close

తాజా వార్తలు

నెలరోజులు మజ్జిగ మాత్రమే తాగా!

ఒకరు నటనతో, మరొకరు దర్శకత్వంతో కడుపుబ్బా నవ్వించేలా చేస్తారు. ఒకరిది 42ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం.. మరొకరిది 5 సినిమాలు మాత్రమే తీసిన అనుభవం. ఒకరు కామెడీతో తనదైన ముద్రవేస్తే. మరొకరు దర్శకత్వంతో ఐదూ సూపర్‌హిట్‌లు తీశారు. వారు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే, ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారిలా..

ప్రస్తుతం లైఫ్‌ ఎలా ఉంది?

రాజేంద్రప్రసాద్‌: సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికీ నాకు అవకాశాలు ఇస్తున్న సినీ కళామతల్లి బిడ్డలకు ధన్యవాదాలు. 

మీ వయసు ఎంత?

రాజేంద్రప్రసాద్‌: 42ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అంటే నా వయసు 63ఏళ్లు(నవ్వులు) 

మీరు దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో రాజేంద్రప్రసాద్‌ను పెట్టుకున్నట్లు ఉన్నారు?

అనిల్‌ రావిపూడి: ‘పటాస్‌’ తప్ప. నేను రాజేంద్రప్రసాద్‌గారికి వీరాభిమానిని. నా జీవితంలో ఆయనవే ఎక్కువ సినిమాలు చూశా. ఆయన టైమింగ్‌, పంచ్‌లు బాగా బాడీలోకి ఎక్కేశాయి. ఎప్పుడైనా కలిస్తే ఒక అభిమానిగా తానేంటో చూపిద్దామనుకునేవాడిని. ఆయనతో సినిమాలు చేయడం నా అదృష్టం. ‘సుప్రీమ్‌’ సినిమాతో మొదలు పెట్టాం. అలా అనుబంధం ఏర్పడింది. నాకంటే కూడా నా పెన్ను ఆయనను ఎక్కువగా ఇష్టపడుతుంది. 

అనిల్‌ రావిపూడితో పనిచేయడం ఎలా ఉంది?

రాజేంద్రప్రసాద్‌: రచయితగా అనిల్‌ రావిపూడి టైమింగ్‌ నిజంగా అద్భుతం. ఇక దర్శకుడిగా ఆయనకున్న విజన్‌ కూడా గొప్పది. సెట్‌లో అస్సలు టెన్షన్‌ పడరు. తనకేం కావాలో అది చేయించుకుంటారు. జంధ్యాలగారి తర్వాత ఆ స్థాయి హాస్య చతురత ఉన్న దర్శకుడు. నా సినీ కెరీర్‌లో అత్యధికంగా 92 రోజులు ‘సరిలేరు నీకెవ్వరు’కు చిత్రానికి పనిచేశా. అంటే మహేశ్‌బాబుగారు ఎన్నిరోజులు షూటింగ్‌కి వస్తే నేనూ అన్ని రోజులు షూట్‌లో ఉన్నా. 

ఇండస్ట్రీలో ఏమవుదామని వచ్చారు?
అనిల్‌ రావిపూడి: డైరెక్టర్‌ అవుదామనే వచ్చా. మా బాబాయ్‌ అరుణ్‌ ప్రసాద్‌ దర్శకుడు. ‘తమ్ముడు’ సినిమాకు డైరెక్టర్‌. ఆయన దగ్గర అప్రెంటిస్‌గా చేరా. అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పారు. ‘నేను ఉన్నాను కాబట్టి, ఇండస్ట్రీలోకి వచ్చేందుకు డోర్‌ తీస్తా. ఒకసారి లోపలికి వచ్చాక నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. పడినా, లేచినా, నీదే బాధ్యత’ అన్నారు. సీన్‌ ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీయాలి? తదితర చాలా విషయాలు అరుణ్‌ ప్రసాద్‌గారి నుంచి నేర్చుకున్నా. 
రాజేంద్రప్రసాద్‌: అన్ని చెప్పాడు కానీ, తాను యాక్టర్‌ అవ్వాలన్న విషయం మాత్రం చెప్పలేదు. 

