
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ ఆద్యుడు: చంద్రబాబు
రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు దూరమై 25 సంవత్సరాలు గడిచినా.. ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల ముందే కదలాడుతున్నట్టు ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆధ్వర్యంలో హరితహారం
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆధ్వర్యంలో గుర్రంగూడ రిజర్వు ఫారెస్టులో సోమవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మొక్కలు నాటారు. రిజర్వ్ ఫారెస్టులోని 53 ఎకరాల్లో 50 వేల మొక్కలను మార్గదర్శి సంస్థ నాటింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకంలో భాగంగా సంస్థ మొక్కల పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో రెండేళ్లుగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తెలంగాణ: రెండో రోజు టీకా పంపిణీ ఇలా..
తెలంగాణలో కొవిడ్ టీకా పంపిణీ రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం తిరిగి టీకాల పంపిణీ చేపట్టారు. రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* టీఎస్: 206 పాజిటివ్ కేసులు.. 346 రికవరీలు
* శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో పులి
4. స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్!
మరికొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చివరి రోజు కరుణరసాన్ని కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం 100 మందికి పైగా వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, తన తప్పులను కూడా ప్రక్షాళన చేసుకునేందుకు ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి యోచన చేసిన ట్రంప్.. ఇప్పుడు ఆ ఆలోచనపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. #VD10: టైటిల్ ప్రకటించిన టీమ్
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ పవర్ఫుల్ యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘లైగర్’(లయన్+టైగర్) పేరుతో రానున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నారు. దీనికి సాలా క్రాస్‌బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్‌లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చైనాకు ట్రంప్ చివరి ఝలక్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు చివరి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం డ్రాగన్‌తో కయ్యానికి కాలుదువ్విన ఆయన చివరి రోజుల్లోనూ వదిలిపెట్టడం లేదు. ఆర్థికంగా చైనాను బలహీనపరిచేందుకు ఉన్న అన్ని అస్త్రాల్ని సంధిస్తున్నారు. తాజాగా చైనా టెలికాం దిగ్గజం, 5జీ సాంకేతికతకు ప్రసిద్ధి గాంచిన హువావే టెక్నాలజీస్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాలోని ఇంటెల్ సహా మరికొన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హువావేకు పరికరాలను సరఫరా చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు
దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్ ధర 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు కొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.95కు చేరింది. డీజిల్ ధర రూ.75.13గా ఉంది. దేశీయ అతిపెద్ద ఇంధన రిటైల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. పెట్రోల్ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అమెరికాలో అది సాధ్యమే: ఫౌచీ
వంద రోజుల్లో వంద మిలియన్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందచేసే లక్ష్యాన్ని చేరటం కచ్చితంగా సాధ్యమేనని.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 100 రోజుల్లో పది కోట్ల టీకా డోసులను ప్రజలకు అందజేస్తానని.. జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ లక్ష్యాన్ని చేరటం అసాధ్యమేమీ కాదని ఫౌచీ కూడా అభిప్రాయపడ్డారు. కాబోయే అధ్యక్షుడికి కొవిడ్-19 వ్యవహారాల ముఖ్య సలహాదారుగా ఫౌచీని నియమించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు
కరోనా సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూ వచ్చిన అబ్దుల్లా.. తన 35 నిమిషాల ప్రసంగంలో నవ్వులు పూయించారు. కరోనా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. తానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించారు. ‘‘ఎదుటి వ్యక్తితో చేతులు కలపడానికి భయమేస్తోంది. ఆలింగనం చేసుకోడానికి భయమేస్తోంది. నిజాయతీగా చెబుతున్నా.. నేనైతే నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* రష్యా ప్రతిపక్ష నాయకుడి అరెస్టు!
10. భారత్ లక్ష్యం 328
బ్రిస్బేన్ వేదికగా భారత్×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మహ్మద్ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్ (4/61) సత్తాచాటారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. అయితే, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ ఆసీస్ వేగంగా పరుగులు సాధించి ఆధిక్యాన్ని పెంచుకుంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి