close
రైతుకు భరోసా

అన్నదాత అప్పు చేసే పరిస్థితి రాకూడదు.. అదే మా లక్ష్యం
అందుకే పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్తు, సాగునీరు ఇస్తున్నాం
ఎవరు ఏమనుకున్నా సరే.. మేం రైతు పక్షపాతిగానే ఉంటాం
వారసత్వ సంపద అనేది కొందరికి జోక్‌లా మారింది
వారసత్వ కట్టడాల చట్టంలో అప్రాధాన్యాంశాలు తొలగిస్తాం
ఎవరైనా వచ్చి పార్టీని విలీనం చేస్తామంటే ఎవరొద్దంటారు!
శాసనసభలో బిల్లులపై చర్చలº ముఖ్యమంత్రి కేసీఆర్‌
25 రోజుల్లో ‘పుర ’ఎన్నికలు పూర్తి చేస్తామని వెల్లడి
త్వరలºనే పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతామని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి రైతు వద్ద కనీసం రూ.నాలుగైదు లక్షల ధనం నిల్వ ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతులు అప్పులు చేసే పరిస్థితి నుంచి బయటపడాలనే పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్తు, సాగునీరు ఇస్తున్నామన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాము రైతు పక్షపాతిగానే వ్యవహరిస్తామన్నారు. రెవెన్యూ చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. శాసనసభలో గురువారం నాలుగు బిల్లులపై చర్చ జరిగింది. ఇప్పటికే ఆర్డినెన్స్‌ జారీ చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

‘‘ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటుతో సహా ప్రభుత్వ శాఖల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సంస్కరణలు చేపట్టాం. పట్టణాల శివారుల్లో అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. భూ మాఫియా దుర్మార్గమైన కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే శివారు గ్రామాలను పురపాలికల్లో కలిపేసి 68 పురపాలికలను 142కు పెంచాం. గతంలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారానే ఏపనైనా చేసేవారు. నేడు చట్ట సభల్లో చర్చ అనంతరమే వార్డులైనా, పంచాయతీల ఏర్పాటైనా చేయాలని నిర్ణయించాం. మాటిమాటికి కోర్టుల ‘స్టే’ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. రాష్ట్రంలో వరుస ఎన్నికలతో కోడ్‌ అమల్లో ఉంటూ వచ్చింది.  ఇరవైఐదు రోజుల్లో పురపాలక ఎన్నికలు పూర్తవుతాయి. ఇక ఎన్నికల కోడ్‌ నుంచి పూర్తిగా బయటపడతాం. ఆ తరువాత నాలుగున్నరేళ్లు పరిపాలనకు ఏ అడ్డంకులూ ఉండవు’’ అని కేసీఆర్‌ వివరించారు. సభలో కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌, భాజపా సభ్యుడు రాజాసింగ్‌ తదితరులు లేవనెత్తిన సందేహాలకు కేసీఆర్‌ సందర్భానుసారం సమాధానాలు ఇచ్చారు. భట్టి విక్రమార్క ఆక్రోశంతో మాట్లాడుతున్నారని అన్నారు.

వైద్య విద్య సీట్లు నష్టపోవద్దనే
వైద్య కళాశాలల్లో సీట్లు కాపాడుకోవడానికి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆచార్యుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65కు పెంచుతున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. ‘‘అనేక రాష్ట్రాల్లో పెంపు అమల్లో ఉంది. దీనివల్ల ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీకాకుండా ఉంటాయి. వైద్య విద్యకు ఎంతో మేలు చేకూరుతుంది. రాష్ట్రంలో మరో నాలుగు కొత్త వైద్య కళాశాలలు కావాలన్న డిమాండ్‌ ఉంది. విరమణ వయసు పెంచడం వల్ల కొత్తగా ఉద్యోగాల ఎంపిక, జూనియర్లకు పదోన్నతుల్లో ఎలాంటి నష్టం వాటిల్లదు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల సమస్యల పరిష్కారానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాటి యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ వారసత్వ సంపద అనేది కొందరికి జోక్‌లా మారింది. అధునాతన సమాజం ఆలోచనలు అమలు చేయాలంటే ఏది ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ వారసత్వ సంపదను గౌరవించేందుకు వారసత్వ కట్టడాల పరిరక్షణ చట్టాన్ని చేశాం. ఈ చట్టంలో అప్రాధాన్యమైన అంశాలపై చర్చించి వాటిని తొలగిస్తాం.