మీ సొంతూరు ఏది?
అనిల్‌ రావిపూడి: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారి పాలెం.
రాజేంద్రప్రసాద్‌: మా కృష్ణాజిల్లా నిమ్మకూరు. నందమూరి తారక రామారావుగారి ఇంట్లో పుట్టా. 

ఆయనకు మీకూ ఉన్న అనుబంధం ఏంటి?
రాజేంద్రప్రసాద్‌: ఎన్టీఆర్‌గారి ఇంట్లో 24ఏళ్లు ఉన్నా. అప్పటికే ఆయన స్టార్‌ హీరో. చిన్నప్పుడు ఆయన షూటింగ్‌లు చూడటానికి అప్పుడప్పుడూ చెన్నై వెళ్లేవాడిని. ఒకరోజు గుర్రపు స్వారీ షూటింగ్‌ ఉందంటే చూద్దామని వెళ్లి చూసి షాకయ్యా.. చెక్క మీద కూర్చొని వెనక్కీ.. ముందుకీ ఊగుతూ, నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటున్నారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి నాకు ఒక అనుమానం చెబుతారా? అన్నాను. ‘ఏమిటది’ అన్నారు. ‘గుర్రంపై వెళ్తుంటే గాలి వస్తుంది కదా! చెమట ఎలా పడుతుంది’ అని అన్నా. ఆయన వెంటనే ‘వీరిని తీసుకెళ్లి ఏమి కావాలో అది తాగించండి’ అన్నారు. (నవ్వులు) 

మరి సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి?
రాజేంద్రప్రసాద్‌: నేను ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా. అయితే, వయసు తక్కువగా ఉండటంతో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఇంటికి వచ్చేశా. అప్పుడు ఎన్టీఆర్‌ ‘తాతమ్మకల’షూటింగ్‌ విజయవాడలో జరుగుతుంటే నాన్నతో కలిసి వెళ్లా. ‘ఏం చేస్తున్నారు’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా. అయితే, సినిమాల్లో నటిద్దామని అనుకుంటున్నా’ అన్నాను. అప్పుడు త్రివిక్రమరావుగారిని పిలిచి నన్ను యాక్టింగ్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడ నటనలో గోల్డ్‌మెడల్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ కూడా మెచ్చుకున్నారు. అయితే, ‘పౌరాణికం చేయడానికి మేమున్నాం, సాంఘిక చిత్రాలు చేయడానికి బ్రదర్‌ అక్కినేని, ఫైటింగ్‌ చిత్రాలకు కృష్ణ, రొమాంటిక్‌ సినిమాలకు శోభన్‌బాబు ఉన్నారు. మీరేం చేస్తారు’ అని అడిగారు. ఆయన ప్రశ్నే నేను కామెడీ హీరో అయ్యేలా చేసింది. 

‘పటాస్‌’, ‘టెంపర్‌’ కథలు చాలా దగ్గరగా ఉంటాయి. ఆ విషయం మీకు తెలియదా?

అనిల్‌ రావిపూడి: అవును! చెడ్డ వ్యక్తిగా ఉన్న పోలీస్‌ మంచి వాడిగా మారడం, ఒక అమ్మాయి కోసం పోరాటం చేయటం. ఇది ఎలిమెంట్‌ కానీ, రెండు చిత్రాలు వేర్వేరుగా ఉంటాయి. ‘పటాస్‌’ కథ  2012 చివర్లో రాసుకుని మొదట రవితేజకు వినిపించా. ఆయన ‘ఇలాంటిదే ఒక కథ ఈ మధ్యే విన్నాను’ అని చెప్పారు. ‘సర్లే కథ దగ్గరగా ఉన్నా, మనం తీసే విధానం వేరుగా ఉంటుంది కదా’ అనుకున్నా. అలా రెండు వారాల వ్యవధిలో ‘పటాస్‌’, ‘టెంపర్‌’ కథలు విడుదలయ్యాయి. రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. 

ఒక మంచి పొజిషన్‌కు వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ను కలిస్తే ఏమన్నారు?

