close
Array ( ) 1

తాజా వార్తలు

50-50కి సరికొత్త ఓపెనింగ్‌..!

కొత్త ప్రతిభను నమ్ముకున్న రెండు జట్లు
 బుధవారం ఉదయం 7:30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం

వరుస సూపర్‌ ఓవర్లతో మురిపించిన టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నా.. సీనియర్‌ ఓపెనింగ్‌ జోడీ లేకున్నా.. వన్డే సమరానికి సైరా.. అంటోంది. విలియమ్సన్‌ అండ లేని న్యూజిలాండ్‌ను మళ్లీ వైట్‌వాష్ చేయాలని తహతహలాడుతోంది. పొట్టి క్రికెట్‌కు సంబంధం లేకున్నా ప్రయోగాలకు సిద్ధమేనంటోంది. ఘోర ఓటములతో కుమిలిపోతున్న కివీస్‌ పోయేదేమీ లేదని భావిస్తోంది. పోరాటమే ప్రాణంగా బరిలోకి దిగుతోన్న ఆతిథ్య జట్టును బుధవారం కోహ్లీసేన ఎలా ఢీకొట్టనుంది!!


కొత్త ప్రతిభకు అవకాశం

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియాకు ఇది మూడో వన్డే సిరీస్‌. కరీబియన్‌ దీవుల్లో వెస్టిండీస్‌ను సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు కివీస్‌తో సమరానికి సిద్ధమైంది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రెండు జట్లు చివరిసారి తలపడింది ప్రపంచకప్‌లోనే కావడం గమనార్హం. టీ20 సిరీస్‌ను 5-0తో ఊడ్చిపారేసిన కోహ్లీసేన మరోసారి అదే పనిచేయాలని పట్టుదలతో ఉంది. ఆత్మవిశ్వాసంతో సాగుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. అందుకే విజయంతో శుభారంభం చేయాలని భావిస్తోంది. అనుభవజ్ఞులు గాయపడటంతో రెండు జట్లు కొత్త ప్రతిభనే నమ్ముకున్నాయి.


ఇద్దరు ఓపెనర్ల అరంగేట్రం

పిక్క గాయంతో రోహిత్‌శర్మ పర్యటనకు దూరమవ్వడం టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బే. ఇప్పటికే ధావన్‌, భువి, హార్దిక్‌, దీపక్‌ లేరు. విపత్కర పరిస్థితుల్లోనే కొత్త అవకాశాలు కనిపిస్తాయన్నట్టు ఈ సారి ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయనున్నారు. టెస్టుల్లో నిరూపించుకున్న మయాంక్‌ అగర్వాల్‌, యువ ఆటగాడు పృథ్వీషాను ఆ అదృష్టం వరించింది. భారత్‌ తరఫున ఇద్దరు ఓపెనర్లు ఒకేసారి అరంగేట్రం చేయడం ఇది నాలుగోసారి. 2016లో కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ జింబాబ్వే, 1974లో సునిల్‌ గావస్కర్‌, సుధీర్‌ నాయక్‌ ఇంగ్లాండ్‌పై, 1976లో పార్థసారథి శర్మ, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ చేశారు.


రాహుల్‌కే కీపింగ్‌


 

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులు ఉంటాయని సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. రాజ్‌కోట్‌ తరహాలో వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ను ఐదో స్థానంలోనే దించనున్నాడు. వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అతడివేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంగళవారం శివమ్‌ దూబె, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌ కన్నా ముందు కోహ్లీ, శ్రేయస్‌, మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ సాధన చేశారు. అంటే కోహ్లీ 3, శ్రేయస్‌ 4, రాహుల్‌ 5వ స్థానంలో రావడం ఖాయం. ఆరో స్థానంలో పాండేకు చోటు దక్కితే ఆల్‌రౌండర్‌ కోటాలో దూబె, జడేజా, జాదవ్‌లో ఒక్కరికే అవకాశం. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల సూత్రాన్ని అనుసరిస్తే కుల్‌దీప్‌, జడేజా జట్టులో ఉండొచ్చు. షమి, బుమ్రా ఖాయమే. సైని, శార్దూల్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.


పునరుత్తేజం కోసం

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌, భారత్‌తో టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ అయిన కివీస్‌ పునరుత్తేజం కోసం ప్రయత్నిస్తోంది. గాయంతో రెండు వన్డేలకు సారథి కేన్‌ విలియమ్సన్‌ దూరమవ్వడం కచ్చితంగా ఎదురుదెబ్బే. సీనియర్‌ రాస్‌ టేలర్‌ పైనే ఇక బ్యాటింగ్‌ భారం. చివరి రెండు టీ20ల్లో సారథ్యం వహించిన టిమ్‌ సౌథీ బాధ్యతలు ఇప్పుడు టామ్‌ లేథమ్‌ తీసుకోనున్నాడు. ఆల్‌రౌండర్లు జిమ్మీ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌ జట్టులో చేరారు. సోధి తొలి వన్డే వరకే. కీపర్‌ టామ్‌ బ్లండెల్‌, పేసర్‌ కైల్‌ జేమిసన్‌ వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు.


భారత్‌: విరాట్‌ కోహ్లీ (కె), పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వి), మనీశ్‌ పాండే, రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని

న్యూజిలాండ్‌: టాస్‌ లేథమ్‌ (కె, వి), మార్టిన్‌ గప్తిల్‌, రాస్‌ టేలర్‌, గ్రాండ్‌హోమ్‌, జిమ్మీ నీషమ్‌, కుగులీన్‌, టామ్‌ బ్లండెల్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్‌ శాంట్నర్‌, హమిష్ బెనెట్‌, ఇష్ సోధి, టిమ్‌ సౌథీ, కైల్‌ జేమిసన్‌, మార్క్‌ ఛాప్‌మన్‌ 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.