
తాజా వార్తలు
ఆమె ప్రతిభకు ఆ లోపం అడ్డు కాలేదు..
రివర్స్ పెయింటింగ్‌లో రాణిస్తున్న సయీదా అలీ
విశాఖపట్నం: వినికిడి లోపం ఆమె ప్రతిభకు అడ్డు కాలేదు. ప్రతి భావోద్వేగాన్ని మనసుతో అర్థం చేసుకుని కుంచెతో కళాత్మక రూపం ఇస్తారు. నిశ్శబ్ద ప్రపంచంలో ఎన్నో సజీవ చిత్రాలకు ప్రాణం పోశారు విశాఖలో పుట్టిన సయీదా అలీ. తాజాగా సంక్రాంతి సంప్రదాయంలో భాగమైన గంగిరెద్దులు, కోడి పుంజుల చిత్రాలకు వర్ణాలద్దారు. విశాఖ నుంచి చిత్రకళా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సయీదా అలీ ఆరో ఏటనే చిత్ర కళలో అడుగుపెట్టారు. ఆమెకు వినిపించదు. మొదట్లో కొద్దిగా ఉన్న సమస్య ఆ తర్వాత పూర్తిగా వ్యాపించింది. అయినా ఆమె కళాసృష్టి ఆగలేదు. రెట్టింపు ఉత్సాహంతో చిత్రకళకు మరింత వన్నెలద్దారు. అద్దంపై చిత్రకళను ఆవిష్కరించే రివర్స్ పెయింటింగ్‌పై పట్టు సాధించారు.
మనసుకు ఏమనిపిస్తే చిత్రకళ ద్వారా ఆవిష్కరించే సయీదా.. సంక్రాంతి పండగలో కీలకమైన గంగిరెద్దుల చిత్రాలతో ఓ సిరీస్‌నే రూపొందించారు. బసవన్నల రాజసాన్ని, వాటి విన్యాసాలను కళ్లకు కట్టినట్లు దించేశారు. ఆంధ్రా వర్సిటీ ఫైనాన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సయీదా హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. వివాహ అనంతరం కుటుంబానికి సమయం వెచ్చిస్తూనే తనకు ఇష్టమైన చిత్ర కళను వదులుకోలేదు. కెనడా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేసియా, సింగపూర్ ఇలా ఎక్కడ నివాసముంటే అక్కడే తన రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తనలోని లోపం తనకెప్పుడూ అడ్డంకి కాలేదంటున్నారు సయీదా. కేజీ సుబ్రమణ్యన్, కె.లక్షణ గౌడ వంటి ప్రముఖ చిత్రకారుల ప్రశంసలే తనకు అవార్డులని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...
పట్టుదలే పెట్టుబడిగా.. వైకల్యాన్ని అధిగమిస్తూ..
నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌లో..