
తాజా వార్తలు
కోలుకుంటున్న మృత్యుంజయుడు
గాలిపటానికని వెళ్లి గోదాంలో వారం రోజులు మగ్గిన వ్యక్తి
అల్వాల్: అన్నపానీయాలు లేకుండా ఏడు రోజులపాటు గోదాంలో చిక్కుకొని మృత్యుంజయుడిగా బయటపడిన వ్యక్తి కోలుకుంటున్నాడు. ఓల్డ్‌బోయిన్‌పల్లి-హస్మత్‌పేట మసీద్ సమీపంలో నివసించే వహీద్(32) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 15న ఇంటి సమీపంలోని వారానికి ఒకసారి తెరిచే గోదాం రేకులపై పతంగి పడటంతో దాన్ని అందుకోవడానికి పైకి ఎక్కి అందులో పడిపోయాడు. అప్పటి నుంచి గోదాంలో ఆర్తనాదాలు చేసినా ఎవరికీ వినిపించలేదు. చివరకు నీరసించి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. బుధవారం రాత్రి గోదాం నిర్వాహకులు ఆటో డ్రైవర్‌తో కలిసి వచ్చి అందులో స్పృహ తప్పి పడి ఉన్న వ్యక్తిని గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వహీద్‌గా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గోదాముపై నుంచి పడిన అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఏడు రోజులు ఆహారం లేకున్నా జీవించే ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు ఇసుకను తిన్నట్లు తెలుస్తోంది.