. ఎనిమిదో సర్గలో మోహనుడు విలక్షణ లక్ష్మీపతి. తొమ్మిదో సర్గలో మురళీధరుడు ముగ్ధ ముకుందుడు. పదో సర్గలో మానస మాధవుడు. పదకొండో సర్గలో సానంద గోవిందుడు. పన్నెండో సర్గలో సుప్రీతి పీతాంబరుడు. ఇలా పన్నెండు సర్గల్లోని ఇరవై నాలుగు అష్టపదులతో జయదేవుడు ఈ కావ్యాన్ని రసరమ్యంగా రాగరంజితం చేశాడు.

- అప్పరుసు రమాకాంతరావు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.