close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంచుకొండల్లో నెత్తుటేర్లు

 తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దొంగ దెబ్బ
 భారత గస్తీ బృందంపై ఆకస్మిక దాడి
మన సైనికులు 20 మంది వీరమరణం
పోరాడి అసువులు బాసిన తెలుగు తేజం సంతోష్‌బాబు
43 మంది చైనా సైనికులూ హతం?
  45 ఏళ్ల తర్వాత రెండు దేశాల మధ్య భారీ ఘర్షణ
  హద్దులు మార్చేందుకే పొరుగు దేశం కుట్ర: భారత్‌
  ఉన్నతస్థాయిలో సమీక్షించిన కేంద్రం
  సరిహద్దుల్లో బలగాలను పెంచాలని నిర్ణయం

చైనా ‘హద్దు’ మీరింది. మంచుకొండల్లో భారత్‌పై విషం చిమ్మింది. నాలుగున్నర దశాబ్దాల ‘ప్రశాంతత’ను భగ్నం చేస్తూ తూర్పు లద్దాఖ్‌లో ఘోరానికి తెగబడింది. 20 మంది భారత సైనికుల్ని పొట్టనబెట్టుకుంది. మరో 10 మంది సైనికుల ఆచూకీ అంతుచిక్కలేదని అధికార వర్గాల కథనం. ఇంకా అనేక మంది గాయపడినట్లు సమాచారం.

దిల్లీ: సరిహద్దులో నెలన్నరగా గిల్లికజ్జాలకు దిగుతున్న డ్రాగన్‌ సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ దొంగదెబ్బ తీసింది. ఇరు వైపులా సైనికుల ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగినట్లు అనధికార సమాచారం. చైనా చాన్నాళ్లుగా ‘అదిగో సైనిక ఉపసంహరణ’.. ‘ఇదిగో శాంతి’ అంటూ వల్లెవేస్తూ.. తాజాగా అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంది. సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై చైనా సైనికులు ఒక ప్రణాళిక ప్రకారం ఆకస్మికంగా విరుచుకుపడ్డారు. రాళ్లు, ఇనుపకడ్డీలు, కర్రలతో పేట్రేగిపోయారు. ఫలితంగా హిమప్రాంతం నెత్తురోడింది. గాల్వాన్‌ లోయలో జరిగిన ఈ దుశ్చర్యను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొన్నారు. తెలుగు యోధుడు కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు(39) వీరోచితంగా ఎదురొడ్డారు. సముద్రమట్టానికి 14వేల అడుగులు ఎత్తులో.. శీతల వాతావరణంలో చైనా సైనికుల ఆగడాలను అడ్డుకుంటూ సింహంలా పోరాడి వీర మరణం పొందారు. ఈ ఘటనలో సంతోష్‌ సహా 20 మంది సైనికులు చనిపోయారు. తొలుత ముగ్గురు సైనికులే మరణించారని సైన్యం ప్రకటించింది. తరువాత మరో ప్రకటన విడుదల చేసింది. ఘర్షణలో తీవ్రంగా గాయపడి, అక్కడి శీతల వాతావరణ వల్ల మరో 17 మంది సైనికులు కూడా చనిపోయారని తెలిపింది. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కిమళ్లాయని  పేర్కొంది.


సంతోష్‌ది సూర్యాపేట జిల్లా

ఈ ఘర్షణలో చనిపోయిన భారత సైనికాధికారి కర్నల్‌ సంతోష్‌ స్వస్థలం.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా.  ‘16 బిహార్‌’ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేస్తున్నారు. చనిపోయిన వారిలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన పళని (40) కూడా ఉన్నారు. 1975 తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో మన దేశ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి. నాడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తులుంగ్‌ లా వద్ద చైనా సైనికులు మాటువేసి, జరిపిన దాడిలో భారత్‌కు చెందిన నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
సంబంధిత వర్గాల కథనం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత భూభాగంలోనే మన సైనికులు గస్తీ నిర్వహిస్తున్నారు. చైనా బలగాలు హద్దు మీరకుండా చూస్తున్నారు. ఇంతలో.. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు కర్రలు, కడ్డీలు, రాళ్లతో మన గస్తీ బృందంపై దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన మన సైనికులు వెంటనే తేరుకొని దీటుగా ప్రతిఘటించారు. ఇరు పక్షాల మధ్య కొన్ని గంటల పాటు ఈ పోరు సాగింది. ఈ ఘర్షణలో తుపాకులను పేల్చలేదు.


రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు

తాజా ఉద్రిక్తతలను చల్లార్చడానికి రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మేజర్‌ జనరల్‌ అధికారుల స్థాయిలో ఘటనా స్థలంలో చర్చలు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘గాల్వాన్‌ లోయలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సోమవారం రాత్రి ఈ హింసాత్మక ఘటన జరిగింది. పరిస్థితిని శాంతింపచేయడానికి రెండు దేశాల సీనియర్‌ మిలటరీ అధికారులు ఘటనా స్థలంలో సమావేశమయ్యారు’’ అని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి లువో ఝావోహుయితో మంగళవారం బీజింగ్‌లో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాల్వాన్‌ పరిణామంపై చైనా తన నిరసనను తెలియజేసింది.


సమాలోచనలు..

గాల్వాన్‌ ఘటనపై మంగళవారం రాజధాని దిల్లీలో రక్షణ  శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితినీ తెలియజేశారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. అంతకుముందు రాజ్‌నాథ్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. తూర్పు లద్దాఖ్‌ ఘటన నేపథ్యంలో సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె తన పఠాన్‌కోట్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి.. మరోసారి జయ్‌శంకర్‌తోను, బిపిన్‌ రావత్‌, నరవణెలతో సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సు, గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీల్లో భారత సైనిక బలగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత   వర్గాలు తెలిపాయి.


వివాదమిదీ..

భారత్‌-చైనా మధ్య దాదాపు 3500 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఎల్‌ఏసీపై ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. 1962లో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. అప్పటి నుంచి వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే సరిహద్దు సమస్య పరిష్కారమయ్యేవరకూ అక్కడ శాంతిని నెలకొల్పాలని రెండు దేశాలు నిర్ణయించాయి. దీంతో కొన్ని దశాబ్దాలుగా అక్కడ తూటాలు పేలలేదు. కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా భారీగా మౌలిక వసతులను, సైనిక శిబిరాలను, రైలు మార్గాలను నిర్మించుకుంటోంది. తొలుత స్తబ్దుగా ఉన్న భారత్‌.. ఆ తర్వాత డ్రాగన్‌కు దీటుగా సరిహద్దుల్లో మౌలిక వసతులను నిర్మించుకోవడం మొదలుపెట్టింది. ఇది చైనాకు కంటగింపుగా ఉంది. ఇటీవల పాంగాంగ్‌ సరస్సులోని ‘ఫింగర్‌ ప్రాంతాల’ వద్ద కీలక రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్‌ లోయలో దార్బుక్‌-ష్యోక్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీలను సంధానిస్తూ మరో రోడ్డును వేస్తోంది. వీటిపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. అయినా ఈ  ప్రాజెక్టులు ఆపరాదని భారత్‌ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో గత నెల 5, 6 తేదీల్లో పాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో రెండు పక్షాలకు చెందిన 100 మందికిపైగా గాయపడ్డారు. మే 9న ఉత్తర సిక్కిమ్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. అనంతరం ఎల్‌ఏసీ వెంబడి చైనా భారీగా అదనపు బలగాలను మోహరించింది. ముఖ్యంగా పాంగాంగ్‌ సరస్సు, గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వద్ద శతఘ్నులు, సాయుధ శకటాలు, భారీ సైనిక సామగ్రిని తరలించింది. పలుచోట్ల భారత భూభాగంలోకి ప్రవేశించి గుడారాలు వేసుకొని తిష్ఠ వేశారు. భారత్‌ కూడా అదే స్థాయిలో మోహరింపులు చేపట్టింది. తన భూభాగం నుంచి చైనా బలగాలు వైదొలగాల్సిందేనని స్పష్టంచేసింది. యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది.

ఈ పరిస్థితుల్లో వివాద పరిష్కారానికి ఇరు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగించాయి. ఈ నెల 6న లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత మేజర్‌ జనరల్‌ స్థాయిలో రెండు విడతల్లో చర్చలు జరిగాయి. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇందులో ప్రధానంగా నిర్ణయించారు. ఫలితంగా కొంత మేర ఉద్రిక్తతలు సడలుతున్న సంకేతాలు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కూడా మొదలైంది. భారత సైన్యాధిపతి జనరల్‌ నరవణె శనివారం ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.


కర్నల్‌స్థాయి తెలుగు అధికారి చనిపోవడం ప్రథమం

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ - చైనా సరిహద్దులో కర్నల్‌ సంతోష్‌బాబు మృతిచెందడం మాజీ సైనికాధికారుల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి చెందిన అనేకమంది సైనికాధికారులు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నా కర్నల్‌స్థాయి అధికారి చనిపోవడం మాత్రం ఇదే ప్రథమం. కార్గిల్‌ యుద్ధంలో మేజర్‌ పద్మపాణి ఆచార్య ప్రాణాలు కోల్పోగా తర్వాత 2002 సంవత్సరంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో నగరానికి చెందిన కెప్టెన్‌ వీరరాజారెడ్డి మరణించారు. 2015లో కుత్బుల్లాపూర్‌లోని సూరారం ప్రాంతానికి చెందిన మేజర్‌ తాహిర్‌ హుస్సేన్‌ఖాన్‌ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. నిజానికి పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటుందని, కానీ చైనా సరిహద్దుల్లో సాధారణంగా అటువంటిదేమీ ఉండదని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు. అడపాదడపా ఇరు దేశాల సైనికుల మధ్య కొంత ఘర్షణ జరిగినప్పటికీ ఇలా చనిపోయిన ఘటనలు మాత్రం ఈ మధ్యకాలంలో లేవని ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి శ్రీనేష్‌కుమార్‌ తెలిపారు. సంతోష్‌బాబు మృతికి రాష్ట్ర హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక, సైనిక సంక్షేమశాఖ అధికారి మహ్మద్‌ మహమూద్‌ అలీ విచారం వ్యక్తం చేశారు. చిన్నవయసులోనే కర్నల్‌స్థాయికి ఎదిగి వీరమరణం పొందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


బండరాళ్లే సరిహద్దు: కర్నల్‌ చంద్రశేఖర్‌

ఇప్పుడు ఘటన జరిగిన ప్రాంతంలో నిర్దిష్టంగా సరిహద్దు అంటూ ఏమీ ఉండదని 2015 వరకూ లద్దాఖ్‌లో పనిచేసిన కర్నల్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కేవలం గుర్తు కోసం బండరాళ్లు పెట్టుకొని దాన్నే సరిహద్దుగా భావిస్తుంటారని, ఇరువైపులా ప్రత్యేకంగా విధులు నిర్వహించే పరిస్థితి కూడా ఉండదన్నారు. రెండు దేశాల సైనికులు గస్తీ నిర్వహిస్తుంటారని, భౌగోళికంగా ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.


చైనా ఏకపక్ష వైఖరితోనే ఘర్షణ: భారత్‌

తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వద్ద యథాతథ పరిస్థితులను మార్చేందుకు చైనా సైన్యం ఏకపక్షంగా చేసిన ప్రయత్నం వల్లే తాజా ఘర్షణ నెలకొందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చెప్పారు. దీనివల్ల రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందన్నారు. ఇరు పక్షాలూ అత్యున్నత స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి చైనా సైన్యం కట్టుబడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ‘‘సరిహద్దు నిర్వహణ విషయంలో భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి మా భూభాగంలోనే కార్యకలాపాలను సాగిస్తున్నాం. చైనా కూడా ఇలాగే నడుచుకుంటుందని ఆశిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అయితే ఇదే సమయంలో భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని స్పష్టంచేశారు.


భారత సైనికులే కవ్వించారు: చైనా

భారత సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చైనా బుకాయింపునకు దిగింది. ‘‘రెండు దేశాల బలగాలు అత్యున్నత స్థాయిలో సమావేశమై, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే సోమవారం భారత బలగాలు దీన్ని ఉల్లంఘించి, రెండుసార్లు ఎల్‌ఏసీని దాటాయి. దీనివల్ల తీవ్రస్థాయి భౌతిక ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై భారత్‌కు తీవ్ర నిరసన తెలియజేశాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు గాల్వాన్‌ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందని చైనా సైన్యంలోని పశ్చిమ విభాగం అధికార ప్రతినిధి కర్నల్‌ ఝాంగ్‌ షుయిలీని ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. భారత బలగాలు తమ హామీని ఉల్లంఘించి సోమవారం ఆ లోయ ప్రాంతంలో చొరబడినట్లు ఆయన ఆరోపించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.