close
కాళేశ్వరం కట్టారు.. కాలుష్యం పనిపట్టలేరా!

లేనిదల్లా సంకల్ప బలమే
హైదరాబాద్‌లోని చెరువులన్నీ దుర్గంధమయమే
ఒక్క చుక్క నీరు తాగే పరిస్థితి లేదు
మూసీ శుభ్రతపై కార్యాచరణ ప్రణాళికను సమర్పించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
‘ఈనాడు’ కథనం, మరో పిటిషన్‌పై విచారణ
ఈనాడు - హైదరాబాద్‌

కాళేశ్వరం వంటి అద్భుత నిర్మాణం చేసిన ప్రభుత్వానికి మూసీ నదిలో కాలుష్యాన్ని తొలగించడం ఓ లెక్క కాదని.. లేనిదల్లా సంకల్ప బలమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో అవరోధాలను అధిగమించి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించిన మీరు.. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న మూసీని ఎందుకు శుభ్రం చేయలేరని ప్రశ్నించింది. ఒక్క మూసీనేకాదని.. హుస్సేన్‌సాగర్‌తో సహా హైదరాబాద్‌లోని చెరువులన్నీ దుర్గంధమయమేనని, ఏ ఒక్క చెరువులోనూ చుక్క నీరు తాగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేసింది. మూసీ శుభ్రతపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

మూసీ కాలుష్య ప్రభావం 66 గ్రామాలపై ఉందంటూ గత నెల 18న ‘మూసీ.. బతుకు మసి’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌తోపాటు మూసీలో నిర్మాణాలకు అనుమతిస్తున్నారని, నీటి ప్రవాహం సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడి రామనాథ కరుణాకర్‌ అనే వ్యక్తి గతేడాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఈనాడు’ కథనం ఆధారంగా తీసుకున్న సుమోటో వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి తరఫున సభ్యకార్యదర్శి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరిల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. మూసీని శుభ్రపరచే అంశంపై ఏం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రోజూ దాన్ని విషతుల్యం చేస్తున్నారని, అంతేగానీ శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టడంలేదంది. ఇతర రాష్ట్రాలు, నగరాలను పరిశీలించాలని.. జైపూర్‌లో ఒక నది కలుషితమైతే సాధారణ స్థితికి తీసుకొచ్చారని ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌లో 8 చెరువుల్లో కాలుష్యాన్ని తొలగించి సాధారణ స్థితికి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. వారు చేయగలిగినది మనమెందుకు చేయలేమని, ఇలా చేయడానికి  ఏది అడ్డుగా ఉంటుందో చెప్పాలని ప్రశ్నించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ.. మూసీకి సంబంధించి పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నింటిలో స్టేలు, మరికొన్నింటిలో యథాతథస్థితిని కొనసాగించాలన్న మధ్యంతర ఉత్తర్వులున్నాయన్నారు. అందువల్ల తామేం చేయలేకపోతున్నామనగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇవన్నీ కుంటిసాకులు మాత్రమేనని వ్యాఖ్యానించింది. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాల్లో నది ఉందని, అక్కడ ఎందుకు చేయడంలేదని అడిగింది. మూడు నెలల్లోగా 5 కిలోమీటర్ల పరిధిలో మూసీని శుభ్రం చేస్తామంటూ నది అభివృద్ధి మండలి ఛైర్మన్‌ హామీ ఇచ్చారని.. ఆయన హామీ నెరవేరుస్తారని తాము ఎదురుచూస్తూనే ఉన్నామంది. హైకోర్టు ఎదురుగా ఉన్న మూసీకి సంబంధించి ఎలాంటి కేసులు లేవని.. మరి ఇక్కడెందుకు శుభ్రం చేయడంలేదని అడిగింది. రోజూ మీతోపాటు మేము కూడా కలుషిత నది ప్రభావాన్ని ఎదుర్కొంటున్నామని.. దాని నుంచి ఉత్పత్తయ్యే దోమలు కుట్టి ఏం వ్యాధులు వస్తాయో దేవుడికే తెలియాలంది. ఇది ఒక ప్రభుత్వం చేయలేని పని అనుకోవడంలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నో అవరోధాలను అధిగమించి కాళేశ్వరం నిర్మించిన ప్రభుత్వానికి ఇది కష్టమని చెప్పడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఆ ప్రాజెక్టును తాము స్వయంగా వీక్షించామని పేర్కొంది.

దేవుడంటే స్వచ్ఛత.. కాలుష్యం కాదు

మూసీతోపాటు చెరువుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హుస్సేన్‌సాగర్‌ అందంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల కుళ్లిపోయి విషవాయువులను వెదజల్లుతోందని పేర్కొంది. ఇందుకు ఒకరిని నిందించి ప్రయోజనంలేదని.. అందరమూ బాధ్యులమేనంది. ఇందులో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని.. మతపరమైన అంశాలు వేరని పేర్కొంది. దేవుడంటే స్వచ్ఛత అని.. కాలుష్యం కాదని వ్యాఖ్యానించింది. మూసీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను కలిపి విచారణ చేపడతామని, వాటి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి సూచించింది. మూసీ శుభ్రతపై నాలుగు వారాల్లో  కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.