close

ప్రధానాంశాలు

సేవలకు సీఎం ప్రత్యేక ప్రోత్సాహకం

వైద్యఆరోగ్యశాఖ, పారిశుద్ధ్యసిబ్బందికి మార్చినెల సేవలకు గుర్తింపు
సెలవులో ఉన్నవారికి, సస్పెండైన వారికి ఇది వర్తించదు
ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఈనాడు - హైదరాబాద్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన మేరకు.. వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు సహా పురపాలక, గ్రామపంచాయతీల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం అందచేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపథ్యంలో కీలక సేవలు అందిస్తున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. ‘‘మార్చి నెలలో విధులు నిర్వహించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక్క నెలకి మాత్రమే ఇస్తారు. సెలవులో ఉన్నవారికి, సస్పెండైనవారికి, గైర్హాజరైనవారికి వర్తించదు’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆయా ఉద్యోగులకు లభించే మొత్తం ఇదీ..
* వైద్య ఆరోగ్యశాఖలోని అందరు రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్స్‌ సిబ్బందికి మొత్తం వేతనం (గ్రాస్‌ శాలరీ)లో పది శాతం
* జీహెచ్‌ఎంసీలో రెగ్యులర్‌, అవుట్‌సోర్స్‌ పారిశుద్ధ్య కార్మికులకు రూ.7500
* రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య సిబ్బందికి రూ.5000
* గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య, మల్టీపర్పస్‌ కార్మికులకు రూ.5000

మరో 3 విభాగాల ఉద్యోగులకు పూర్తి వేతనాలు
తెలంగాణలో పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీలోని రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బంది, హైదరాబాద్‌ జలమండలిలోని నీటిని సరఫరా చేసే లైన్‌మెన్‌లు, మురుగునీటి నిర్వహణ సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశించింది. జీహెచ్‌ఎంసీలోని రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బంది, హైదరాబాద్‌ జలమండలిలోని రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, సీవేజి వర్కర్లు, రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పురపాలకశాఖ డైరెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జలమండలి మేనేజింగ్‌డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బ్యాంకుఖాతాల్లో నిల్వల వివరాలు చెప్పండి
కరోనా నేపథ్యంలో రాష్ట్ర రాబడులపై తీవ్ర ప్రభావం పడటంతో రాష్ట్ర ఆర్థికశాఖ అందుబాటులో ఉన్న నిధులపై ప్రత్యేక దృష్టిసారించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వ సొసైటీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు సహా అన్ని విభాగాలకు సంబంధించి నిధుల వివరాలను తెలపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది వివరాలు నేటి సాయంత్రంలోగా నమోదు చేయాలి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ముఖ్యమంత్రి కానుకగా ప్రకటించిన రూ.5000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం సిబ్బందికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను https://epanchayat.telangana.gov.in  వైబ్‌స్క్రీన్‌లో బుధవారం సాయంత్రం లోగా నమోదు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు వైబ్‌సైట్‌లోకి లాగ్‌ఇన్‌ అయ్యి సిబ్బంది ఆధార్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, బ్యాంకు, బ్రాంచి పేరు నమోదు చేస్తారు. అనంతరం ఎంపీవో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేసిన సమాచారాన్ని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేస్తారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు.


లాక్‌డౌన్‌ వ్యవధి పెంచినా సహకరించాలి

-  మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: ఇటలీ, అమెరికా దేశాల ప్రజలకు వచ్చిన దుస్థితి మనకు రావొద్దని, దేశంలో లౌక్‌డౌన్‌ వ్యవధిని పెంచినా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీ కరోనా వ్యాప్తితో ఆగమవుతోందని, 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఇటలీ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. హరేరామ హరే కృష్ణ ట్రస్ట్‌, సుధా నారాయణమూర్తి సహకారంతో సిద్దిపేటలో 300 మంది నాయీ బ్రాహ్మణులు, 200 మంది ట్రాలీ, టాటా ఏస్‌ ఆటోలు, సరకు రవాణా వాహనాల డ్రైవర్లు, 325 మంది కారు డ్రైవర్లు, 500 మంది హమాలీలకు మంగళవారం 8 రకాల నిత్యావసర సరకులు, బియ్యం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్ర, దేశం ప్రస్తుతానికి రక్షిత జోన్‌లోనే ఉన్నాయన్నారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిద్దిపేట ప్రజలు స్ఫూర్తిమంతంగా వ్యవహరించడంతో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలు ఆకలితో అలమటించరాదని మంత్రి హరీశ్‌రావు ఈ ప్రక్రియ చేపట్టారన్నారు. ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉందామన్నారు. బల్దియా ఛైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, ఏఎంసీ ఛైర్మన్‌ పాల సాయిరాం, నటుడు శివారెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.