close

తాజా వార్తలు

Published : 10/01/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దాం: ఎస్‌ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఓ పక్క ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం తన ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. మరోవైపు ఎన్నికల విధుల్లో తాము పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పందించారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ఈ మేరకు 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు. పోలింగ్‌ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏ ఎన్నికలైనా భయపడేది లేదు: ఆదిమూలపు

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం నెల్లూరులో రెండో విడత జగనన్న అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభిస్తారని తెలిపారు. ఏ ఎన్నికలకైనా వైకాపా ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎంత చెప్పినా ఎస్‌ఈసీ వినడం లేదని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌‌, మేకపాటి గౌతం రెడ్డితో కలిసి నెల్లూరులో మంత్రి సురేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళికి లోబడే నెల్లూరులో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. 9 నెలల్లో 13 శాతం పెరిగిన నగదు చలామణీ

దేశంలో ఓ వైపు డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందు జాగ్రత్తతో నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఏకంగా 13 శాతం నగదు చలామణీ పెరిగినట్లు ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. 2020 మార్చి 31 నాటికి చలామణీలో ఉన్న నగదు విలువ రూ.24,47,312 కోట్లు కాగా..  ఈ ఏడాది జనవరి 1 నాటికి ఆ మొత్తం రూ.27,70,315 కోట్లకు పెరిగినట్లు రిజర్వ్‌ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. కొవిడ్‌ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!

చైనాలో పుట్టి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. ఇక తొలి కరోనా మరణం సంభవించి ఏడాది అయినప్పటికీ ఇంతవరకూ కరోనా వైరస్‌ మూలాలు తెలియక పోవడం శాస్త్రవేత్తల్లో అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అయితే, అంతర్జాతీయ సమాజంతో వైరాన్ని నెరిపే చైనా, గోప్యత, గందరగోళ తనంతో ప్రపంచానికి కరోనా మూలాలను బహిర్గతం చేయడం కష్టమేనని అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో కొత్తగా 227 కరోనా కేసులు 

* టీకా ఉచితంగానే ఇస్తాం..మమతా బెనర్జీ

5. హరియాణాలో ఉద్రిక్తత.. సీఎం సభ రద్దు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం పాల్గొనదలచిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఆ చట్టాల వల్ల ఉపయోగాలున్నాయంటూ భాజపా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హరియాణాలోని కర్నల్‌ జిల్లాలోని కైమ్లాలో ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ పేరిట ఆదివారం ఖట్టర్‌ రైతులతో కార్యక్రమం తలపెట్టారు. ఈ సభను ఎలాగైనా అడ్డుకునేందుకు భారతీయు కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేతృత్వంలోని రైతులు ఆ గ్రామానికి ర్యాలీ తీశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు హరియాణా పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘గోబ్యాక్‌ బేడీ’.. గవర్నర్‌ ఇంటి వద్ద సీఎం దీక్ష

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీని వెనక్కి రప్పించాలంటూ పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కారణంగా ఆమెను వెంటనే తొలగించాలంటూ ఆయన శుక్రవారం దీక్ష ప్రారంభించారు. గవర్నర్‌ నివాసానికి కూతవేటు దూరంలోనే ఓ టెంట్‌ వేసి దీక్షాస్థలిగా మార్చారు. తిండీ, నిద్ర అన్నీ అక్కడే చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు సైతం అక్కడే చేస్తున్నారు. నారాయణ స్వామి ఆందోళనకు పుదుచ్ఛేరి కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, సీపీఎంకు చెందిన నేతలు సైతం దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. రౌడీల్లా ప్రవర్తించారు: కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో హైదరాబాదీ యువపేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు ఎదురైన అవాంఛనీయ సంఘటనను టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ప్రేక్షకులు రౌడీల్లా ప్రవర్తించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆటలోనూ సిరాజ్‌, బుమ్రాకు ఇలాంటి సంఘటనే ఎదురవ్వడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

* హద్దులు దాటారు.. ఉక్కు పిడికిలి బిగించాల్సిందే

 8. విద్యార్థులకు ఉచితంగా రోజుకు 2జీబీ డేటా!

కొవిడ్‌-19 మూలంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే కళాశాల విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రోజుకు 2జీబీ చొప్పున ఉచిత డేటా అందించనున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ‘ఉచిత’ సదుపాయం వర్తిస్తుందని సీఎం పళని స్వామి ప్రకటించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న 9.69 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

* జేబుకు చిల్లే: పెరగనున్న నిత్యావసరాల ధరలు!

9. యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి పార్లర్‌ తొలగింపు..!

అమెరికాకు చెందిన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ పార్లర్‌పై యాపిల్‌ సంస్థ చర్యలు చేపట్టింది. తమ యాప్‌ స్టోర్‌ నుంచి పార్లర్‌ను తొలగించింది. క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి పార్లర్‌ యాప్‌ను ఉపయోగించుకొన్నారని యాపిల్‌ ఆరోపిస్తోంది. 24 గంటల్లోపు ఆ సంస్థ యాప్‌లో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రణాళికతో తమ వద్దకు రావాలని యాపిల్‌ సూచించిన  తర్వాత ఈ చర్యలు తీసుకొంది. ఇప్పటికే పార్లర్‌ కూడా యాప్‌లో మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ‘చంటి’ ఆ హీరోతో తీద్దామనుకున్నారు.. కానీ..!

వెంకటేశ్ కథానాయకుడిగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘చంటి’. మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1992 జనవరి 10న విడుదలైన ఈ చిత్రం 29ఏళ్లు పూర్తి చేసుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘చినతంబి’ని తెలుగులో ‘చంటి’గా తీశారు నిర్మాత కె.ఎస్‌.రామారావు. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేశ్‌ నటన అందరినీ మెప్పించింది. తొలుత ఈ సినిమాలో కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్‌ అనుకున్నారట. అయితే, వెంకటేశ్‌తో సినిమా చేయడానికి గల కారణాన్ని దర్శకుడు రవిరాజా ఓ సందర్భంలో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని