close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
సామూహిక శక్తిని మించింది లేదు

ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లను బంద్‌ చేసి.. ఇంటి గుమ్మం ముందో, బాల్కనీలోనో నిలబడి 9 నిమిషాలపాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్‌ లేదంటే మొబైల్‌ ఫ్లాష్‌లైట్‌ రూపంలో వెలుగులు ప్రసరింపజేయండి. తద్వారా మనమంతా ఒక్కతాటిపై పోరాడుతున్నామన్న భావన అందరిలో ఉద్భవిస్తుంది.

దేశంలో కోట్లాదిమంది ఇళ్లలోనే ఉంటున్నారు. మేం ఒక్కరమే ఏం చేయగలమని ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. ఇంకా ఎన్నిరోజులు ఇలా ఉండాలన్న ప్రశ్న మొలకెత్తి ఉండొచ్చు. ఈ లాక్‌డౌన్‌ అనివార్యం. మనం ఇళ్లలో ఉండటం కూడా తప్పనిసరి.

- ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: భారతీయుల సామూహిక ప్రబలశక్తితోనే కరోనాపై విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో ఎవ్వరూ ఒంటరికాదని, ఒకరికొకరు తోడుగా 130 కోట్ల మంది ప్రజల బలం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ‘‘వచ్చే ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని అన్ని లైట్లను బంద్‌ చేసి.. ఇంటి గుమ్మం ముందో, బాల్కానీలోనో నిలబడి 9 నిమిషాలపాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్‌ లేదంటే మొబైల్‌ ఫ్లాష్‌లైట్‌ రూపంలో వెలుగులు ప్రసరింపజేయండి. నలుమూలలా ప్రతివ్యక్తి ఒక దీపం వెలిగిస్తే ప్రకాశం ఎంతటి శక్తిసంపన్నంగా ఉంటుందో తెలుస్తుంది. తద్వారా మనమంతా ఒక్కతాటిపై పోరాడుతున్నామన్న భావన అందరిలో ఉద్భవిస్తుంది. మేం ఒంటరులం కాదు, ఎవ్వరూ ఒంటరికాదు, 130 కోట్ల మంది ఒక్కటే అని ఆ వెలుగుల ప్రకాశశక్తిలో మనసులో సంకల్పం తీసుకోండి. ఈ సమయంలో ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ గుమిగూడొద్దు. రోడ్లమీదికి, వీధుల్లోకి రాకూడదు. కేవలం మీ ఇంటి దగ్గరే చేయాలి. వ్యక్తిగత దూర లక్ష్మణరేఖను ఎప్పుడూ దాటొద్దు. కరోనా శృంఖలాన్ని ఛేదించడానికి ఇదే రామబాణం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయుల సామూహిక శక్తిసామర్థ్యాలను చాటిచెప్పి, యావత్‌ ప్రపంచం దాని గురించే మాట్లాడుకునేలా చేశామన్నారు.

‘‘ఇక్కడ మనం ఒంటరిగా లేం. 130 కోట్ల సామూహికశక్తి ప్రతి ఒక్కరితో ఉంది. సమయం వచ్చినప్పుడు మన శక్తిని విరాఠ్‌రూపంతో పాటు, దాని భవ్యత, దివ్యతను చాటిచెప్పడం అత్యవసరం. ప్రజలే దైవ స్వరూపాలని మనం భావిస్తుంటాం. అందువల్ల మనం చేస్తున్న ఈ భారీ యుద్ధంలో పదేపదే జనమహాశక్తి విరాఠ్‌ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ ఉండాల్సిందే. ఆ సాక్షాత్కారం మనకు మానసిక బలాన్ని, లక్ష్యాన్ని సాధించే శక్తినీ ఇస్తుంది. మన మార్గాన్ని మరింత సుస్పష్టంగా మారుస్తుంది. కరోనా మహమ్మారి కమ్మిన చీకట్లలోంచే మనం వెలుగువైపు పయనించాలి. వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద సోదరీ, సోదరీమణులను  నిరాశల నుంచి ఆశలవైపు నడిపించాలి. దీని ద్వారా అలుముకున్న అనిశ్చితి, అంధకారాల నుంచి  సముజ్వల నిశ్చిత పదగమనంలో సాగాలి. ఈ అంధకారంలో కరోనాపై పోరాడటానికి నలుదిశలా వెలుగులను విస్తరింపజేయాలి. ఇందుకు మనం ఈనెల 5వ తేదీ ఆదివారం కరోనాకు సవాల్‌ విసరాలి. దానికి వెలుగుశక్తి ఏంటో చాటిచెప్పాలి. ఆరోజు 130 కోట్లమంది ప్రజల మహాశక్తిని జాగృతం చేయాలి. ఆ రోజు రాత్రి కొన్ని నిమిషాలపాటు ఒంటరిగా కూర్చొని భారతమాతను, భారతీయులను గుర్తుచేసుకోండి. వారి మహాశక్తిని స్మరించుకోండి. అది మనకు కష్టకాలంలో పోరాడే శక్తితోపాటు, జయించే ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుంది. మన ఉత్సాహం, స్ఫూర్తికి మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. ఏ దుష్టశక్తీ మనల్ని ఆపలేదు. అందరం ఒక్కటై కరోనాను ఓడించి భారత్‌కు విజయం చేకూర్చిపెడదాం’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


దిగ్గజ క్రీడాకారులకు ప్రధాని వీడియో కాల్‌

కరోనాపై యావద్దేశం యుద్ధం సాగిస్తున్నందున... ఈ మహమ్మారిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని భారతీయ క్రీడా దిగ్గజాలను ప్రధాని మోదీ కోరారు. వ్యక్తిగత దూరం, పరిశుభ్రత పాటించేలా వారిలో స్ఫూర్తి నింపాలన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆయన ఒక్కొక్కరికి వీడియోకాల్‌ చేసి మాట్లాడారు. క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సుమారు గంటపాటు కొనసాగింది. ‘‘ఒక టీం ఇండియాలా మనమంతా వైరస్‌తో తలపడుతున్నాం. మీరు చెప్పే సూచనలకు మంచి ఆదరణ ఉంటుంది. మీరు రగిలించే స్ఫూర్తి దేశ పునరుత్తేజానికి దోహదపడుతుందన్నది నా విశ్వాసం’’ అని ఈ సందర్భంగా ప్రధాని వారితో అన్నారు. వివిధ క్రీడలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లి, గంగూలీ, పీవీ సింధు, బి.సాయి ప్రణీత్‌, మేరీకోమ్‌, రోహిత్‌ శర్మ, జహీర్‌ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌, మను బాకర్‌ తదితర 40 మందికిపైగా దిగ్గజ క్రీడాకారులతో ప్రధాని మాట్లాడారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.