Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Published : 05/08/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్‌

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ  సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ముఖ్య అధికారులు ఆరుగురు హాజరయ్యారు. వంద సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందని మంత్రులు అన్నారు.

AP NEWS: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల

2. స్థానికులకు ఉపాధి కల్పిస్తే అధిక ప్రోత్సాహకాలు: కేటీఆర్‌

స్థానికులకు ఉపాధి కల్పించే కంపెనీలకు అధిక ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని సిమెంట్‌ కంపెనీ యజమానులతో మాట్లాడారు. 70 శాతం ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలన్నారు. హుజూర్‌నగర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.
3.
దేవినేని కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయం: చంద్రబాబు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం హేయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. హింసించి ఆనందించడం సీఎం జగన్‌కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జాతీయరహదారిపై పోలీసులు ఏవిధంగా వాహనాలు ఆపుతారని చంద్రబాబు ప్రశ్నించారు.

4. AP NEWS: కృష్ణా తీరంలో హై అలర్ట్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువున ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంతో ప్రాజెక్టులోని నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.

5. కంగ్రాట్స్‌ రవి.. నీ విజయం దేశానికి స్ఫూర్తి: మోదీ

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రజతం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్ దహియాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశానికి వెండి పతకం అందించిన దహియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గొప్ప పోరాట పటిమను, స్ఫూర్తిని ప్రదర్శించావంటూ కొనియాడారు. రవి దహియా ఓ గొప్ప రెజ్లర్‌ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

6. తగినన్ని టీకాలు ఇవ్వకపోతే.. ప్రమాదకరంగా కొవిడ్‌: దీదీ

తమ రాష్ట్రానికి టీకాల సరఫరాను పెంచకపోతే.. కొవిడ్ పరిస్థితి భయంకరంగా మారే అవకాశం ఉందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో అధిక జనాభాకు తగ్గట్టుగా టీకా డోసులు అందడం లేదని ఆరోపించారు.

7. కేంద్రం కీలక నిర్ణయం.. రెట్రోస్పెక్టివ్‌ పన్ను విధానానికి స్వస్తి!

వివాదాస్పదంగా మారిన రెట్రోస్పెక్టివ్‌ పన్ను (వెనుకటి తేదీల నుంచి వేసే పన్ను) విధానానికి స్వస్తి చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం కీలక బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీ సహా 15 వరకు సంస్థలు లబ్ధి పొందనున్నాయి.

8. Moderna: 5 నెలల తర్వాత కూడా 93శాతం ప్రభావశీలత!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ డోసు తీసుకున్న 6నెలల తర్వాత కూడా తమ టీకా 93శాతం ప్రభావశీలత చూపించినట్లు అమెరికా వ్యాక్సిన్‌ సంస్థ మోడెర్నా వెల్లడించింది. అంతకుముందు 94శాతం సమర్థత చూపించగా.. ఆరు మాసాల తర్వాత కేవలం స్వల్ప మార్పు మాత్రమే కనిపించిందని పేర్కొంది.

9. ఫ్లిప్‌కార్ట్‌కు ఈడీ షోకాజ్‌ నోటీసులు..!

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు భారీ జరిమానాను ఎందుకు విధించకూడదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆ సంస్థను ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులతో పాటు మరో తొమ్మిది మందికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

10. నిహారిక భర్త న్యూసెన్స్‌ కేసు ఏమైందంటే..!

మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో రాజీపడ్డారు. ఇక మీదట ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాకుండా చూసుకుంటామని ఇరువర్గాలు పోలీసుల ఎదుట ఒప్పందం చేసుకున్నారు.
 

INDvsENG: లైవ్‌ బ్లాక్‌ కోసం క్లిక్‌ చేయండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని