Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 177087
      [news_title_telugu_html] => 

హైడ్రామా.. అరెస్ట్‌

[news_title_telugu] => హైడ్రామా.. అరెస్ట్‌ [news_title_english] => [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తిని మంగళవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మొదలైన హైడ్రామా ఎన్నో మలుపులు తిరిగింది. హైకోర్టు తీర్పుపై స్టే కోసం వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐకి స్వేచ్ఛ లభించింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/wY3WpYLS19g [news_videoinfo] => |https://www.youtube.com/embed/wY3WpYLS19g [news_sections] => ,27,26, ) )
హైడ్రామా.. అరెస్ట్‌ - EENADU
close
హైడ్రామా.. అరెస్ట్‌

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో

ఊపిరి సలపని ఉత్కంఠ..
 అరెస్టుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో చిదంబరానికి లభించని ఊరట
 24 గంటల పాటు ఆచూకీ చిక్కని నేత
 రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ
 విదేశాలకు పారిపోకుండా  లుకౌట్‌ నోటీసు జారీ
 రాత్రి ఏఐసీసీ కార్యాలయంలో   ప్రత్యక్షమైన కేంద్ర మాజీ మంత్రి
 కేసుపై ప్రకటన.. ఆ తర్వాత ఇంటికి
అధికారుల్ని ఇంట్లోకి రానివ్వని వైనం
 గోడదూకి వెళ్లిన దర్యాప్తు అధికారులు
 ఎట్టకేలకు చిదంబరం అరెస్టు
ఈనాడు - దిల్లీ

నేను, నా కుటుంబం ఏ తప్పూ చేయలేదు.తప్పించుకున్నానన్నది దుష్ప్రచారం.రాత్రంతా న్యాయవాదులతో ఉన్నా.నాపై ఎఫ్‌ఐఆర్‌, ఛార్జిషీటులు కూడా లేవు.

- చిదంబరం

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే చిదంబరాన్ని పిరికిపందలు వెంటాడుతున్నారు.

- ప్రియాంకగాంధీ

  రాజకీయ దురుద్దేశంతోనే నా తండ్రిని సీబీఐ అరెస్టు చేసింది. ఇది కక్షసాధింపు చర్య.

- కార్తీ చిదంబరం

కక్ష సాధింపు చర్యలేం లేవు. దర్యాప్తులో కేంద్ర జోక్యం లేదు. తాను చేసిన పనులకు పర్యవసానాలను చిదంబరం అనుభవిస్తున్నారు.

- భాజపా

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన చేసుకున్న విజ్ఞప్తిని మంగళవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మొదలైన హైడ్రామా ఎన్నో మలుపులు తిరిగింది. హైకోర్టు తీర్పుపై స్టే కోసం వేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐకి స్వేచ్ఛ లభించింది.
మంగళవారం సాయంత్రం నుంచి అదృశ్యమైన చిదంబరం కోసం సీబీఐ, ఈడీ బృందాలు గాలిస్తుండగా.. అనూహ్యంగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమై, విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం చిదంబరం జోర్‌బాగ్‌లోని తన నివాసానికి వెళ్లారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, న్యాయవాదులు అయిన కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ కూడా ఉన్నారు. కొద్ది నిమిషాలకు 30 మందితో కూడిన సీబీఐ బృందం అక్కడికి వచ్చింది. చిదంబరం ఉండే బంగ్లా తలుపును తట్టింది. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో ముగ్గురు అధికారులు 5 అడుగుల ప్రహరీ గోడను ఎక్కి దూకి, ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులను తెరిచి, మిగతా సీబీఐ బృందాన్ని లోపలికి అనుమతించారు.
కొద్దిసేపటికి ఈడీ అధికారులూ అక్కడికి  చేరుకున్నారు. సీబీఐ అధికారులు బంగ్లా వెనుక ద్వారం వద్దకు వెళ్లారు. వెలుపలికి వెళ్లే అన్ని మార్గాల వద్ద సిబ్బందిని మోహరించారు. అరెస్టుకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశాక చిదంబరాన్ని అదుపులోకి తీసుకొని కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో అక్కడ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ కారు మీదకు దూకి, అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అక్కడున్న దిల్లీ పోలీసులు వారిని పక్కకు లాగేశారు. కోర్టు వారెంటు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. చిదంబరం రాత్రి మొత్తం సీబీఐ అతిథి గృహంలోనే ఉంటారని అధికార వర్గాలు చెప్పాయి. ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన రిమాండ్‌కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది.

పార్టీ నేతల సంఘీభావం
అంతకుముందు దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని చిదంబరం వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చిదంబరానికి కాంగ్రెస్‌ నేతలు సంఘీభావం తెలిపారు. ‘వ్యక్తిత్వ హనన రాజకీయాల’కు ప్రభుత్వం పాల్పడుతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇందుకోసం సీబీఐ, ఈడీ, మీడియాలో ఒక వర్గాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామన్న ఆరోపణలను భాజపా ఖండించింది. దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకోవడంలేదని పేర్కొంది. తాను చేసిన పనులకు పర్యవసానాలను చిదంబరం ఎదుర్కోవాలని స్పష్టంచేసింది.
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో చిదంబరం తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తక్షణం దీనిపై విచారణ చేపట్టాలన్న వీరి వినతిని కోర్టు ఒప్పుకోలేదు. బుధవారం సంబంధిత ధర్మాసనం ఎదుట దీన్ని ప్రస్తావించాలని సూచించింది. ఆ వెంటనే సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలంటూ ఒక నోటీసును అక్కడ అతికించారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు బుధవారం సీబీఐ, ఈడీలు ఆయనపై ‘లుకౌట్‌ సర్క్యులర్‌’ను జారీ చేశాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులను అప్రమత్తం చేశాయి. సీబీఐ బృందం బుధవారం మరోసారి ఆయన నివాసానికి వెళ్లింది. ఆయన ఆచూకీ లేకపోవడంతో వెనుదిరిగింది.

