close

తాజా వార్తలు

ప్రైవేటు రూటు

ఆర్టీసీలో 5,100 రూట్‌ పర్మిట్‌ల జారీకి మార్గం సుగమం
మంత్రిమండలి తీర్మానాన్ని తప్పుపట్టలేమన్న హైకోర్టు
ప్రభుత్వానికి చట్టమే అధికారం ఇచ్చిందని వెల్లడి
ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేత
ఈనాడు - హైదరాబాద్‌

* 1988 మోటారు వాహనాల చట్టంలోని 67(3), 102 సెక్షన్‌లు ఎంతో కీలకం. అవి ప్రభుత్వ రంగ సంస్థ బస్సులకు సమాంతరంగా ప్రైవేటు బస్సులను తీసుకురావచ్చని చెబుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కట్టబెడుతున్నాయి.

* సెక్షన్‌ 67(1)(డి) రాష్ట్ర ప్రభుత్వం ప్రభావవంతమైన పోటీని ప్రోత్సహించవచ్చని స్పష్టంగా చెబుతోంది. ఇందులో ఆర్టీసీ కూడా ఉంది.

ర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి మంత్రిమండలి తీర్మానాన్ని తప్పుపట్టలేమంది. ‘‘ప్రైవేటీకరణలో భాగంగా 5,100 పర్మిట్‌లు జారీ చేయాలన్న మంత్రిమండలి నిర్ణయం సహేతుకమైనది. అందులో జోక్యం చేసుకోం. ప్రభుత్వ రంగం సంస్థ బస్సులకు సమాంతరంగా ప్రైవేటు బస్సులను తీసుకువచ్చి ఆరోగ్యకరమైన పోటీని తయారు చేసే అధికారాన్ని చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. మంత్రిమండలి.. పర్మిట్‌ల జారీ ప్రక్రియను చేపట్టే అధికారాన్ని రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగించింది. అది క్వాసీ జ్యుడిషియల్‌ సంస్థ. దానికి అధికారం ఇవ్వడం సరికాదు. ఆ ప్రక్రియ చేపట్టాల్సింది రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి’’ అని పేర్కొంది. ఈ ప్రక్రియ మొత్తం మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 102 ప్రకారం చేపడతామని, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ద్వారానే ముందుకు తీసుకెళ్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రిమండలి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణలో భాగంగా 5,100 పర్మిట్‌ల జారీకి మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెక్షన్‌ 99, 104 సెక్షన్‌లకు, చాప్టర్‌ 5, 6లకు విరుద్ధమన్న పిటిషనర్‌ వాదనలతో విభేదించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అందువల్ల 10 రోజులపాటు తీర్పు అమలును నిలిపివేయాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది.

కొత్త రక్తం ఎక్కించాలి
‘‘ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అందువల్ల రవాణా రంగానికి కొత్త రక్తం ఎక్కించాలి. దీనికి అనుగుణంగానే మంత్రిమండలి నిర్ణయం ఉంది.  ప్రైవేటు రవాణాను తీసుకువచ్చి ప్రజలకు మేలు చేసేలా ఉంది. ఇందులో దురుద్దేశాలున్నాయని అనుకోవడం లేదు. రాష్ట్ర సార్వభౌమ కర్తవ్యాల్లో ప్రజారవాణాలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఒకటి. మంత్రిమండలి నిర్ణయాన్ని మేము పరిశీలించాం. ఏజీ అది రహస్యమని చెప్పడంతో యథాతథంగా పేర్కొనడంలేదు. పిటిషనర్‌ రకరకాల అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చట్టం ఉద్దేశాన్ని మొత్తం కలిపి చూడాలిగానీ ముక్కముక్కలుగా విడదీసి చూడరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

అభ్యంతరాలను స్వీకరించాలి
ఆర్టీసీతోపాటు ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు, సంస్థలకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ తరువాత 30 రోజుల్లో ప్రాంతీయ పత్రికల్లో నోటీసులు ఇచ్చి అభ్యంతరాలను స్వీకరించాలంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి పరిష్కరించాలని, ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వమే చేయాలంది.

సరళీకృత ఆర్థిక వ్యవస్థలో రవాణా భాగమే
‘‘దేశం సరళీకృత ఆర్థిక వ్యవస్థ వైపు నడుస్తోంది. ఇందులో రవాణా రంగం కూడా భాగమే. గతంలో పెద్ద వ్యవస్థలు లేనందున ప్రజల రవాణా అవసరాలు తీర్చడానికి చట్టం ద్వారా ఆర్టీసీ వ్యవస్థను తెచ్చారు. ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని తగ్గించడానికి, కాలానుగుణంగా దాన్ని సవరించడానికి తగిన అధికారాన్ని ప్రభుత్వానికి చట్టమే ఇచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థలు ఆధిపత్యం చలాయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రవాణా రంగాన్ని అభివృద్ధి చేయడానికి పోటీని తిరస్కరించడంకంటే ఆహ్వానించడమే సరైన నిర్ణయం. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించే పరిస్థితులు ఇకపై ఉండరాదు. ఇందులో భాగంగానే మోటారు వాహన చట్టంలో 67(3)ను చేర్చుతూ సెప్టెంబరు 2019 కేంద్రం సవరణ తెచ్చింది. అయితే ప్రైవేటు ఆపరేటర్లు 50 శాతం లోపలే ఉండాలి, దాన్ని మించరాదని చట్టం చెబుతోంది’’ అని ధర్మాసనం వివరించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.