మాస్క్‌ లేకపోతే రూ.250 ఫైన్‌
close

తాజా వార్తలు

Updated : 25/03/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ లేకపోతే రూ.250 ఫైన్‌

జరిమానా రూపంలో రూ.4కోట్లు వసూలు

ముంబయి: తగ్గుముఖం పట్టిందన్న కరోనా వివిధ రాష్ట్రాల్లో చాప కింద నీరులా వ్యాప్తిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలందరూ మాస్క్‌లు ధరించడంతో పాటు, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పాటు ముంబయి, బెంగళూరు నగరాల్లో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్‌ లేకుండా తిరిగే వారికి జరిమానా విధిస్తున్నారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మాస్క్‌లేకుండా బయట తిరిగే వ్యక్తులకు పోలీసులు, అధికారులు జరిమానా విధిస్తున్నారు. అలా గత నెల రోజుల్లో 2లక్షల మందికి జరిమానా విధించగా రూ.4కోట్లు వసూలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

‘ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగే వ్యక్తులకు గత నెల రోజులుగా జరిమానా విధిస్తున్నాం. అలా 2లక్షలమందికిపైగా జరిమానా విధించగా, రూ.4కోట్లు వసూలయ్యాయి’ అని ముంబయి పోలీస్‌ అధికారి డీసీసీఎస్‌ చైతన్య తెలిపారు. జరిమానా ద్వారా వసూలైన మొత్తంలో 50శాతం బహృన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు వెళ్లనుంది. మిగిలిన మొత్తాన్ని పోలీస్‌ సంక్షేమ నిధికి జమ చేస్తారు. బుధవారం ఒక్కరోజే ముంబయిలో 5,185 పాజిటివ్‌ కేసులు నమోదవడం గమనార్హం.

కర్ణాటకలోనూ కఠిన ఆంక్షలు

నిత్యం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మార్చి 24వ తేదీ నుంచి ఎవరైనా మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.250 జరిమానా విధించనున్నట్లు బెంగళూరు మహానగర పాలిక హెచ్చరించింది. అదే ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్స్‌లో రూ.100 జరిమానా విధిస్తారు. ఏసీ, నాన్‌ ఏసీ ఫంక్షన్‌ హాల్స్‌, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో మాస్క్‌ ధరించకుండా, సామాజిక దూరం పాటించకపోతే, దాని యజమానిని బాధ్యుడిని చేస్తూ రూ.5వేల నుంచి రూ.10వేలు జరిమానా విధించనున్నారు. పెళ్లిళ్లకు 200మంది, పుట్టిన రోజు వేడుకలకు 100 మంది, అంత్యక్రియలకు రూ.100 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని