close

ప్రధానాంశాలు

టన్ను రూ. 2,700

హైదరాబాద్‌లో రూ. 600 - రూ. 700 వరకు పెంపు
రీచ్‌ల మూసివేత, మేడారం జాతర నేపథ్యంలో పెరిగాయంటున్న విక్రయదారులు

ఈనాడు-హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలోనే టన్నుకు రూ.600 నుంచి రూ.700 వరకు పెరిగింది. భూపాలపల్లి-మహదేవపూర్‌ మధ్య జాతీయ రహదారి విస్తరణ పనులతో ఈ మార్గంలో ఇసుక లారీల్ని అనుమతించడం లేదు. ఇతర మార్గాల మీదుగా ప్రయాణించాల్సి వస్తుండటంతో ఖర్చులు పెరిగాయన్న సాకుతో వ్యాపారులు ఇసుక ధరల్ని పెంచేస్తున్నారు. సంకాంత్రి పండగ నేపథ్యంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) మూడు, నాలుగు రోజుల పాటు కొన్ని రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌ను నిలిపివేయడం కూడా కొంత ప్రభావం చూపుతోంది.

వర్షకాలం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా తెలంగాణలో ఇసుక ధరలు దిగిరావడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సన్న ఇసుకను చిల్లర విక్రయాల్లోభాగంగా టన్ను రూ.2,700 వరకు, దొడ్డు ఇసుకను రూ. 2,400 వరకు అమ్ముతున్నారు.

సుమారు 26 టన్నులుండే లారీలోడ్‌ను కొనుగోలు చేస్తే సన్నఇసుక టన్నుకు రూ.2,400 వరకు లభ్యమవుతోంది. ‘‘వరంగల్‌ మార్గంలో ఏటూరునాగారం, కాళేశ్వరం వైపు ఇసుక లారీలను పోనివ్వట్లేదు. దీంతో ఇతర మార్గాల నుంచి అవి వస్తుండటంతో ఇసుక ధరలు పెరిగాయి. మేడారం జాతర పూర్తయ్యే దాకా ధరలు ఇలాగే ఉంటాయి’’ అని ఉప్పల్‌ ప్రాంతంలో ఇసుక అమ్మకాలు చేస్తున్న ఓ వ్యాపారి చెప్పాడు.

80 శాతం ఇక్కడినుంచే
టీఎస్‌ఎండీసీ రాష్ట్రవ్యాప్తంగా 24 స్టాక్‌యార్డుల నుంచి నిత్యం 25-30 వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను సరఫరా చేస్తోంది. ఇందులో 80 శాతం వరకు జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని రీచ్‌ల నుంచే వెలికితీస్తున్నారు. స్థానికంగా నాణ్యమైన సన్న ఇసుక లభిస్తుండంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు కూడా దూరాభారమైనా ఇక్కడి నుంచే ఇసుకను తెప్పించుకుంటారు. అయితే, ఇక్కడి రీచ్‌ల్లో వర్షపు నీరు చేరినా, ఈ మార్గంలో రహదారులు ధ్వంసమైనా, ప్రముఖులు ఎవరైనా పర్యటించినా ఇసుక సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఓ వీఐపీ పర్యటన సందర్భంగా గత నెలలో రోజంతా ఈ మార్గంలో ఇసుక లారీల్ని నిలిపివేశారు.

నాలుగు రోజులు నిలిచిన సరఫరా
సంక్రాంతి పండగతో పాటు జాతీయ రహదారి 353సి విస్తరణ కారణంగా జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు భూపాలపల్లి జిల్లాలోని రీచ్‌ల నుంచి ఇసుక లోడింగ్‌ను టీఎస్‌ఎండీసీ నిలిపివేసింది. నల్గొండ జిల్లా వంగమర్తి, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం రీచ్‌ల్లోనూ ఇసుక లోడింగ్‌ను ఆపింది. దీంతో గిరాకీకి అనుగుణంగా ఇసుక సరఫరా లేకపోవడాన్ని గుర్తించిన వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర జరగనుండటంతో.. భూపాలపల్లి-మహదేవపూర్‌ మధ్య జాతీయ రహదారిలో కల్వర్టుల్ని విస్తరిస్తున్నారు. సంబంధిత పనులకు ఇబ్బంది కలుగుతుందని భావించి సంక్రాంతికి ముందు నుంచే ఈ మార్గంలో లారీల రాకపోకల్ని నిలిపివేశారు. ప్రస్తుతం కాళేశ్వరం, కాటారం, భూపాలపల్లి, పరకాల, వరంగల్‌ వైపు కాకుండా.. కాటారం తర్వాత మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌ వైపు వాటిని మళ్లిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.