అధ్యక్షా.. ఇవేం చేష్టలు! 

తాజా వార్తలు

Updated : 30/03/2021 19:18 IST

అధ్యక్షా.. ఇవేం చేష్టలు! 

మనీలా: ఇబ్బందికర వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి తాజాగా వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదమైంది. తన ఇంట్లో సహాయకురాలి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఆయన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. రోడ్రిగో 76వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కేక్‌ తీసుకొచ్చిన సందర్భంలో నివాసంలో పనిచేసే సహాయకురాలిని ఆటపట్టించేలా తాకేందుకు ప్రయత్నించినట్టు రికార్డయిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్రిగో పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దవావో సిటీలోని తన నివాసంలో ఈ షార్ట్‌ వీడియోను చిత్రీకరించారు. తొలుత కుటుంబ సభ్యులు సిద్ధం చేసిన కేకుపై పెట్టిన క్యాండిల్‌ను రోడ్రిగో ఊదినట్టు ఈ వీడియోలో రికార్డయింది. అనంతరం అక్కడే ఉన్న సహాయకురాలు మరో చిన్న కేకును ఆయన వద్దకు తీసుకొస్తారు. ఆ సమయంలో ఆ మహిళను తాకేలా చేతులు ముందుకు చాపడంతో.. వెంటనే అప్రమత్తమై ఆమె వెనక్కి వెళ్లిపోతుంది. రోడ్రిగో గతంలోనూ మహిళలపై చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఈ వీడియో వెలుగుచూడటంతో మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దుర్బుద్ధితో చేసిన చర్య కాదు: అధ్యక్ష భవనం

ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి హ్యారీ రోక్‌ స్పందించారు. రోడ్రిగా చర్యను సమర్థిస్తూ వివరణ ఇచ్చారు. ఇది దుర్బుద్ధితో చేసిన పనికాదన్నారు. ఆ మహిళ ఎంతో కాలం నుంచి అక్కడ పనిచేస్తోందని తెలిపారు. ఈ ఘటన సమయంలో అధ్యక్షుడి సతీమణి హనీలెట్‌ కూడా అక్కడే ఉన్నందున దీనిపై ఎవరూ అంత చింతించాల్సిన పనిలేదని చెప్పారు. ‘అధ్యక్షుడికి జోకులంటే ఇష్టమని తెలుసు కదా. ఈ పని దుర్బుద్ధితో చేసిందేమీ కాదు ఎందుకంటే  ఆయన సతీమణి హనీలెట్‌ కూడా అక్కడే ఉన్నారు’ అని వివరించారు. 

గతంలోనూ విమర్శలకు కేంద్రబిందువుగా..

అధికార అహంకారంతో మహిళల్ని ఓ ఆట బొమ్మలను చూసినట్టుగా రోడ్రిగో వ్యవహరించిన దాఖలాలు గతంలోనూ అనేకం ఉన్నాయి. ఆడవాళ్లను చూసి ఏదో ఒక వెకిలి పని చేస్తూనే జుగుప్సాకరంగా వ్యవహరించారు. గతంలో జపాన్‌ నాలుగు రోజుల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అక్కడ నివసిస్తున్న ఫిలిప్పీన్స్‌ వాసులతో జరిగిన సమావేశంలో పలువురు వాలంటీర్లను ముద్దుపెట్టుకొన్నారు. 2018 జూన్‌లో కూడా సియోల్‌లో పనిచేస్తున్న వివాహితను రోడ్రిగో చుంబించిన ఘటన అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా తాను చిన్నప్పుడు ఇంట్లో పనిచేసే మహిళపై ఎలా అత్యాచారయత్నం చేసిందీ ఆయనే స్వయంగా చెప్పడంతో అప్పట్లో మహిళా సంఘాలు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేశాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని