close
పుర పోరుకు తొలగిన అడ్డంకి

 పిటిషన్‌లన్నీ కొట్టివేత
 ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కష్టసాధ్యమేమీ కాదు
 ఓటరు జాబితా ఖరారుకు తగినంత గడువుంది
 ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం
 తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల కోసం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికలు జరపడానికి దాదాపుగా అడ్డంకులు తొలగినట్లే. మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియను కుదించడంతో పాటు, ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్‌ జారీ చేయడం, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికల ముందస్తు ప్రక్రియకు సంబంధించి సింగిల్‌ జడ్జి దశల వారీగా పేర్కొన్న సమయం గరిష్ఠమేనని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు సంబంధించి ఆధారాల్లేకుండా చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చింది.

వార్డుల విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 459, ఓటర్ల జాబితా రూపొందించడానికి సంబంధించి జులై 3న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ నిర్మల్‌ జిల్లాకు చెందిన కె.అంజుకుమార్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం విదితమే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో గరిష్ఠంగా గడువును పేర్కొన్నారని, కనీస గడువును పేర్కొనలేదంది. మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 11 ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సిద్ధం చేసిన ఓటర్ల జాబితా అందుబాటులో ఉండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాల ఓటర్ల గుర్తింపు ప్రక్రియ సులభమేననని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సులభంగా గుర్తించవచ్చని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను తప్పుగా గుర్తించినట్లుగానీ, అసలు గుర్తించలేదనడానికి ఒక్క ఆధారాన్ని కూడా పిటిషనర్లు కోర్టు ముందుంచలేదంది.

ఓటర్ల జాబితా ఇంకా సిద్ధం కాలేదు
అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, ఎన్నికల సంఘం సీనియర్‌ న్యాయవాది వాదనల ప్రకారం జులై 3న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఇప్పటివరకూ అమలు కాలేదంది. చట్టప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసిన జాబితా ఆధారంగానే మున్సిపల్‌ ఎన్నికలకు ఓటర్ల జాబితాను రూపొందించవచ్చంది. ఈసీ ఎన్నికల తేదీలను విడుదల చేసేదాకా దీన్ని సవరించవచ్చంది. అందువల్ల జులై 3న జారీ చేసిన నోటిఫికేషన్‌ను తప్పుగా పేర్కొనడం అసంబద్ధమంది. రాజ్యాంగంలోని అధికరణ 243-జడ్‌జి ప్రకారం నియోజకవర్గాల, మున్సిపాలిటీల వార్డుల విభజన ప్రక్రియను ఏ కోర్టూ ప్రశ్నించడానికి వీల్లేదన్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనతో ఏకీభవించింది. వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 459 ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, దీన్ని కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదంటూ అనుగ్రాహ్‌ నరైన్‌సింగ్‌ వర్సెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్న వాదనను సమర్థించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన గరిష్ఠ గడువును పేర్కొన్నారని, అంతకంటే తక్కువ సమయంలో ఎన్నికలను నిర్వహించవద్దని ఎక్కడా చెప్పలేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ పిటిషన్‌లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టేలను తొలగించాలన్న ఏఏజీ అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది.

ఎన్నికల నిర్వహణకు స్పష్టత!
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు స్పష్టత వచ్చినట్టేనని అధికారులు భావిస్తున్నారు. మరో 70 పురపాలక సంఘాలకు సంబంధించి పలు అంశాలపై దిగువ కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవన్నీ వీగిపోయే అవకాశాలున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ కోర్టుల్లో వ్యాజ్యాలు కొలిక్కి రాకపోతే స్పష్టత వచ్చిన సంఘాలకైనా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.

121 పురపాలికలు.. పది కార్పొరేషన్లు
రాష్ట్రంలోని 128 పురపాలక సంఘాల్లో 121 సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల క్రితమే పురపాలకశాఖ ఏర్పాట్లు చేసింది. మిగిలిన 7 పురపాలికలలో అచ్చంపేట, సిద్దిపేట పాలకవర్గాలకు గడువు ఉంది. మణుగూరు, మందమర్రి, పాల్వంచలకు ఏజెన్సీ చట్టానికి సంబంధించిన అంశంలో స్పష్టత రాకపోవడంతో ఎన్నికలు ఉండకపోవచ్చు. కొత్తగా ఏర్పాటైన 73 పురపాలికలకూ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లతో పాటు పాతవాటికి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ నగర పాలకసంస్థతో పాటు ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాలకు గడువు ఉంది. రామగుండం, కరీంనగర్‌, నిజామాబాద్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, బడంగ్‌పేట, నిజాంపేట, బండ్లగూడ, మీర్‌పేట, జవహర్‌నగర్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.