రాజేంద్రప్రసాద్‌: నన్ను ఇనిస్టిట్యూట్‌లో చేర్చిన దగ్గరి నుంచి హాలీడే ఉంటే, తెల్లవారుజామున 3గంటలకు వెళ్లి ఆయన్ను కలవాల్సిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. ఎప్పటిలాగే తెల్లవారుజామున ఆయన ఇంటికి వెళ్లా. ‘ఏం ప్రసాద్‌ అందరినీ నవ్విస్తున్నారట. మేము కూడా మీ సినిమాలు చూస్తున్నాం.’ అని అంటూ బల్ల సొరుగులో నుంచి సినిమా మ్యాగజైన్‌ తీసి, మధ్య పేజీ ఓపెన్‌ చేసి చూపించారు. ‘నీకు బుద్ధి లేదా’ అన్నారు. నేను ఒక్కసారిగా షాకయ్యా. ‘ఏం జరిగింది’ అని అడిగితే, ‘కన్నయ్య కిట్టయ్య’ పోస్టర్‌ చూపించి ‘కృష్ణుడి తలపై కిరీటం పక్కకు వంగి ఉంది చూసుకోవా’అన్నారు. ఇలా ఎన్నో మంచి విషయాలు నాకు చెబుతూ ఉండేవారు. 

ఆ తర్వాత మరోసారి నా మొదటి సినిమా పోస్టర్‌ వేశారు. ఆ పోస్టర్‌లో నా ముఖంపై ఎవడో పేడ కొట్టాడు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌గారికి చెబితే, ఆయన పెద్దగా నవ్వారు. ‘నీ మీద పేడ కొట్టాడు అంటే, వాడికి నీపై ఈర్ష్య కలిగిందని అర్థం. అంటే నువ్వు ఎదుగుతున్నావని గుర్తు పెట్టుకో’ అన్నారు. 

సుప్రీమ్‌ సినిమాలో బెల్లం శ్రీదేవి అనే పేరు పెట్టారు. ఆ అమ్మాయి ఏమైనా నీ క్లాస్‌మేటా.?

అనిల్‌ రావిపూడి: ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌గా వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌. ఆ పేరు చూసి రాశీఖన్నాకు ఆ పేరు పెట్టా. 

‘ఎఫ్‌2’ ఎవరి స్టోరీ?

అనిల్‌ రావిపూడి: ప్రతి మగాడి స్టోరీ. (నవ్వులు) అందులో 20 నుంచి 30 వరకూ నాకు వ్యక్తిగతంగా ఎదురైన అనుభవాలు ఉన్నాయి. ఎక్కువగా వెంకటేశ్‌గారి సన్నివేశాలు నా జీవితంలో జరిగాయి. సినిమా చూసి మా ఆవిడ ఏమీ అనకూడదని, ముందే తనని సిద్ధం చేశా. ‘అందులో కొన్ని సీన్లు మనవి ఉంటాయి. నువ్వు ఏమీ అనుకోవద్దు. పైగా డబ్బులు కూడా వస్తాయి కదా’ అని చెప్పా. 

రాజేంద్రప్రసాద్‌: అందులో భర్త ఏంటి? భార్య ఏంటి? అనే విషయాలు చెబుతూ నాజర్‌ తీసుకునే క్లాస్‌ షాకింగ్‌గా అనిపించింది. నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. చాలా మంది జడ్జిలు కూడా చూసి మెచ్చుకున్నారు.

విజయశాంతికి చాలా మంది దర్శకులు కథలు చెప్పినా, మీరు ఏం మాయ చేసి ఒప్పించారు?

అనిల్‌ రావిపూడి: అసలు ఆవిడకు సినిమాలు చేయాలని లేదు. నేను మాత్రం అదే పనిగా వాళ్ల ఇంటికి వెళ్లి అడుగుతుండటం. సినిమాలో నటించమని అడగటం. ఒకరకంగా చెప్పాలంటే, ‘స్వాతి ముత్యం’లో కమల్‌హాసన్‌లాగా తిరుగుతూ ఉండేవాడిని. ఒక రోజు పోనీలే అని కథ వింటానని అన్నారు. కథ విన్నాక ఆమె నో చెప్పలేదు. 

‘లేడీస్‌ ట్రైలర్‌’ తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి కదా!

