
తాజా వార్తలు
వివాహితను ఏమార్చి.. కోపంలో హతమార్చి..
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): వనమూలికలతో వైద్యం పేరిట మాయమాటలు చెప్పడంతో ఆ మహిళ తన భర్త, పిల్లలను వదిలేసి వచ్చేసింది. వీరిద్దరు వేరే కాపురం పెట్టారు. గొడవలు జరగడంతో తాగిన మత్తులో ఆమెను కొట్టి చంపేశాడు. రెండు రోజులు మృతదేహంతో ఉండి తర్వాత పారిపోయాడు. ఈనెల 3న కేపీహెచ్‌బీ ఠాణా పరిధి ఎస్ఎస్ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సీఐ లక్ష్మీనారాయణతో కలిసి ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతోని చిలక గ్రామానికి చెందిన కుంపటి వెంకటనారాయణ (38) అలియాస్ వెంకటేశ్వర్లు ఏడోతరగతి వరకు చదువుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యను వదిలేశాడు.
ఆయుర్వేద వైద్యం నేర్చుకుని ఊళ్లు తిరుగుతూ ఔషధాలు విక్రయించేవాడు. ఒకరోజు బస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన స్రవంతి (30) పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో వెంకటనారాయణ మాటలకు ఆకర్షితురాలైన స్రవంతి భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి అతనితో వెళ్లిపోయింది. కొద్ది కాలం పెద్దపల్లి ఉన్నారు. 2020 జనవరిలో నగరానికి వచ్చి అమీర్‌పేటలో ఉంటూ ఔషధాలు విక్రయించారు. అనంతరం ఎస్ఎస్ కాలనీలో మరో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈనెల 3న వెంకటనారాయణ మద్యం మత్తులో ఇంటికి రావడంతో ‘రోజూ తాగొస్తున్నావ’ని స్రవంతి నిలదీసింది. దీంతో వెంకటనారాయణ ఆమెను రోకలిబండతో బాదడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ రాత్రంతా అతను శవంతో ఇంట్లోనే ఉన్నాడు. 4న ఇంటి అద్దె చెల్లించి ఆరోజూ ఇంట్లోనే ఉన్నాడు. 5న తెల్లవారుజామున మృతదేహాన్ని భవనం ప్రహరీ పక్కన పడేసి దుప్పటి కప్పి గతంలో ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఇంట్లో మూడో అంతస్తులోకి చేరాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా సోమవారం ఉదయం వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. స్రవంతి వివరాల ఆధారంగా ఆమె భర్తను పిలిపించి మృతదేహాన్ని అప్పగించారు.
ఈ కేసును త్వరగా ఛేదించిన ఎస్సైలు సక్రం, నర్సింలు, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ నరేశ్‌గౌడ్, హోంగార్డు దామోదర్‌రెడ్డికి రివార్డులను ఏసీపీ అందజేశారు.
ఇవీ చదవండి...
కిడ్నాప్ కేసులో మరో ముగ్గురి అరెస్టు
సంక్రాంతికి ఊరికెళ్తున్నారా.. జర భద్రం