close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మోదీ మంచి మూడ్‌లో లేరు

చైనాతో వివాదమే కారణం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌, దిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడడంతో భారత ప్రధాని మోదీ మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన శ్వేతసౌధంలో మాట్లాడుతూ భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు. ‘‘అమెరికాలోని మీడియా కన్నా భారత్‌లోనే నేనంటే ఎక్కువగా ఇష్టపడుతారు. అభిమానిస్తారు. మోదీ అంటే నాకు ఇష్టం. ఆయన గొప్ప జెంటిల్మన్‌. భారత్‌-చైనాల మధ్య పెద్ద వివాదం ఏర్పడింది. జన సంఖ్యలో రెండూ పెద్ద దేశాలు. రెండింటి వద్దా బలమైన సైన్యాలు ఉన్నాయి. భారత్‌ సంతోషంగా లేదు. చైనా కూడా సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మీకొక విషయం చెబుతా. నేను ప్రధాని మోదీతో మాట్లాడా. చైనాతో ప్రస్తుతం జరుగుతున్న విషయమై ఆయన మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించడం లేదు’’ అని చెప్పారు. మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్వీట్‌ చేశారు కదా.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. ‘‘సహాయం కావాలని అడిగితే తప్పకుండా చేస్తాను. మధ్యవర్తిత్వమో, రాయబారమో.. మేలు కలిగిస్తుందని వారు భావిస్తే తప్పకుండా చేస్తా’’ అని పునరుద్ఘాటించారు.

మోదీ-ట్రంప్‌లు మాట్లాడుకోలేదు
ట్రంప్‌ మాటలను బట్టి మోదీతో ఆయన సంభాషించినట్లు తెలుస్తోంది. అయితే, లద్దాఖ్‌లో భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడిన అనంతరం మోదీ, ట్రంప్‌లు ఫోనులో మాట్లాడుకోలేదని భారత ఉన్నత స్థాయి అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మోదీతో ఫోనులో మాట్లాడినట్టు ట్రంప్‌ చేసిన ప్రకటనను దాదాపుగా ఖండించాయి. ఇరువురు నేతలూ ఏప్రిల్‌ నాలుగున హైడ్రోక్లోరోక్విన్‌ మాత్రల సరఫరాపైనే మాట్లాడుకున్నారని, ఆ తరువాత ఎలాంటి సంభాషణలూ చోటుచేసుకోలేదని తెలిపాయి.

అమెరికా సాయం అవసరం లేదు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ టి ఈస్పర్‌కు ఫోన్‌ చేసి సరిహద్దు వివాద పరిష్కారంలో ఆ దేశ సాయం అవసరం లేదని తెలిపారు. సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.

మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన చైనా
బీజింగ్‌: మధ్యవర్తిత్వం నెరుపుతానంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనను చైనా తిరస్కరించింది. భారత్‌తో నెలకొన్న సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని, మూడో దేశం ప్రమేయం అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ స్పష్టం చేశారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య ఓ యంత్రాంగం ఉందని, చర్చల ద్వారా ముందుకెళ్లే సత్తా దీనికి ఉందని తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.