రాజేంద్రప్రసాద్‌: చిరంజీవే ఆ సినిమా ప్రివ్యూను మూడుసార్లు చూశారు. ‘కామెడీ సినిమా చూస్తారా.. రాజా’ అంటూ ఉండేవారు. ఫస్ట్‌ షో పడిన తర్వాత మళ్లీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

నెల రోజుల పాటు భోజనం కూడా తినకుండా మజ్జిగ మాత్రమే తాగి ఉన్నారట!

రాజేంద్రప్రసాద్‌: విభిన్న పాత్రలు చేస్తున్నప్పుడు ఒక మహిళ పాత్ర చేయాల్సి వచ్చింది. ఒక పురుషుడు.. మహిళ పాత్ర పోషించాలంటే చాలా కష్టం. ఏ మాత్రం తేడా వచ్చిన నవ్వుల పాలు అయిపోతాం. అందుకోసం డైట్‌ చేయాల్సి వచ్చింది. నెల రోజుల పాటు కేవలం ఒక చపాతి, గ్లాస్‌ మజ్జిగ మాత్రమే తీసుకున్నా. ఆ పాత్ర కోసం అంతలా కష్టపడ్డా. అక్కినేని నాగేశ్వరరావుగారు రికమెండ్‌ చేసి, అందులో నేను చేసిన పాత్రకు గానూ ‘ఉత్తమనటి’ అవార్డు నాకు ఇప్పించారు. 

మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు?

అనిల్‌ రావిపూడి: నాన్న ఆర్టీసీ డ్రైవర్‌. అమ్మ గృహిణి. 

అహనా పెళ్లంట! మీ కెరీర్‌కు ఎంత ప్లస్‌ అయింది?

రాజేంద్రప్రసాద్‌: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాకు ‘లేడీస్‌ టైలర్‌’ ఒక మార్కు అయితే, ఏ కమర్షియల్‌సినిమాకు కామెడీ సినిమా తీసిపోదని నిరూపించింది ‘అహనా పెళ్లంట’. ఆ సినిమా తర్వాత రామానాయుడుగారు కారు ఇచ్చారు. 

నిర్మాత కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?

రాజేంద్రప్రసాద్‌: ‘మేడమ్‌’తో నిర్మాతను అయ్యాను. ప్రతి ఆర్టిస్ట్‌కు ఒక అభిరుచి ఉంటుంది. దాన్ని మరొకరిపై రుద్దాలంటే నాకు భయం. సంవత్సరానికి 12 సినిమాలు చేసే రోజుల్లో ఎవరిని అడిగినా సినిమా తీసి పెడతారు. కానీ, నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ‘రాంబంటు’ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా తర్వాత నిర్మాతగా పనికి రానని నాకు అర్థమైంది. ఇప్పటివరకూ 245 సినిమాలు చేశా. త్వరలోనే ‘క్విక్‌గన్‌ మురుగన్‌2’ ప్రారంభమవుతుంది. 

‘పటాస్‌’ అవకాశం ఎలా వచ్చింది?

అనిల్‌ రావిపూడి: ఆ సినిమాకు నిర్మాత, హీరో కల్యాణ్‌రామ్‌గారే కావడంతో నా పని సులభం అయింది. నాకు ఛాలెంజింగ్‌ విషయం ఏంటంటే, అప్పటికే ఆయన ‘ఓం’ తీసి ఇబ్బందులు పడ్డారు. సొంతంగా సినిమా తీసే పరిస్థితిలో లేరు. ఐదారు నెలలు విరామం తీసుకుంటానని అన్నారు.  అయితే, కథ వినమని వెంటపడుతూ ఉండేవాడిని. ఒకసారి ‘సరే’ అనడంతో కథ చెప్పా. చెప్పిన వెంటనే ఆయనకు నచ్చింది. బయట చేద్దామని చాలా మందిని అడిగాం. కానీ, కుదరలేదు. చివరకు కల్యాణ్‌రామ్‌గారు పిలిచి, ‘అనిల్‌.. ఎవరూ చేయకపోయినా, ఈ సినిమా మనం చేద్దాం. నేనే నిర్మిస్తా. నిన్ను డైరెక్టర్‌ను చేస్తా’అని హామీ ఇచ్చారు. నన్ను నమ్మి, సినిమా తీసిన మొదటి వ్యక్తి ఆయన. ఆయనకు ఎప్పటికీ రుణ పడి ఉంటా. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.