పీడించే వడ్డీ వ్యాపారుల కట్టడికి కమిషన్‌
సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చేతి వృత్తుల వారిని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవసాయ రంగంలో నిష్ణాతుణ్ని నియమించుకుందాం. కేంద్ర చట్టంలో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలని పేర్కొంటూనే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని చట్టానికి సవరణలు చేసి పేద వర్గాలకు అండగా నిలిచి న్యాయం చేసే సమర్థుడైన నిపుణుడిని ఛైర్మన్‌గా ఏర్పాటు చేసుకుందాం.

తెలంగాణకు ఎత్తిపోతలే ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో కృష్ణా, గోదావరులే నీటికి ఆధారం. కృష్ణా జలాలను మరో వంద టీఎంసీలు నిల్వ చేసుకునేందుకు కర్ణాటకకు అనుమతులు వచ్చాయి. ఇక మిగిలింది గోదావరి ఒక్కటే. అందుకే 90 మీటర్ల స్థాయి నుంచి నీటిని పైకి ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. నీళ్లు లేకపోతే జీవనం ఉండదు. గల్ఫ్‌ దేశాల్లో మంచినీళ్లు దొరకక ఎక్కువ వ్యయమైనా సముద్రం నీటిని శుద్ధి చేసుకుంటున్నారు. చెన్నైలో తాగునీటి సమస్యను మనం చూస్తేనే ఉన్నాం. తెలంగాణకు ఎత్తిపోతలే ప్రత్యామ్నాయం. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌లలో నీళ్లు లేక నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో తాగునీటికి సమస్య ఏర్పడింది. కాళేశ్వరం పథకానికి విద్యుత్తు బిల్లు రూ.15 వేల కోట్లు అయినా ప్రభుత్వమే భరిస్తుంది’’ అని సీఎం చెప్పారు.

ఆమోదం పొందిన బిల్లులు ఇవే..

* తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం సవరణ బిల్లు (వైద్య కళాశాలల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు)
* తెలంగాణ పురపాలక చట్టం సవరణ బిల్లు (పుర, నగర పాలక సంస్థల్లో వార్డుల సంఖ్య ఖరారు)
* తెలంగాణ రుణ విముక్తి కమిషన్‌ సవరణ బిల్లు (కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత హైకోర్టు జడ్జి స్థానంలో నిపుణుడి నియామకం)
* పంచాయతీరాజ్‌ సవరణ చట్టం బిల్లు (జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక)

కాంగ్రెస్‌లో నాయకత్వ పటిమ లోపించింది

రాజ్యాంగంలోని షెడ్యూల్‌-10 ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వచ్చి చేరారు. కాంగ్రెస్‌లో నాయకత్వ పటిమ ఉంటే వారిని ఎందుకు వదులుకుంటారు? వారి సభ్యులను వారు నియంత్రించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా రాజ్యసభ సభ్యులు, గోవాలో కాంగ్రెస్‌ సభ్యులు భాజపాలో విలీనం కాలేదా? తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మాకు 3/4 వంతు ఆధిక్యం లభించింది. అప్పుడే కొందరు కాంగ్రెస్‌ సభ్యులు వస్తామంటే నేనే ఎందుకు అన్నాను. ఇప్పటికీ మేం ఎవరినీ చేర్చుకోలేదు. వారంతట వారే వచ్చి విలీనం చేసుకోమన్నారు. ఏ పార్టీ వారైనా వచ్చి తమను విలీనం చేసుకోమంటే ఎవరు మాత్రం చేసుకోరు?
- సీఎం కేసీఆర్‌

ఈవీఎంల గోల్‌మాల్‌ అంటూ గీపెట్టారు

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పింది. ఎన్నికలకు ముందు సభలో గవర్నర్‌పై దాడి చేశారు. సస్పెండ్‌ అయ్యారు. సమావేశాలు బహిష్కరించారు. అయినా ఎన్నికల్లో మాకు శాసనసభలో 3/4 వంతు ఆధిక్యం లభించింది. దీంతో ఈవీఎంల గోల్‌మాల్‌ అంటూ గీపెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 83 శాతం పంచాయతీలను, ఎంపీపీలలో 95 శాతం, 32 జిల్లా పరిషత్‌ స్థానాల్లో తెరాస విజయం సాధించింది. ఇంకా ఈ ఆరోపణలు ఏంటి?

- సభలో కేసీఆర్‌

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.