సుప్రీంలో దక్కని ఊరట..
మరోవైపు చిదంబరం తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది కపిల్‌ సిబల్‌ బుధవారం కూడా సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేశారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎం.శంతనుగౌడర్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఎదుట ఆయన కేసును ప్రస్తావించారు. దీనిపై తక్షణ విచారణ చేపట్టడానికి అనుమతివ్వాలంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయికి ఈ పిటిషన్‌ను నివేదించింది. అయితే ఆ తర్వాత తక్షణ లిస్టింగ్‌పై ఎలాంటి సమాచారం అందకపోవడంతో భోజన విరామం అనంతరం సిబల్‌ మరోసారి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఎదుట దీన్ని ప్రస్తావించారు. చిదంబరం పారిపోతారన్నట్లు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఆయన వెంటపడుతున్నాయని సిబల్‌, ఇతర సీనియర్‌ న్యాయవాదులు సల్మాన్‌ ఖుర్షీద్‌, వివేక్‌ తంఖా, ఇందిరా జైసింగ్‌ తదితరులు అభ్యంతరం తెలిపారు. పిటిషన్‌లో కొన్ని లోపాలున్నాయని, వాటి గురించి రిజిస్ట్రీ తమకు తెలియజేసిందని ధర్మాసనం బదులిచ్చింది. లోపాలను సరిదిద్దామని సిబల్‌ చెప్పారు. దీంతో ధర్మాసనం రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) సూర్యప్రతాప్‌ సింగ్‌ను పిలిపించి, దీనిపై ఆరా తీసింది. పిటిషన్‌లోని లోపాలను ‘ఇంత క్రితమే’ సరిదిద్దారని, దాన్ని ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపామని ఆయన తెలిపారు. దీనికి సిబల్‌ స్పందిస్తూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారని, సాయంత్రం 4 గంటల లోపు ఆయన వెలుపలికి వచ్చే అవకాశం లేదని చెప్పారు. తక్షణం తమ పిటిషన్‌ను విచారించాలని పదేపదే కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తాము ఇప్పటికే సూచించినట్లు ధర్మాసనం సమాధానమిచ్చింది.
గతంలో మౌఖిక ప్రస్తావన ఆధారంగా అరెస్టుల నుంచి కోర్టు రక్షణ కల్పించిందని సిబల్‌ చెప్పారు. ‘‘పిటిషన్‌లో లోపాలను ఇంతక్రితమే సరిచేశారు. దాన్ని బుధవారం నాడే లిస్టింగ్‌ చేయడం కుదరదు. లిస్టింగ్‌ లేకుండా పిటిషన్‌పై విచారణ చేపట్టడం సాధ్యం కాదు’’ అని ధర్మాసనం తెలిపింది. పరారు కాబోనని హామీ ఇచ్చేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారని సిబల్‌ చెప్పారు. దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా, స్వల్ప విచారణను ముగించింది.
అనంతరం చిదంబరం పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నిర్ణయించినట్లు సిబల్‌కు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ తెలియజేశారు.

ఈడీ దర్యాప్తు ముమ్మరం
మరోవైపు చిదంబరంపై నగదు అక్రమ చలామణీ కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేయాలని ఈడీ నిర్ణయించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాతోపాటు ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కాకుండా మరో నాలుగు వ్యాపార లావాదేవీలకు అక్రమంగా విదేశీ పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతులు మంజూరు చేయడంలో ఆయన పాత్ర ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఇందుకు ప్రతిగా అనేక డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మేర ముడుపులు అందినట్లు ఆరోపిస్తోంది. అక్రమంగా ఎఫ్‌ఐపీబీ అనుమతులకు బదులు చిదంబరం, ఆయన కుమారుడు కార్తి ముడుపులు అందుకున్న తర్వాత ఒకే డొల్ల కంపెనీలో రూ.300 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లను చేసినట్లు ఆధారాలు లభించాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అందువల్ల సంక్లిష్టమైన ఈ లావాదేవీలు, ముడుపుల వ్యవహారాలపై తండ్రి, కుమారుడిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని తాము కోరుతున్నట్లు తెలిపాయి.


సీన్‌ రివర్స్‌..!
  చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్‌ షా అరెస్టు

దిల్లీ: 2010లో కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం యూపీఏ సర్కారులో కేంద్ర హోంమంత్రిగా ఉండేవారు. అప్పట్లో అమిత్‌ షా గుజరాత్‌ హోంమంత్రి. ఆయన హయాంలోనే (2005లో) రాష్ట్ర పోలీసులు సోహ్రాబుద్దీన్‌ షేక్‌ అనే నేరస్థుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో సోహ్రాబుద్దీన్‌ మృతిచెందడం అమిత్‌షా మెడకు చుట్టుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అపహరణ, హత్య ఆరోపణల కింద సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడు... అమిత్‌ షా కేంద్ర హోంమంత్రి. ఈ సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.