close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూచీ ఏపీ సర్కారుదే

అమరావతిపై వాగ్దానం చేసి వెనక్కి తగ్గడానికి వీల్లేదని ‘సుప్రీం’ చెప్పింది
చట్టబద్ధ ప్రయోజనాలను విస్మరించలేరు
న్యాయ నిపుణుల అభిప్రాయం
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు చట్ట రూపం దాల్చినప్పటికీ న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాకే రాజధాని అమరావతికి రైతులు వేల ఎకరాల భూములనిచ్చారని తెలిపారు. రాజధాని నిర్మిస్తామని, ప్రగతి పనులు చేపడతామని హామీనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి వీల్లేదని, ఓ తీర్పులోనూ సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టతనిచ్చిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణంతో చట్టబద్ధమైన నిరీక్షణ ఫలితం/ప్రయోజనం (లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌) తమకు దక్కుతాయన్న కారణంతో రైతులు భూములిచ్చిన అంశాన్ని ప్రభుత్వం విస్మరించడానికి వీల్లేదన్నారు. రాజధానికి భూములిచ్చిన భాగస్వాములు, రైతుల సమస్యను పరిష్కరించకుండా సీఆర్‌డీఏను రద్దు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై తన చర్యలను సమర్థించుకునేందుకు ప్రభుత్వం వద్ద చట్టబద్ధంగా సరైన కారణాలు లేవన్నారు.
అమరావతిలో రాజధానిని నిర్మిస్తున్నారని తెలిసే కేంద్రం నిధులిచ్చిందని, వారిని సంప్రదించకుండా రాజధాని మార్చడం సమంజసం కాదని తెలిపారు.


న్యాయస్థానాలు రద్దు చేసే అవకాశం
- ఏపీ ఐలు రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌

‘ఒక బిల్లుపై 3 నెలల్లో శాసనమండలి స్పందించకపోయినా, సెలక్ట్‌ కమిటీకి వెళ్లి నిర్ణయం రానప్పుడు మాత్రమే శాసనసభలో మళ్లీ తీర్మానించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. మండలిలో సెలక్ట్‌ కమిటీకి బిల్లులను పంపకపోవడానికి కారణమెవరనేది పరిశీలించాలి. మండలిలోని అధికారులను రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించకుండా.. సెలక్ట్‌ కమిటీని ఏర్పాటుచేయకుండా చేశారు. దీన్ని బట్టి బిల్లులపై మండలి నిర్ణయాధికారాన్ని కాలరాశారని స్పష్టమవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను పాటించలేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా గవర్నర్‌ బిల్లులను ఆమోదించారు. ఈ చట్టాలను సవాలు చేస్తే.. రాజ్యాంగస్ఫూర్తిని కాపాడే న్యాయస్థానాలు రద్దు చేసే అవకాశముంది. ప్రభుత్వ హామీలను నమ్మి రైతులు భూములిచ్చాక విధాన నిర్ణయాలు మారాయంటూ ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి వెళ్లడానికి వీల్లేదు. ఈ విషయంలో 2010లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలనిచ్చింది.
* అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మొదట శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏ పార్టీలూ అభ్యంతరం చెప్పనందున రైతులు విశ్వసించి భూములనిచ్చారు. ఇప్పుడు సీఆర్‌డీఏను రద్దు చేయడం అసమంజసం. గత ప్రభుత్వ విధానాలను మార్చామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడాన్ని సుప్రీం ఒప్పుకోదు. అలాంటి నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని సుప్రీం తీర్పులున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు న్యాయసమీక్ష పరిధిలోనివే. ఈ బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. గతప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించడం ద్రోహమే. రాష్ట్రపతి ప్రకటన ద్వారా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతితో సంప్రదించకుండానే ఇప్పుడు కర్నూలుకు మారుస్తామనడం అసమంజసం.
* రాజధానిపై కమిటీల ఏర్పాటు, బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టులో కేసులున్నాయి. బిల్లులు తాజాగా చట్టాలుగా రూపొందినందున ఈ వ్యాజ్యాల్లో అభ్యర్థనను సవరించమని కోరవచ్చు. లేదా ఈ చట్టాలపై వ్యాజ్యాలు వేయవచ్చు.
* అమరావతిలో రాజధానిని నిర్మిస్తున్నారని తెలిసే కేంద్రం నిధులిచ్చింది. పలు నిర్మాణాలకు రూ.10వేల కోట్లకుపైగానే ఖర్చయ్యాయి. ప్రజాధనం రక్షణ బాధ్యత కోర్టులపై ఉంది. రాజకీయ కారణాలతో గత ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని ఇష్టానుసారం మార్చవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్పింది. వంచన, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మార్చవచ్చని పేర్కొంది’ అని తెలిపారు.


దేశంలోనే ఇది తొలిసారి
-మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌

‘ఒకసారి ఓ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక రద్దు చేస్తూ మరో చోట ఏర్పాటుకు బిల్లు చేసి చట్టాలు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. కొన్నిచోట్ల ప్రజల సౌకర్యార్థం, చరిత్రాత్మక కారణాలతో అన్ని పక్షాల ఏకాభిప్రాయంతో హైకోర్టులను తరలించారు. ఏపీ రాజధానిపై మొదట్లోనే పూర్తి స్థాయిలో చర్చించాల్సింది. అలాంటి ప్రయత్నం లేకపోవడం, ప్రజాభిప్రాయానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాలకు ప్రయత్నించారు. అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుంది. కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించడం దురదృష్టకరం. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతి కాదని కొన్ని ప్రాంతాలకు దూరంగా ఉన్న కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటున్నారు. అందరి ఆమోదంతోనే తమిళనాడులోని మధురైలో హైకోర్టు బెంచిని ఏర్పాటుచేసుకున్నారు. ఏపీ విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఒకచోట ఉంటే పాలనా సౌలభ్యం కలుగుతుంది.

రైతులకు ప్రశ్నించే హక్కు ఉంది..
అమరావతిలో అన్ని వ్యవస్థలున్న రాజధాని ఏర్పాటు కానప్పుడు అభివృద్ధి సాధ్యం కాదు. భూములిచ్చిన రైతుకు అభివృద్ధి చేసిన స్థలాలను ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం హామీనిచ్చి నెరవేర్చడంలో విఫలమైతే రైతు పరిహారం కోరవచ్చు. మూడు
రాజధానులను, సీఆర్‌డీఏ రద్దుపై న్యాయస్థానంలో వారు సవాలు చేయవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.